New Aadhaar App: ఆధార్.. ఈ పేరు వింటే చాలు.. చాలామంది హడలిపోతుంటారు. ఒకప్పుడు నెంబర్ కోసం మాత్రమే అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో అడుగు ముందుకేశాయి. అన్నింటికి లింకు చేసి పథకాల లబ్దిదారులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఆ విధంగా ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయనుకోండి.
ప్రభుత్వాలు, బ్యాంకులు ఇలా ఏ చిన్న పని కావాలన్నా ఆధార్ కచ్చితంగా ఉండాల్సిదేనని తేల్చి చెబుతున్నారు. ఆధార్ లేనిదే ఏ పని కావడం లేదు. దీంతో చీటికి మాటికీ కార్డు పట్టుకుని జెరాక్స్ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆధార్‌పై అపోహాలు లేకపోలేదు. దీనికితోడు పౌరుల డేటా మరొక కీలకమైన అంశం. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు వేశారు కూడా.
కొత్త ఆధార్ యాప్
పౌరుల డేటా భద్రత లక్ష్యంగా కొత్త ఆధార్ యాప్‌ను రెడీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఫేస్ ఐడీ, క్యూఆర్ స్కానింగ్ ద్వారా తమ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే డిజిటల్ ధృవీకరణకు వీలు కల్పిస్తుందన్నమాట. ఫిజికల్‌గా ఆధార్ కార్డును తమ వెంట తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా పడిపోతుందని భయం అస్సలు ఉండదు.
వినియోగదారులు ఆధార్ కార్డుల ఒరిజినల్స్, జెరాక్స్ కాపీలు తమ వెంట తీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌గా ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార,సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ALSO READ: మహిళా ఎంపీ కోసం ఒకరినొకరు తిట్టుకున్న ఎంపీలు, ఎక్కడ?
ఫేస్ ఐడీ నిర్ధారణ, వినియోగదారుల డేటాను సురక్షితంగా పంచుకునే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ప్రస్తుతం బీటా పరీక్ష దశలో ఉందన్నది మంత్రి మాట. అంతా ఓకే అయితే అందరికీ అందుబాటులోకి రానుందన్నమాట. ఆధార్ ధృవీకరణ, దుర్వినియోగం నుండి రక్షణ కల్పించనుంది.
యాప్ విషయంలో కీలక నిర్ణయాలు లేకపోలేదు. ముఖ్యంగా పౌరుల అనుమతి లేకుండా డేటాను తీసుకోవడం ఇకపై కుదరదు. వినియోగదారులతో అనుమతితో డేటాను పంచుకోవచ్చు. ఇలాంటి నిర్ణయం వల్ల వ్యక్తిగత సమాచారంపై నియంత్రణ లభిస్తుంది. చెల్లింపుల సమయంలో క్యూఆర్ కోడ్ ఉపయోగించినట్టుగా ఆధార్ ధృవీకరణ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయడం మరింత సులభం.
ఆధార్ కార్డు, జెరాక్స్ కాపీలను వెంట తీసుకు వెళ్లాల్సిన అవసరం ఇక అస్సలుండదు. మొబైల్ యాప్ ద్వారా ఫేస్ ఐడి ద్వారా చేయవచ్చు. హోటళ్లలో స్టే చేసినప్పుడు, ప్రయాణ చెక్‌పాయింట్లలో జెరాక్స్ అందజేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే 100 శాతం డిజిటల్ అన్నమాట. సురక్షితమైన గుర్తింపును ధృవీకరిస్తుంది.
ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా చూస్తుంది కూడా. ఆధార్ ఫోర్జరీ లేదా సవరణలను నిరోధించనుంది. వెరిఫికేషన్ ప్రక్రియతో వినియోగదారులకు సులభమైన సేవలను అందిస్తుంది. నార్మల్ పద్ధతితో పోలిస్తే వినియోగదారుడికి సమర్ధవంతమైన ప్రైవసీ లభిస్తుంది. ఇందులో సమస్యలు లేక పోలేదు.
సీనియర్ సిటిజన్ల మాటేంటి?
ఈ లెక్కన మొబైల్ ఫోన్ ఉన్నవారికి మాత్రమే. సీనియర్ సిటిజన్లు, వయో వృద్ధుల మాటేంటి? అన్నది అసలు ప్రశ్న. వయస్సు పెరిగిన కొద్దీ ఫేక్ రికగ్ననైజేషన్ విషయంలో చాలా సమస్యలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ విషయంలో ఎలా అన్నది అసలు ప్రశ్న.