Maoist leader Chalapathi : దండకారణ్యంలో ఉంటూ మావో భావజాలంతో దశాబ్దాలుగా రాజ్యం మీద తుపాకీతో తిరుగుబాటు చేస్తున్న మావోయిస్టులకు దేశంలో గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత హోం మంత్రి అమిత్ షా అన్నట్లుగా ఉద్యమం చివరి దశకు వచ్చిందా.? అనే అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణ చేరికలే లక్ష్యంగా గతంలో దాడులు చేసిన భద్రతా దళాలు.. నేడు మావోయిస్టుల కంచుకోటల్లోకి చొరబడి వారి అగ్రనాయకత్వాన్ని గురిపెడుతున్నాయి. అసలు నాయకుల్నే కొడితే.. తిరుగుబాటు ఉద్యమాన్ని తుదముట్టించవచ్చని భావిస్తున్న భద్రతా బలగాలు.. ఇటీవల అగ్రశ్రేణి మావోల నాయకుడు.. చలపతిని మట్టుబెట్టాయి. నిత్యం.. డజన్ల మంది అనుచరులతో అత్యంత రక్షణ మధ్య ఉండే చలపతి మరణానికి 2016 నాటి ఓ ఫోటో కారణమంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ.. చలపతి గుర్తింపునకు, ఆయన ఉనికిని పట్టించిన.. ఆ స్మార్ట్ ఫోన్ సెల్పీ కథ తెలుసుకోవాల్సింది.
అత్యంత తెలివిగా భద్రతా దళాల కళ్లుకప్పి.. ఆయుధాల డిపోలపై దాడుల నుంచి సైనిక వాహనాల పేల్చివేత వరకు విజయవంతంగా తన దళాల్ని నడిపిన వ్యక్తి రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం. సీపీఐ (మావోయిస్ట్) పార్టీలోని అగ్రశ్రేణి ఏడుగురు నాయకులలో ఒకరు. ఇటీవల ఒడిశా-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భద్రతా దళాల భారీ కూబింగ్ ఆపరేషన్ లో మరణించాడు. ఈ విషయం మావోయిస్టు దళాలకు పెద్ద ఎదురుదెబ్బ కాగా.. భద్రతా దళాలకు అతిపెద్ద విజయంగా చెబుతున్నారు. మరి కీలక నాయకుడిని పోలీసులు ఎలా గుర్తించారు. చనిపోయింది.. ఏడుగురు కమాండర్ లలో ఒకరైన అత్యంత కీలక వ్యక్తి అని ఎలా కనిపెట్టారు అంటే.. దాని వెనుక ఓ అనుకోని సంఘటన ఉందంటారు.. పోలీసులు.
చలపతి నాయకత్వంలో ఆపరేషన్లు..
మావోయిస్టుల తరఫున భద్రతా బలగాలపై అనేక దాడులు చేసిన చలపతి.. తన దళాలకు గుర్తుంచుకునే విజయాల్ని అందించాడు. 2008లో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో మావోయిస్టుల దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఇలాంటి దాడుల ద్వారా తాము ఇంకా బలంగానే ఉన్నామనే సంకేతంతో పాటు కొత్త రిక్రూట్ మెంట్లను ఆకర్షించడం, బలగాల నుంచి ఆయుధాలు దోచుకువెళ్లడం ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తుంటాయి. ఈ దాడికి నాయకత్వం వహించింది.. చలపతే అంటారు పోలీసు ఉన్నతాధికారులు.
అలాగే.. మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే(రామకృష్ణ)కు సన్నిహితుడిగా పేరుంది. అలా రామకృష్ణ వ్యూహ రచన చేసిన అనేక దాడులను ముందుండి నడిపించడంలో చలపతిదే ప్రధాన పాత్ర అని చెబుతుంటారు. ఎన్నో దాడుల్లో మావోయిస్టులు బలగాల చేతికి చిక్కకుండా విజయవంతంగా తప్పించుకునేలా వ్యూహాలు అమలు పరుస్తాడు. 2006లో నయాగర్ లో పోలీసు ఆయుధాగారాన్ని మావోయిస్టులు దోచుకున్నారు. అప్పుడు.. ఆ ప్రాంతానికి చేరుకునే అన్ని ప్రాంతాలకు చెట్ల కొమ్మల్ని నరికేసి.. చేపట్టిన ఆపరేషన్ విజయవంతం చేశాడని పోలీసు అధికారులు చెబుతుంటారు. అంతే కాదు.. మోస్ట్ వాంటెడ్.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ మడావి హిడ్మాకు చలపతి మెంటార్‌గా వ్యవహరిస్తారనే పేరుంది. ఇలా.. మావోయిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ.. అనేక పోరాటాలు నడిపించారు.
