Megha Engineering Fake Bank Gurantees | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ కంపెనీ మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆర్థిక మోసాలకు పాల్పడిందంటూ ముంబై హై కోర్టులో ఒక పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం – పబ్లిక్ ఇంటరెస్ట్ పిటీషన్) దాఖలైంది. ముంబై నగరంలో రూ.16,600 కోట్లు విలువైన థాన్ బోరివలీ ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA)కి మెఘా ఇంజినీరింగ్ కంపెనీ నకిలీ బ్యాంకు గ్యారెంటీలను సమర్పించిందని.. దీనికి సంబంధించి విచారణ చేయాలని ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాశ్ హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. వచ్చే వారం హై కోర్టు ఈ పిటీషన్ విచారణ చేపట్టనుంది. ఈ పిల్‌ని రవి ప్రకాశ్ తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. వాదించనున్నారు.
జూలై 15, 2024 నుంచే మేఘా ఇంజినీరింగ్ మోసాల గురించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిబిఐ, ఈడీ, కాగ్, సెంట్రల్ విజిలెన్స్ విభాగాల్లో జర్నలిస్ట్ రవి ప్రకాశ్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టులో మేఘా ఇంజినీరింగ్ తోపాటు ముంబై మెట్రీపాలిటన్ అథారిటీ అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారనే ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అవినీతి అధికారులపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
యూరో ఎగ్జిమ్ బ్యాంక్ తరపున నకిలీ గ్యారంటీలతో మోసం
ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ కోసం కర్రేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ లూసియా దేశానికి చెందిన యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే విదేశీ సంస్థ మోసపూరిత హామీలను జారీ చేసిందని.. రవి ప్రకాష్ పిల్‌లో ఆరోపించారు. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్.. భారత రిజర్వ్ బ్యాంక్ గుర్తించిన విదేశీ బ్యాంక్ కాదని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ చట్టం ప్రకారం విలీనం చేయబడిన ఒక బ్యాంక్ ఎలా గ్యారెంటీలు జారీ చేస్తుందని ప్రశ్నించారు. దేశంలో నేషనలైజేషన్ చేయబడిన లేదా షెడ్యూల్డ్ బ్యాంకులు ఇచ్చే గ్యారెంటీలు మాత్రమే భద్రత కలిగిస్తాయని, కానీ ఇలాంటి బ్యాంకుల నుంచి గ్యారంటీలు స్వీకరించడం ఆమోదయోగ్యం కాదని ఆయన వివరించారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజా పనుల శాఖ సెప్టెంబర్ 2017 నోటిఫికేషన్ జారి చేసిందని.. ఫైనాన్స్ అకౌంట్స్ డివిజన్, MMRDA 2018 సర్క్యులర్‌లో కూడా పేర్కొన్నట్లు పిల్‌లో వివరించారు. జాతీయం చేయబడిన బ్యాంక్ నుంచి హామీలను మాత్రమే ప్రభుత్వ సేకరణకు అంగీకరించాలని ఆధారాలు చూపించారు.
Also Read: కార్మికులు పనిచేయడం లేదు.. సంక్షేమ పథకాలే కారణం.. మరో వివాదం తెరలేపిన ఎల్ అండ్ టి చైర్మెన్
ఎన్నికల బాండ్ల రూపంలో కూడా భారీ అవినీతి
ట్విన్ టన్నెల్‌కు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి జాగ్రత్తలు లేదా పరిశీలనలు చేయకుండానే MEIL సంస్థ ప్రతిపాదించిన ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారెంటీలను ఆమోదించిందని పిల్‌లో పేర్కొన్నారు. బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధించిన SWIFT మెసేజస్‌ని బ్యాంకు ప్రామాణీకరించిందని తెలిపారు. ముంబై ట్విన్ టన్నెల్ పబ్లిక్ ప్రాజెక్టులు రెండింటిలోనూ MEIL సంస్థ మొత్తం ఆరు మోసపూరిత గ్యారెంటీలను ఇచ్చిందని సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ ఆరోపణలు చేశారు.
ఎలాంటి సెక్యుర్డ్ గ్యారంటీలు ఇవ్వకుండానే ప్రజానిధులను పొందేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. దీనికి సంబంధించి MEIL సంస్థ అధినేత మేఘా కృష్ణ రెడ్డి, రాజకీయ నేతల మధ్య ఎన్నికల బాండ్ల రూపంలో క్విడ్ ప్రో కో లావాదేవీలు జరిగాయని తీవ్రంగా ఆరోపించారు. ఆర్‌బిఐ, సిబిఐ, సిఎజి, ఆర్థిక మంత్రిత్వ శాఖతో సహా వివిధ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ రవి ప్రకాష్ తెలిపారు. గత ఏడాది జరిగిన ఈ మోసంపై సిబిఐ లేదా సిట్ దర్యాప్తు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దాంతో పాటు MEILకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయాలని MMRDAను డిమాండ్ చేశారు.
తెలంగాణలోనూ మేఘా మోసాలు
ఇంతకు ముందు కూడా ఆర్టీవీ సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ మేఘా సంస్థ చేసిన మోసాలను బయటపెట్టారు. తెలంగాణలో ఆ కంపెనీ చేసిన మోసాలను బయటకు లాగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడింది మేఘా. తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్లు దోచుకున్న మేఘా కృష్ణారెడ్డి అవినీతి బాగోతాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే రూ. 48 వేల కోట్లు కృష్ణారెడ్డి దోచుకున్నారని తెలిసింది. అంతేకాదు, నాసిరకం నిర్మాణాలు చేసి గత ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్రతిష్టపాలైందంటే, ఆ పాపం ముమ్మాటికీ మేఘా సంస్థదే. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాజెక్టుల్లో మేఘా కృష్ణారెడ్డి రూ. 70 వేల కోట్లు దోచుకున్నాడని రిపోర్టులు ద్వారా తెలిసింది. కాగ్ రిపోర్ట్ లో కూడా మేఘా కంపెనీ భారీ అక్రమాలకు పాల్పడిందని తేలింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం విడుదల చేసిన రూ. 1.5 లక్ష కోట్లలో ఒక్క మేఘా కృష్ణారెడ్డే 48 వేల కోట్లు నొక్కేశాడని కాగ్ రిపోర్ట్ బయటపెట్టడం ఆయన అవినీతికి అద్దం పడుతోంది.