Air India Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతో మంది కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. ఉద్యోగం కోసం కొందరు, చదువు కోసం మరి కొందరు, విహార యాత్ర కోసం ఇంకొందరు.. తమ బంధువులను, స్నేహితులను కలుసుకునేందుకు వెళుతున్న వారు.. ఇలా ఇంకా మరికొందరు.. ఒకటా రెండా ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో లండన్ బయల్దేరారు వారంతా.
అనుకున్నట్లుగానే సమయానికే విమానం టేకాఫ్ అయింది. అంతే.. అందరిలోనూ ఎంతో ఆనందం. తమ కలలు మరికొన్ని గంటల్లో తీరతాయని అంతా భావించారు. తొలిసారిగా లండన్ వెళ్తున్న వారిలోనైతే మరింత ఉత్కంఠ. కానీ, ఆ క్షణంలో వారికి తెలియదు.. అదే తమ పాలిట శాపంగా మారబోతోందని.
రాజస్థాన్‌లోని బలోతరా జిల్లా అరాబా గ్రామానికి చెందిన కుష్బూ అనే యువతి.. ఈ ఏడాది జనవరిలో మాన్పూల్ సింగ్‌ను వివాహాం చేసుకుంది. ఆమె భర్త లండన్‌లో ఉన్నత విద్యాభ్యసిస్తున్నారు. పెళ్లి తర్వాత మొదటిసారి అతన్ని కలిసేందుకు లండన్‌కు బయల్దేరింది. విమానం కుప్పకూలిపోయి ఒక్కరు మినహా అందరూ చనిపోగా.. అందులో కుష్బూ కూడా ఉంది. నవ వధువు భర్తకోసం వెళుతూ ప్రమాదంలో మరణించింది. కూతురుకి అప్పుడే నూరేళ్లు నిండిపోవడంతో.. కుష్బూ తండ్రి గుండెలు అవిసేలా రోధిస్తున్నారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం. ఎయిరిండియా ఫ్లైట్ కూలిపోవడంతో 241 మంది ప్రయాణీకులు మృతి చెందారు. ఆ విమానం మెడికోల హాస్టల్‌పై కూలడంతో.. ఆ సమయంలో లంచ్ చేస్తున్న మరికొందరు మృతి చెందారు. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీషర్లు, మరో ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడియన్ ఉన్నారు.
అప్పటివరకు అంతా సవ్యంగా ఉంది. విమానం పద్ధతిగా టేకాఫ్ అయింది. క్షణాల వ్యవధిలో కూలిపోయింది. కేవలం అర నిమిషం వ్యవధిలో మొత్తం మారిపోయింది. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతున్న విమానం అలాగే కూలిపోయింది. అంతే వేగంగా మంటలు వ్యాపించాయి. ఒక్కరు మినహా అందరూ చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిన్నాభిన్నం అయిపోయాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణాలేంటి..? కారకులెవరు..? అసలు ఏం జరిగింది..? ఇలా ప్రతి అంశాన్ని తేల్చేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు మొదలైంది. ఈ మొత్తం ఘటనపై AAIB- ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నేతృత్వంలో విచారణ జరగనుంది.
Also Read: బరువు తక్కువ ఇంధన వినియోగం ఎక్కువ.. ఇంతటి ఘోరానికి కారణం ఇదేనా.!
విమాన ప్రమాదం జరిగిన వెంటనే AAIBకి చెందిన అధికారులు రంగంలోకి దిగారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని ఆధారాలను సేకరించారు. ఇక, ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ ముగిశాక బ్లాక్ బాక్స్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ సహా మరికొన్ని టెక్నికల్ ఆధారాలను సేకరించనున్నారు.
సాధారణంగా ప్రాథమిక ఆధారాల సేకరణ మూడు నుంచి ఐదు రోజుల పాటు సాగనుంది. ఆ తర్వాత అధికారికంగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. మరోవైపు.. ఈ దర్యాప్తులో అమెరికా సైతం ఇన్వాల్వ్ కానుంది. యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ NTSB ఈ విషయంపై ఇప్పటికే ఓ ప్రకటన చేసింది.