Union Govt: మోదీ సర్కార్ సరి కొత్తగా ప్లాన్ చేస్తోంది. ఆధార్ తరహాలో దేశంలోని ప్రతి ఇంటికి డిజిటల్ సంఖ్య ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. పౌర సేవల నాణ్యతను మెరుగుపరచడం, దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఈ కొత్త ప్రణాళిక వెనుక పెద్ద ఉద్దేశ్యం ఉంటుందని అంటున్నారు నిపుణులు.
కేంద్రప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేస్తోంది. ప్రతీ వ్యక్తికి ఆధార్ గుర్తింపు ఎలా ఇచ్చిందో ప్రతీ ఇంటికీ డిజిటల్ ఐటీని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత ఆధార్ ప్రవేశ పెట్టినప్పుడు కేవలం గుర్తింపు సంఖ్య మాత్రమేనని అంటున్నారు. ఆ తర్వాత పథకాలు, బ్యాంకు అకౌంట్లు ఇలా చెప్పుకుంటే పోతే ఆధార్ లేకుంటే టెక్ యుగంలో ఏ పనీ కాదన్నది సామాన్యుడి మాట.
దేశంలోని పెద్ద నగరాల్లో ఇంటి చిరునామా వెతకడం కత్తి మీద సాముగా మారింది. గూగుల్ మ్యాప్ మనం కోరుకున్న చిరునామాకు తీసుకెళ్ల లేకపోతుంది. కొన్నిసార్లు ల్యాండ్‌మార్క్ ఆధారంగా మనం ఆ ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది కేంద్రప్రభుత్వం.
దేశంలో ప్రతి ఇంటి చిరునామాకు ఆధార్ తరహాలో ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు నెంబర్ ఇచ్చే విధంగా అడుగులు వేస్తోంది. ప్రతి భారతీయుడి ఇంటికి డిజిటల్ ఐడీ. దీనివల్ల పౌర సేవల నాణ్యతను మెరుగు పరుస్తాయని అంటున్నారు. దీనివల్ల పౌరులు ప్రయోజనం పొందడమే కాకుండా భద్రత, నిఘా వ్యవస్థలు మరింత ఆధునికంగా ఉంటాయన్నది కేంద్రం మాట.
ALSO READ: మళ్లీ భయపెడుతున్న కరోనా, ఇవేం కేసులు బాబోయ్
డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. డిజిటల్ ఐడీలతో పౌరుల వ్యక్తిగత వివరాలు వారి నియంత్రణలో ఉండిపోతాయి. ఎవరైనా ఆ వివరాలను పొందాలంటే సదరు వ్యక్తి అనుమతి ద్వారా సాధ్యం కానుంది. దీనికి సంబంధించి త్వరలో ఓ ముసాయిదా విడుదల చేయనుంది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ చట్టానికి తుది రూపం ఇవ్వాలని భావిస్తోంది.
డిజిటల్ ఐడీ అనేది దేశంలో ప్రతి ఇల్లు, భూమి, షాపులు, ఆఫీసులు ప్రత్యేక సంఖ్య ఇవ్వనుంది. దీని ద్వారా సంబంధిత ప్రాంతానికి వేగంగా చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన డేటా ప్రభుత్వ సమాచార కేంద్రంలో భద్రంగా ఉండనుంది. సరిహద్దు ప్రాంతాలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలు, భద్రత వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో నిఘా వేయవచ్చు. ఏదైనా అనుమానాస్పద కదలిక, తెలియని వ్యక్తి ఉనికిని త్వరగా గుర్తించడం సాధ్యమవుతుంది.
డిజిటల్ హౌస్ ఐడీ మొదటి దశ ఢిల్లీ, బెంగళూరు, పూణె, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా దశల వారీగా అమలు చేయనుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో అనేక మున్సిపాలిటీల్లో జియో ట్యాగింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. డిజిటల్ హౌస్ సమాచారాన్ని పూర్తి రూపంలో అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, కొంతమంది నిపుణులు డేటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారం కలిగిన ప్రభుత్వ అధికారులు ఈ సమాచారాన్ని పొందుతారు. పౌరుడికి ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఉపయోగబడదు.
ఇంటి యాజమాన్యం మొదలు వ్యక్తిగత సమాచారం, డిజిటల్ ట్రాకింగ్ డేటా ఉండడం వల్ల ఏదో విధంగా లీకైతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. తగిన చట్టం లేకుండా అమలు చేయడం ప్రమాదకరమంటున్నారు. భవిష్యత్తులో పౌరుల హక్కులు, వారి గోప్యతకు పెద్ద సవాలుగా మారవచ్చని అంటున్నారు. డిజిటల్ ఐడీ వల్ల పౌరుల గోప్యత, హక్కులను ప్రభుత్వం ఎంత వరకు గౌరవిస్తుందనేది అసలు ప్రశ్న.