TMC Mahua Moitra Kalyan Banerjee| తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీలు మహువా మొయిత్రా, కళ్యాణ్ బెనర్జీ మధ్య ఘర్షణ జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ సంఘటన రాజకీయంగా కలకలం రేపింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు, వాట్సప్ చాట్లు బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. మంగళవారం.. టీఎంసీకి చెందిన రెండు ఎంపీలు – కళ్యాణ్ బెనర్జీ, కీర్తి ఆజాద్ మధ్య జరిగిన ప్రైవేట్ వాట్సప్ చాట్లను బీజేపీ షేర్ చేసింది.
ఈ చాట్లలో పార్టీలోని విభేదాల గురించి వారు గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. 2024 ఏప్రిల్ 4న, ఇద్దరు టీఎంసీ ఎంపీలు భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రధాన కార్యాలయంలో బహిరంగంగా గొడవ పడ్డారు. అంతటితో ఆగకుండా, వారు వాట్సప్‌లోనూ ఒకరినొకరు విమర్శలు చేసుకున్నారు. ఈ వాట్సప్ స్క్రీన్ షాట్లను బీజేపీ షేర్ చేసింది. ఈ చాట్లలో “వర్సటైల్ ఇంటర్నేషనల్ లేడీ” అనే పేరును ప్రస్తావిస్తూ.. బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ స్క్రీన్ షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసి, “ఆమె ఎవరో?” అని ప్రశ్నించారు.
“టీఎంసీ ప్రతినిధుల బృందం ఈసీ కార్యాలయానికి ఒక ప్రజెంటేషన్ సమర్పించడానికి వెళ్ళింది. ఈసీ ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు, టీఎంసీ ఆదేశాల ప్రకారం.. వినతిపత్రంపై సంతకాలు చేయడానికి సమావేశం ఏర్పాటు చేయాలి. కానీ, ఆ ఎంపీ ఆ సమావేశానికి రాకుండా నేరుగా ఈసీ కార్యాలయానికి వెళ్లారు. ఇది ఇద్దరు ఎంపీల మధ్య గొడవకు కారణమైంది.” అని మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ లో రాశారు. ఈ గొడవను ఆపేందుకు పోలీసుల జోక్యం అవసరం అయ్యింది. బీజేపీ షేర్ చేసిన వీడియోలో, కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు కనిపిస్తోంది. “ఇది పబ్లిక్ ప్లేస్, కాస్త సంయమనం పాటించండి” అని అక్కడ ఉన్న టీఎంసీ నేత డెరెక్ ఓబ్రైన్ ప్రయత్నించినా.. దానికి ఎలాంటి ఫలితం లేకపోయింది.
ఈ వ్యవహారం మీడియా ద్వారా ప్రసారం అవుతుందని వారించినా, కళ్యాణ్ బెనర్జీ వినలేదు. ఈ సంఘటన తర్వాత, ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, కీర్తి ఆజాద్ మధ్య వాట్సప్ చాట్ చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. బిజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియా తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏఐటీసీ ఎంపీ 2024’ అనే పేరుతో ఉన్న ఒక వాట్సప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో జరిగిన చాటింగ్ లో ఎంపీలు కీర్తి ఆజాద్, కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ చాట్‌లో ఒక మహిళ ప్రస్తావన కూడా వచ్చింది. సీనియర్ ఎంపీ ప్రవర్తన కారణంగా, పార్లమెంట్ మహిళా సభ్యురాలు ఆ గ్రూప్ నుంచి నిష్రమించినట్లు సమాచారం.
Also Read: మాజీ స్పీకర్ మరణానికి నకిలీ వైద్యుడే కారణం.. ఛత్తీస్ గడ్‌లో కలకలం
ఈ వ్యవహారంపై టీఎంసీ నేత సౌగతారాయ్ స్పందించారు. “ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ప్రతి పార్టీలో అంతర్గత గోప్యతను కాపాడుకోవాలి. ఈ గొడవ జరిగినప్పుడు నేను అక్కడ లేను, కానీ ఎంపీ మహువా మొయిత్రా కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నేను చూసాను. కళ్యాణ్ ప్రవర్తనపై పార్టీ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది” అని సౌగతా రాయ్ తెలిపారు.
సౌగతారాయ్ వ్యాఖ్యలతో ఈ గొడవలో మరొక ఎంపీ మహువా మొయిత్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం సంఘటన, ఈ లీక్స్‌పై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా కలత చెందారని, ఆమె వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మీడియా ప్రకటనలు చేయొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.