MP Police Tonsure Youth Heads| గత ఆదివారం (మార్చి 9, 2025) న్యూజిలాండ్ పై ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచి చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ సంతోషంలో దేశమంతా సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాలు కొన్ని చోట్ల మితిమీరాయి. ఢిల్లీ, హైదరాబాద్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అర్ధరాత్రి వరకు యువత రోడ్లపై వచ్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో స్థానికంగా కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయని పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్లపై హంగామా చేసిన యువతపై లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. అయితే మధ్యప్రదేశ్ లో పోలీసులు కాస్త పరిధి దాటారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో యువకులు ఇండియా గెలిచిన ఆనందంలో రోడ్ల టపాసులు కాల్చారు. వీరిలో కొందరు మద్యం సేవించి నానా హంగామా చేస్తుండడంతో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇళ్లకు వెళ్లిపోవాలని చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. కానీ కొందరు యువకులు పోలీసులపైనే తిరగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, యువత మద్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన దేవాస్ నగరంలోని సయాజీ గేట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ ఘటన గురించి వీడియో తీశారు.
Also Read: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు హిందువులను దోచుకుంటున్నాయి.. దిగ్విజయ్ సింగ్ మండిపాటు
అయితే ఆ ప్రాంతం పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ అజయ్ సింగ్ గుర్జర్ ఆ యువకులకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల చేతిలో చిక్కిన యువకులందరికీ ఆ రాత్రి వేళ గుండు గీయించి.. నగరంలో పరేడ్ చేయించారు. ఆ తరువాత లాకప్ లో పెట్టారు. పోలీసులపై దాడి చేసిన వారిలో ఇద్దరు యువకులపై జాతీయ భద్రతా చట్టం కింద హింసాత్మక చర్యలకు పాల్పడినందకు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన గురించి స్థానకం కలకలం రేగడంతో.. పోలీసుల చర్యలపై విమర్శలు వెలువెత్తాయి. దీంతో దేవాస్ నియోజకవర్గం బిజేపీ ఎమ్మెల్యే గాయత్రి రాజె పవార్ మండిపడ్డారు. ఆమె ఈ ఘటన గురించి ఆరా తీయడానికి ఏకంగా జిల్లా ఎస్ పీ పునీత్ గెహ్లోట్ ని కలిశారు.
పోలీసులు పట్టుకున్న యువకులకు ఎటువంటి నేరచరిత్ర లేదని.. అలాంటి వారిపై పోలీసులు తీసుకున్న చర్యలు పరిధి దాటాయని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ పీ గెహ్లోత్ ని కోరినట్లు ఆమె మీడియాకు తెలిపారు. ఘటన గురించి విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎస్ పీ గెహ్లోత్ హామీ ఇచ్చారని ఆమె అన్నారు. లాకప్ లో ఉన్న 9 మంది యువకులు క్రిమినల్స్ కాదని.. అలాంటి వారిని పబ్లిక్ గా దండించేందుకు పోలీసులకు అధికారం లేదని.. వీరిలో కొంతమంది మైనర్లున్నారని.. వారిని శిక్షించేందుకు ప్రత్యేక న్యాయస్థానం, చట్టం ఉందని చెప్పారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆమె నొక్కి చెప్పారు.
ఇలాంటి ఘటనలు హైదరాబాద్, రాజస్థాన్ లోని కోటా లో జరిగాయి. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో ఇండియా ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించగానే దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఉండే హాస్టళ్లలో ఉండే యువకులంతా రోడ్లపై వచ్చి హంగామా చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఇక దేశ వ్యాప్తంగా ఉద్యోగ, ప్రవేశ పరీక్షల కోచింగ్ కు ఫేమన్ రాజస్థాన్ కోటా నగరంలో కూడా వేల సంఖ్యలో యువకులు కర్రలు తీసుకొని రోడ్లపై హంగామా చేశారు. హాస్టళ్ల గేట్లు, అద్దాలు పగులకొట్టారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశాక పరుగులు తీశారు.