ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల గురించి భారత భద్రతా బలగాలు మరొక సుదీర్ఘ ప్రెస్ మీట్ లో కొన్ని వివరాలు తెలియజేశారు. మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని ఇదివరకే తాము స్పష్టం చేశామన్నారు కర్నల్ సోఫియా ఖురేషి. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ సైన్యం నేరుగా భారత్ పై దాడికి దిగిందని అన్నారామె. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిందని వెల్లడించారు. అయితే పాక్ బలగాల దాడులను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని స్పష్టం చేశారు. ఈ దాడుల్ని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలతో భారత భద్రతా దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. పాకిస్తాన్ క్షిపణి శకలాలు భారత్ లో పడ్డాయని, వారి దాడులకు అవే నిదర్శనం అని రక్షణ శాఖ తెలిపింది.
భారత సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో విచక్షణారహితంగా దాడి చేసిందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఈ రోజు ఉదయం లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసిందని ఆమె చెప్పారు.
16 మంది మృతి
ఆపరేష్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ జరిపిన దాడు ల్లో 16మంది మృతి చెందినట్టు కేంద్రం ప్రకటించింది. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించిందని.. అవంతిపొరా, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల, జలంధర్, లూథియానా తదితర ప్రాంతాల్లో పాక్ దాడులకు విఫలయత్నం చేసినట్టు తెలిపారు. ఈ దాడుల్ని తాము సమర్థంగా తిప్పికొట్టామని, అయితే ప్రాణ నష్టం జరిగిందని వారు వివరించారు. పాక్ దాడుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.
రెచ్చగొట్టింది పాకిస్తానే..
ఆపరేషన్ సిందూర్ జరిగిన తర్వాత విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రెండో ప్రెస్ మీట్ ఇది. అసలు ఆపరేషన్ సిందూర్ జరగడానికి కారణం కూడా పాకిస్తానేనని భారత్ స్పష్టం చేసింది. పహల్గాం దాడి తర్వాతే తాము పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశామని తెలిపింది. అప్పటికీ తాము పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, పౌరులపై దాడి జరపలేదని పేర్కొంది. తాము కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేసామన్నది భారత్. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కూడా అదేనని చెప్పింది. కానీ ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ఆ దేశ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరిపిన దాడుల్లో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం 16 మంది మృతి చెందినట్లు భారత్ వెల్లడించింది.
ధీటైన జవాబు..
అబద్ధాల పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపిస్తోందని తెలిపారు భారత్ అధికారులు. ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ అసత్యవాదనలు చేసినట్టు చెప్పారు. పాక్ తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నా, తాము వారి దాడులను తిప్పికొట్టామని.. పాక్ మిస్సైళ్లను కూల్చేశామని వెల్లడించారు.