అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. 50 శాతం టారిఫ్ లతో సుంకాల మోత మోగిస్తున్నారు ట్రంప్. అలాంటి ట్రంప్ ని మనం లెక్కచేయాలా? భారత్ ని పక్కనపెట్టి పాకిస్తాన్ తో అంటకాగుతున్న అమెరికాను మనం ఇంకా మిత్రదేశంగానే పరిగణించాలా? రష్యా నుంచి చమురు కొనడం తప్పంటూ భారత్ పై రంకెలేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ తో చమురు వెలికితీత డీల్ కోసం ఎందుకు తహతహలాడుతున్నాడు. వారు చేస్తే ఒప్పు, భారత్ చేస్తే తప్పా? సగటు భారతీయుడు పాకిస్తాన్ తో పాటు, ఇటీవల కాలంలో అమెరికాపై కూడా రగిలిపోతున్నాడు. ఆ కోపాన్ని ప్రధాని మోదీ కూడా ప్రదర్శించాడని అంటున్నారు. ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ కాల్స్ చేసినా మోదీ నుంచి సమాధానం లేదట. మోదీ ఫోన్ కట్ చేసిన విషయం వాస్తవమేనంటూ జర్మనీ పత్రిక ఓ వార్తను ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్గెమైన్ లో ఈ కథనం ప్రచురితమైంది. అమెరికాపై మోదీ కోపానికి ఇది నిదర్శనం అని ఆ కథనం సారాంశం. అదే సమయంలో ఆయన ఆలోచనకు కూడా ఇది ప్రతీక అని ప్రస్తావించారు. ముందు చూపుతోనే మోదీ, ట్రంప్ కాల్స్ ని తిరస్కరించారని చెప్పారు.
ఒంటెత్తు పోకడలు..
అమెరిగా అగ్రరాజ్యమే కావొచ్చు, ఆ దేశంపై మిగతా చాలా దేశాలు ఆధారపడి ఉండొచ్చు. కానీ ఇతర దేశాల సార్వభౌమ అధికారాన్ని తక్కువచేసి చూడటం మాత్రం అమెరికాకు ఎంతమాత్రం సమంజసం కాదు. అమెరికా తప్పలు చేయకూడదు, మిగతా దేశాలన్నీ సక్రమంగా ఉండాలనే విధానం కూాడ మంచిది కాదు. భారత్-పాక్ మధ్య యుద్ధ విరమణకు తానే కారణం అంటూ ట్రంప్ పదే పదే చెప్పుకున్నారు. ఆ మాటల్ని మోదీ ఖండించినా కూడా ఆయన మాత్రం తన ప్రచారాన్ని ఆపుకోలేదు. అదే ప్రచారంలో ఏకంగా నోబెల్ శాంతి బహుమతి కూడా పొందాలనుకున్నారు.
ట్రంప్ నిరంకుశ ధోరణిని మోదీ ఖండించలేదని, అమెరికాకు ఆయన సాగిలపడ్డారని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ దశలో మోదీ చేయగలిగిందేమీ లేకపోయినా అప్పుడప్పుడూ తన అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. అయితే తాజాగా ట్రంప్ కాల్ కట్ చేసి తన కోపాన్ని ఆయన బహిరంగ పరిచారంటూ జర్మనీ పత్రిక కథనం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఫోన్ కాల్ వ్యవహారం భారతీయ మీడియాకు తెలియకుండా జర్మనీ మీడియాకు తెలియడమేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకసారి కాల్ కట్ చేస్తే అదో లెక్క, కానీ నాలుగు సార్లు కాల్ కట్ చేశారంటే మోదీ ధైర్యానికి మెచ్చుకోవాలంటోంది జర్మనీ మీడియా. అటు ట్రంప్ కూడా మోదీతో ఫోన్ లో మాట్లాడేందుకు అంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారో తేలాల్సి ఉంది. సుంకాలు పెంచి భారత్ ని దారిలోకి తెచ్చుకుందామనుకున్నారు ట్రంప్. కానీ ఆయన పాచిక పారలేదు. సుంకాలు పెంచినా, భారత్ అమెరికాకు సాగిలపడలేదు. ఈ దశలో మరో ఉపాయం ఆలోచించి మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ ఫోన్ ట్రై చేసి ఉంటారని తెలుస్తోంది. ఫోన్ కాల్ కట్ చేయడంతో ఆయన ఇగో హర్ట్ అయి ఉంటుంది కూడా. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.