Red Fort Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎర్ర కోట పేలుడు కేసులో ఎన్ఐఏ అధికారులు మొదటి ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించారు. 7,500 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జ్ షీట్ లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు అనుబంధ సంస్థగా ఉన్న అన్నార్ గజ్వా ఉల్ హింద్ తో నిందితులకు సంబంధాలు ఉన్నట్టుగా తెలియచేశారు. ఈ వైట్ కోట్మాడ్యూల్ లో ఉన్నవాళ్లంతా వైద్యులే అని పేర్కొన్నారు. కీలక రక్షణ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు కుట్రలు జరిపారని తెలియచేశారు. ఆపరేషన్ హెవెన్లీ హింద్ అని పేరు పెట్టుకున్నట్టు వివరించారు.
గతేడాది నవంబర్ 10న దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్ర కోట వద్ద కారు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. దీంట్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కుట్ర చేసిన ఉమర్ బిన్ నబీ కారులో కూర్చొని తనను తాను పేల్చుకోవటం ద్వారా ఈ మారాణ హోమానికి పాల్పడ్డాడు. దీనిపై దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ అధికారులు ఆత్మాహుతి దాడి చేసిన ఉమర్ బిన్ నబీతోపాటు మొత్తం 11మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహమద్ మొహియుద్దీన్ సయ్యద్ కూడా ఉన్నాడు.
దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు హరియాణా, జమ్మూ కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో 588మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. 395కు పైగా డాక్యుమెంట్లు, 200కు పైగా సీజ్ చేసిన పరికరాల నుంచి సాక్ష్యాలను సేకరించారు. విచారణలో ఈ వైట్ కోట్ గ్రూప్ లోని డాక్టర్లకు ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కు అనుబంధ సంస్థగా ఉన్న అన్నార్ గజ్వా ఉల్ హింద్ తో సంబంధాలు ఉన్నాయని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
నిందితులు అందరూ 2022లో శ్రీనగర్ లో సమావేశమై గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నట్టు చార్జీషీట్ లో ఎన్ఐఏ పేర్కొంది. భారత్ లో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేసినట్టుగా కోర్టుకు తెలియజేసింది. కుట్రను అమలు చేయటానికి ఈ గ్రూప్ నియామకాలు కూడా జరిపిందని అధికారులు తెలిపారు. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను సేకరించి ఐఈడీ బాంబులను తయారు చేశారని తెలియజేశారు. తమ నివాస స్థలాలు, ల్యాబ్ లనే వీటి తయారీ హబ్ లుగా మార్చుకున్నారని వివరించారు.
Also Read: ప్రపంచానికి ‘చమురు సెగ’.. మళ్లీ లాక్‌డౌన్ చీకట్లోకి దేశాలు.. మరి భారత్ సంగతేంటి?
మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం ట్రైఆసిటోన్ ట్రైపెరాక్సైడ్ ను కూడా నిందితులు ల్యాబ్ లో తయారు చేసినట్టు ఎన్ఐఏ చార్జ్ షీట్ లో తెలిపింది. జమ్మూ కాశ్మీర్ తోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కీలక భద్రతా స్థావరాలు, రక్షణ సంస్థలను టార్గెట్ గా పెట్టుకున్నారని పేర్కొంది. రాకెట్లు, డ్రోన్లకు ఐఈడీ బాంబులను అమర్చి దాడులు చేయాలని కుట్రలు చేసినట్టుగా వివరించారు. దీని కోసం ట్రయల్స్ కూడా జరిపారన్నారు.
Also Read: ‘ముందు బాధితురాలి వయసు తేల్చండి’.. బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనం