ప్రధాని నరేంద్రమోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తిపాస్తులపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడిచింది. అసలింతకీ మోదీ ఎంత సంపాదించారు, ప్రధాని అయిన తర్వాత ఆయన ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయి. ఆయనకు ఎక్కడెక్కడ పొలాలు, స్థలాలు ఉన్నాయి, క్యాష్ ఎంత, నగలు ఎన్ని? వీటన్నిటికీ ఆధారం 2024 ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్. వీటిలో చాలా ఆసక్తికర విషయాలున్నాయి.
మోదీ చేతిలో క్యాష్
ప్రధాని మోదీ అవసరాలన్నీ ప్రభుత్వమే తీరుస్తుంది. తిండి, రవాణా, ఇంటి అవసరాలు కూడా ప్రభుత్వం నుంచే అందుతాయి. మరి ఆయనకు డబ్బుతో అవసరం ఏముంటుంది, అయినా కూడా ఆయన తన చేతి ఖర్చుల కోసం కొంత నగదుని దగ్గర పెట్టుకుంటారట. దాని విలువ రూ. 59,920.
మోదీ అతి పెద్ద పెట్టుబడి ఏంటంటే?
స్థలాలు, పొలాలు, బంగారంపై మోదీ పెద్దగా పెట్టుబడి పెట్టలేదు. ఆయన అతిపెద్ద పెట్టుబడి ఫిక్స్ డ్ డిపాజిట్. ప్రధాని మోదీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎక్కువగా నమ్ముతారు. ఆయనకు రూ. 3,2634,258 విలువైన FDలు ఉన్నాయి. ఈ FDలు గాంధీనగర్‌లోని SBI బ్రాంచ్‌లో ఉన్నాయి. ఇదే బ్రాంచ్ లో మోదీకి ఒక సేవింగ్ అకౌంట్ కూడా ఉంది. ఆ అకౌంట్ లో రూ. 1,104 నగదు ఉంది.
NSC – జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం:
చిన్న పొదుపు పథకాలలో భాగమైన జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం (NSC)ను కూడా పెట్టుబడి కోసం ఎంపిక చేసుకున్నారు మోదీ. ఈ పథకంలో మొత్తం రూ. 9,74,964 పెట్టుబడి పెట్టారు. NSC అనేది 5 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అయ్యే పోస్ట్ ఆఫీస్ పథకం. ఇది 7.7శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా మోదీ అందుకుంటారు.
నగలు..
అసలు మోదీ వద్ద ఉన్న బంగారం ఎంత అనేది చాలామంది తెలుసుకోవాలనుకుంటున్న అంశం. మోదీ వద్ద మొత్తం 45 గ్రాముల బరువున్న 4 బంగారు ఉంగరాలు మాత్రమే ఉన్నాయట. వాటి విలువ సుమారు రూ. 3,10,365.
పెట్టుబడి సాధనాలు..
ప్రస్తుతం మధ్యతరగతి వారు కూడా షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. కానీ మోదీ మాత్రం ఆ పని చేయలేదు. ఆయన మ్యూచువల్ ఫండ్‌లు, బాండ్‌లు, డిబెంచర్లు, షేర్లలో ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదు.
2014 నుంచి 2024 వరకు పెరిగిన సంపాదన..
పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మోదీ 2024లో మూడోసారి ఆ పదవి చేపట్టారు. 2014 ఎన్నికలలో, ప్రధాని మోదీ తన ఆస్తులను కోటీ 65లక్షల రూపాయలుగా ప్రకటించారు. 2019 ఎన్నికలనాటికి ఆయన ఆస్తి రూ.2.51 కోట్లకు పెరిగింది. 2024 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, ఆయన ఆస్తులు ప్రస్తుతం 3 కోట్ల 2వేల రూపాయలు. 75వ పుట్టినరోజు నాటికి మోదీ ప్రస్తుతం ఆస్తి విలువ 3 కోట్ల 43 లక్షల రూపాయలు.
రాజకీయ నాయకుల ఆస్తుల్ని మనం అంచనా వేయగలం కానీ, అఫిడవిట్ లో పేర్కొనేవి అసలు ఆస్తులుగా పరిగణించలేం. వారసులు, కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో వారు తమ ఆస్తిపాస్తుల్ని జాగ్రత్త చేసుకుంటారు. ఇంకా ఎక్కువైతే బినామీల పేరిట పెడతారు. ఇక్కడ మోదీకి వారసులెవరూ లేరు కాబట్టి ఆయన ఆస్తి విలువ అత్యంత ఆసక్తికరం.