MP Sanjana Jatav| ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా జరిగిన 18వ లోకసభ ఎన్నికల్లో ఒక కానిస్టేబుల్ భార్య ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. ఆమె ఎంపీగా ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి జాతీయ మీడియా ఆసక్తికరంగా కథనాలు రాసింది. ప్రమాణ స్వీకార సమయంలో ఆమె తడబడుతూ మాట్లాడారని.. కంగారు పడుతూ.. మాటికీ మాటికీ ప్రమాణ స్వీకార ప్రసంగంలో ఆగిపోయారని కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె గురించి మరో ఆసక్తికర వార్త వచ్చింది. ఆమెకు సెక్యూరిటీగా ఆమె భర్త నియమితులయ్యారని తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని భరత్ పూర్ లోక సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన సంజన జాటవ్ కు ఆమె భర్తను సెక్యూరిటీ ఆఫీసర్ గా జిల్లా ఎస్ పీ నియమించారు. సంజనా జాటవ్ భర్త పేరు కప్తాన్ సింగ్. ఆయన భరత్ పూర్ లోని గాజీ పొలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నారు.
తన భర్తే తనకు సెక్యూరిటీ ఆఫీసర్ గా రావడం పై ఎంపీ సంజనా జాటవ్ స్పందిస్తూ.. ”నా భర్తే నా బలం. ఆయన నాతో ముందునుంచి ఉంటారు. నాకు ఆయనే ధైర్యం. ఇప్పుడు ఆయన డ్యూటీ చేస్తూ రోజంతా నాతోనే ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎంపీ అయినా ముందు ఆయనకు భార్యనే. ఎంపీగా గెలిచిన తరువాత కూడా మా బంధంలో ఏ మార్పు రాలేదు. నాకు ఇద్దరు పిల్లలు. ఇంట్లో వారి పనుల్నీ ఇప్పటికీ నేనే చూస్తుంటాను. ఎంపీగా విజయం సాధించిన తరువాత నా బాధ్యతలు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పుడు భరత్ పూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం నా ప్రధాన కర్తవ్యం. నా బాధ్యతల్లో నా భర్త ఎప్పుడూ సహకారం ఎప్పుడూ ఉంటుంది,” అని అన్నారు.
మరోవైపు ఆమె భర్త కానిస్టేబుల్ కప్తాన్ సింగ్ మాట్లాడుతూ.. ”నేను నా భార్యకు సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉంటే. ఆమె నిశ్చింతగా తన ఎంపీ బాధ్యతలపై దృష్టి పెట్టవచ్చు. ఆమె సంరక్షణ బాధ్యతలు నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది.” అని చెప్పారు.
నిజానికి నెల రోజుల క్రితమే ఎంపీ సంజనా జాటవ్ తనకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కప్తాన్ సింగ్ ను నియమించాలని ఎస్ పీకి లేఖ రాశారు. ఆ కోరికను అనుమతిస్తూ.. జిల్లా ఎస్ పీ గాజీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్న కప్తాన్ సింగ్ ఎంపీ గారి సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించారు.
18 ఏళ్లకే వివాహం..
సంజనా జాటవ్ రాజస్థాన్ ఎంపీలలో అతిపిన్న వయస్కురాలు. ఆమె 18 సంవత్సరాల వయసులో రాజస్తాన్, అల్వర్ జిల్లా కఠూమర్ గ్రామానికి చెందిన కప్తాన్ సింగ్ ను 2016లో వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కప్తాన్ సింగ్ తండ్రి గ్రామ సర్పంచ్ కావడంతో తన కోడలిని ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేయించారు. అయితే ఆమె ఎన్నికల్లో కేవలం 409 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇంతకుముందు ఆమె రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు.
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉందనే నానుడికి పోలికగా సంజనా జాటవ్ విజయం వెనుక ఆమె భర్త, కుటుంబం ఉన్నారు.
Also Read: కలకత్తా వైద్యురాలి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు