One Nation One Election Sitharaman| ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ లేదా జమిలి ఎన్నికల అమలు విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం స్పష్టతనిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అమలు చేయడం సాధ్యం కాదని ఆమె స్పష్టంగా చెప్పారు. తమిళనాడులోని కట్టంకుళత్తూరులోని ఎస్ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికలతో జీడీపీ వృద్ధి
2024 లోక్ సభ ఎన్నికల కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, భారతదేశంలో ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఖర్చులను చాలా వరకు తగ్గించవచ్చని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ జీడీపీకి దాదాపు 1.5 శాతం లేదా రూ.4.50 లక్షల కోట్లు ఆదా అవుతాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ‘‘పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులను ఒకేసారి ఎన్నుకోవడం ద్వారా జీడీపీలో 1.5 శాతం వృద్ధి జరగడం, విలువగా రూ.4.50 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడం ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ యొక్క స్పష్టమైన ప్రయోజనం’’ అని ఆమె చెప్పారు.
గుడ్డిగా వ్యతిరేకించ వద్దు
ఎస్ఆర్‌ఎం యూనివర్శిటీ చర్చలో నిర్మలా సీతారామన్, కొన్ని రాజకీయ పార్టీలు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కాన్సెప్ట్‌ను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ‘‘ఈ కాన్సెప్ట్ గురించి గతంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విషయం కాదు. 1960 వరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉనికిలో ఉంది. గుడ్డిగా వ్యతిరేకించకూడదు, దాని ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకుని మద్దతు ఇస్తే.. దేశాన్ని ముందుకు నడిపించ గలము’’ అని ఆమె పేర్కొన్నారు.
Also Read: ఇండియాలో భారీ భూకంపం వచ్చే అవకాశం.. నిపుణుల హెచ్చరిక
మరో పదేళ్ల వరకు సాధ్యం కాదు
అయితే, 2034 వరకు జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2034 తర్వాతే ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయని, ఆ విజన్‌ను సాకారం చేసేందుకు ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ కాన్సెప్ట్ ఎవరికి పేట ప్రాజెక్ట్ కాదని, దేశ ప్రయోజనాల కోసం రూపొందించిన ప్రణాళిక అని ఆమె పునరుద్ఘాటించారు. ఈ ఏడాది ప్రారంభంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు మద్దతు పలికారు.
గతంలో కరుణానిధి మద్ధతు
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ఆలోచనకు డీఎంకే అధినేత కరుణానిధి గతంలో మద్దతిచ్చారని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. అయితే, ఆయన కుమారుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాత్రం ఈ కాన్సెప్ట్‌కు మద్దతు ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు.
జమిలి ఎన్నికలపై పట్టువదలని బిజేపీ
బీజేపీ జమిలి ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది. జేపీ నడ్డా ఇటీవలే బిజేపీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఇది దేశానికి ఆర్థిక లాభాలు తీసుకురావడం, వ్యయం తగ్గించడం, మానవ వనరుల వినియోగం తగ్గడం వంటి ప్రయోజనాలు కలిగిస్తుందని అన్నారు. జమ్మిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రస్తుత ఎన్నికల భారాన్ని కూడా నివారించవచ్చు అని చెప్పారు.
ఆఫీస్ బేరర్లతో, జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, బీజేపీ ముఖ్యమైన పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ఎంపీలను ఉత్సాహపరిచారు.