Thalapathy Vijay Muslims Fatwa| తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన నటుడు తలపతి విజయ్ కు వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి ఒక ఫత్వా జారీ చేశారు. విజయ్ ముస్లింలను అవమానించారని, ఆయన సినిమాల్లో ముస్లింలంటే చెడ్డవారిగా చిత్రీకరించారని ఆయన ఆరోపిస్తూ.. ఆయన రంజాన్ మాసంలో ఇచ్చిన ఇఫ్తార్ విందు కూడా వివాదాస్పదమైంది. అందుకే విజయ్ పార్టీకి ముస్లింలు దూరంగా ఉండాలని ఫత్వాలో చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మౌలనా షహబుద్దీన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆయన (విజయ్) ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ముస్లింలతో సన్నిహితంగా ఇప్పుడు ఉంటున్నారు. కానీ ఇన్ని రోజులూ ఆయన తన సినిమాల ద్వారా ముస్లింలంటే టెర్రరిస్టులు అని చూపించారు. ప్రచారం చేవారు. రంజాన్ మాసంలో ముస్లింల కోసమని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అక్కడికి తాగుబోతులు, జూదగాళ్లను ఆహ్వానించారు. ఈ ఘటనల వల్ల తమిళనాడులో సున్నీ ముస్లింలు విజయ్ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. తమిళనాడు ముస్లింలు నను విజయ్ కు వ్యతిరేకంగా ఫత్వా ఇవ్వాల్సిందిగా కోరారు. వారి అభ్యర్థన మేరకే నేను ఫత్వా జారీ చేస్తూ.. ముస్లింలు విజయ్ రాజకీయ పార్టకి దూరంగా ఉండాలని చెప్పాను.” అని అన్నారు.
మార్చి 9, 2025న విజయ్ రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. “అయితే ఆ ఇఫ్లార్ పార్టీలో చాలామంది పేకాట క్లబ్బులు, లిక్కర్ బార్లు నిర్వహించే వారు విజయ్ తో కలిసి వచ్చారనే ఆరోపణలున్నాయి. అలాంటి వారిని పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో ముస్లింల సరసన కూర్చోబెట్టడం చాలా తప్పు. మద్యం, జూదం వంటి వాటిని ఇస్లాంలో చాలా హీనంగా చూస్తారు. అందుకే ఈ ఇఫ్తార్ విందు గురించి నాకు చాలా మంది ఫిర్యాదు చేశారు. ఆయన ఉపవాసం ఉన్నట్లు చెప్పుకున్నారు. కానీ ఆ విషయం కూడా అబద్ధమే. ” అని మౌలానా షహబుద్దీన్ తెలిపారు.
Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం
ఈ ఇఫ్తార్ విందులో విజయ్.. మద్యం తాగేవారు, జూదగాళ్లను తీసుకువచ్చారని ఆయనపై పోలీస్ స్టేషన్ లో మార్చి 12న ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరోవైపు విజయ్ మాత్రం ఇటీవలే ముస్లింలకు తోడుగా నిలబడడానికి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇదంతా ముస్లింల ఓట్లు పొందడానికే చేస్తున్నారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
తమిళనాడులో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2, 2024న తమిళగ వేట్రి కళగమ్ (టివికె) పేరుతో విజయ్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. విజయ్ ఒకవైపు అధికార డిఎంకె పార్టీని విమర్శిస్తూనే కేంద్రంలోని బిజేపీ విధానాలను తప్పుబడుతున్నారు. ఆయన త్వరలో సినిమాలు చేయడం మానేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.