Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఒక డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురి నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని గుర్తించారు.
బీజాపూర్ -సుక్మా సరిహద్దు బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపుర్ భట్టి ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కోబ్రా 210, 205 సీఆర్ఫీఎఫ్ 229 బెటాలియన్, డీఆర్జీ జవాన్లు భద్రతా దళాల బృందంలో ఉన్నాయి.
హతమైన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలంలో ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ , కోబ్రా, సీఆర్ఫీఎఫ్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపారు. ఆ తర్వాత నుంచి భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి.
Also Read: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ కేసు.. చెన్నైలో ఎన్ఐఏ దాడులు
ఎన్ కౌంటర్ వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వివరించారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఛత్తీస్ గఢ్ లో కూడా ఆ రోజు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువ. ఈ నేపథ్యంలో భద్రతను పటిష్టం చేశారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ ను భద్రతా బలగాలు చేపట్టాయి. ఈ క్రమంలో నక్సల్స్ తో ఎదురుకాల్పులు జరిగాయి. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.