అతని ఆధ్వర్యంలో సంచలనం సృష్టించిన ఘటనల్లో 2003లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై మావోయిస్టులు విజయవంతంగా చేసిన హత్యా ప్రయత్నంగా చరిత్రలో గుర్తిండిపోయిన ఈ ఘటనతో చలపతికి ప్రత్యక్ష సంబంధం ఉంది అని చెబుతుంటారు. కానీ.. ఎలాంటి బలమైన సాక్ష్యాలు దొరకలేదు. అయినా.. పోలీసులకున్న అంతర్గత నిఘా సమాచారంలో ఈయన పేరు కూడా ఉంది అంటుంటారు. అలాగే.. 2018లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ల హత్యలకు వ్యూహ రచన చేసింది.. చలపతి దళమే అంటుంటారు. ఆయన నేతృత్వంలోనే ఈ హత్యలు చోటుచేసుకున్నాయని పోలీసులు చెబుతుంటారు.
అతని ఉనికి ఎవరికీ తెలియదు..
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి.. ఛత్తీష్ గఢ్, ఒడిశాలో మావోయిస్ట్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వాడు.
గత కొన్నేళ్లుగా మోకాళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఛత్తీష్ గఢ్ లోని బస్తర్ జిల్లా దర్భాలో ఉంటున్నాడు. పెద్దగా చదువుకోకపోయినా.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒడియాలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఉంది. ఇతను.. సైనిక వ్యూహాలు, గెరిల్లా యుద్ధంలో మంచి అనుభవం, పట్టు ఉందని అంటారు.. పోలీసు అధికారులు. విద్యార్థి దశ నుంచే మావోయిస్ట్ పార్టీలో ఉంటూ వచ్చిన చలపతి ఆంధ్ర ఒడిషా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC) డిప్యూటీ కమాండర్ చైతన్య వెంకట్ రవి అలియాస్ అరుణతో సన్నిహితంగా ఉండే చలపతి.. ఆమెను వివాహం చేసుకున్నాడు.
అప్పటి వరకు చలపతి గురించి పేరు వినడమే కానీ.. అతనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను పోలీసులు గుర్తించలేకపోయారు. ఎలా ఉంటాడనే విషయమై అనేక ఊహాగానాలే కానీ స్పష్టమైన సమాచారం పోలీసుల దగ్గర లేకుండా పోయింది. దాంతో.. అతనిపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఈ విషయంలో అనేక ప్రయత్నాలు చేసిన పోలీసులకు చాలాసార్లు నిరాశే ఎదురైంది. ఆయుధగారాలు దోచుకున్నా, మందు పాత్రలతో సైనిక వాహనాల్ని పేల్చేసినా గుర్తించలేకపోయారు. సాధారణంగా.. మావోయిస్ట్ పార్టీలో ఎదుగుతున్న వారి ఫోటోలు, ఇతర వివరాలు పోలీసులకు చేరుతుంటాయి. వాటి ఆధారంగానే.. పోలీసుల వ్యూహ రచన ఉంటుంది. కానీ.. చలపతి పేరు నిఘా వర్గాల ద్వారా వినడమే కానీ.. అతని ఆచూకీ మాత్రం కనుక్కోలేకపోయారు.
భార్యతో సెల్ఫీ తెచ్చిన తంటా..
మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య 2016 మే నెలలో ఏఓబీ బోర్డర్ లో భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో చనిపోయిన మావోయిస్టుల నుంచి అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులకు.. ఓ వ్యక్తి దగ్గర కీలక సమాచారం లభించింది. అతని దగ్గర పగిలిపోయిన ఓ పాత స్మార్ట్ మొబైల్ ఫోన్ ని గుర్తించారు. ఆ వ్యక్తిని తర్వాత విచారణలో.. చలపతి భార్య అరుణ సోదరుడు అజాద్ గా గుర్తించారు. ఆ మొబైల్ లో తొలిసారి.. మోస్ట్ వాటెండ్ మావోయిస్ట్, అగ్రనేత చలపతి పోలీసుల కంటపడ్డాడు. అప్పటి వరకు పోలీసులకు మిస్టరీగా మిగిలిపోయిన చలపతి.. ఆ ఫోన్ లోని ఓ సెల్ఫీతో దొరికిపోయాడు.
భార్య అరుణతో కలిసి అడవిలో చలపతి ఓ సెల్ఫీ తీసుకున్నారు. దాంతో.. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న చలపతి దొరికిపోయినట్లైంది. ఆ ఫోటోను విడుదల చేసిన పోలీసులు ఏకంగా.. అతని తలపై కోటి రూపాయల రివార్డును ప్రకటించారు. దాంతో.. చలపతి కదలికలు చాలా పరిమితం కావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అప్పటి వరకు సమీప గ్రామాలకు వెళ్లి.. సాయుధులైన తన దళ సభ్యులతో కలిసి తిరిగిన చలపతి.. అప్పటి నుంచి తనకు కేటాయించిన రక్షణ సిబ్బందితోనే గడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
Also Read : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు, 10 మంది మృతి..
అతని కార్యకలపాలు క్రమంగా కుదించుకుపోగా.. అనారోగ్య సమస్యలూ అతన్ని మరింతగా చురుకైన ఆపరేషన్లకు దూరంగా ఉండేలా చేశాయి. అలా.. తన ఉనికిని ఓ సెల్ఫీ ద్వారా తెలిసేలా చేసుకున్న చలపతి.. ఇటీవల భద్రతా దళాల భీకర కాల్పుల్లో తన సహచర 13 మంది మావోయిస్టులతో పాటుగా మరణించాడు.