Prayagraj Travel : ఉత్తర్ ప్రదేశ్ లోని కుంభమేళ రద్దీని అందుకోలేకపోవడం విమాన ప్రయాణ టికెట్లు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ధరల హేతుబద్ధీకరణ కోసం మరిన్ని విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాలతో.. పెరిగిపోతున్న విమాన ఛార్జీలను అదుపులో ఉంచేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) చర్యలు చేపట్టింది. పర్యాటకులు, భక్తులకు సరిపడిన స్థాయిలో విమాన సర్వీసులు, టికెట్ ధరలు అందుబాటులో ఉంటాలని ఆదేశాలు జారీ చేసింది.
గతంలో జనవరి నెలలో 81 అదనపు విమాన సర్వీసుల్ని ఆమోదించిన డీజీసీఎ.. ప్రయాగ్ రాజ్ రద్దీ దృష్ట్యా దేశమంతటి నుంచి 132 సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. అదనపు సర్వీసుల వల్ల విమాన ఛార్జీలు తగ్గుతాయని విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే వాస్తవంలో ప్రయాగ్‌రాజ్‌కి విమాన ఛార్జీలు 107% గణనీయంగా పెరిగాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ట్రావెల్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TAFI) ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… ప్రయాగ్‌రాజ్‌కి ఉన్న డిమాండ్ అధికంగా ఉందని తెలిపారు. ఎంతలా అంటే.. ఎవరైనా ఫిబ్రవరిలో ఏదైనా తేదీలో ముంబై నుంచి ప్రయాగ్‌రాజ్‌కి నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను బుక్ చేసుకుంటే సింగిల్ వే లో రూ.30 వెలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జైపూర్, బెంగళూరు, నాగ్‌పూర్, కొచ్చి, ముంబై నుంచి ప్రయాగ్‌రాజ్‌కి అత్యధిక విమాన ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ MakeMyTrip వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రయాగ్‌రాజ్ కు విమాన సర్వీసులు కొన్ని నెలల కాలంలోనే అసాధారణంగా 23 రెట్లు పెరిగిపోయాయని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఈ వేడుకలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కుంభమేళ ప్రారంభ, ముగింపు వారాల్లో ప్రయాణ డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. విమాన చార్జీలు పెరిగే అవకాశం ఉన్నందున డీజీసీఏ అధికారులు, విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున అదనపు విమానాలను ఈ మార్గాల్లో నడపడం, ఛార్జీలను హేతుబద్ధీకరించాలని కోరారు.
అంతకు ముందే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమాన ఛార్జీల సమస్యపై చర్చించేందుకు అంతర్గత సమావేశం నిర్వహించారు. అయితే.. వాస్తవానికి విమాన ఛార్జీలను నియంత్రించేందుకు ఓ నిబంధన, చట్టం అంటూ ఏదీ లేదు. ఈ ఛార్జీలు ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండవు. విమానయాన సంస్థలు అప్పటి డిమాండ్ ఆధారంగా విమాన ఛార్జీలను నిర్ణయించుకునే సౌలభ్యం ఉంది. అయితే విమానయాన సంస్థలన్నీ ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 135కి కట్టుబడి ఉంటాయని అధికారులు తెలుపుతున్నారు.
మార్కెట్ పోటీతత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం విమాన చార్జీలను నియంత్రించడం లేదు. అంత మాత్రాన పూర్తిగా పట్టింపు లేకుండా వ్యవహరించదని అంటున్నారు. ప్రయాణీకుల సౌకర్యం, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. అధిక ధరలను నియంత్రించాల్సిన అవసరం వస్తే తప్పకుండా జోక్యం చేసుకుంటుందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఇటీవల రాజ్యసభకు తెలిపారు.
Also Read : కైలాస్ మానస సరోవర్ యాత్ర ప్రారంభంపై చైనా కీలక నిర్ణయం.. ఈ ఏడాది నుంచే అమలు
ప్రయాగ్ రాజ్ లోని విమానాశ్రయం చిన్నది.. కానీ మహా కుంభమేళ సమయంలో ఇక్కడి నుంచి 30,172 మంది ప్రయాణికులు ప్రయాణించారు. కేవలం ఒకే వారంలో 226 విమాన సర్వీసులు ఇక్కడి నుంచి నడిచినట్లు అధికారులు తెలిపారు. దీని సామర్థ్యం దృష్ట్యా.. ఒకేరోజులో 5,000 మంది ప్రయాణికుల రికార్డును కుంభమేళ తొలిరోజుల్లోనే అధిగమించింది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం రాత్రి వేళల్లో కూడా పనిచేస్తుండగా, మొదటిసారిగా 24/7 కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చినట్లు చెబుతున్నారు.