Bharath Vs Ganesh: రాజమండ్రి వైసీపీలో మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య ఆధిపత్యపోరు పోరు తారా స్థాయికి చేరుకుంది.. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆ పార్టీ పరువుతో పాటు నాయకుల ప్రతిష్టను కూడా బజారున పడేస్తుంది. 2019 ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ కుటుంబాలు ఆధిపత్యం కోసం మాటల యుద్ధం చేస్తూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు … ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం, చేసే పనులు మరో లెవల్‌కు వెళ్లడం.. ఎవరినీ సముదాయించలేక జగన్ సైలెంట్ అవ్వడంతో జక్కంపూడి గణేష్ పార్టీని వీడటానికి డిసైడ్ అయ్యారంట..
రాజమండ్రి వైసీపీలో భరత్, గణేష్‌ల మధ్య ఆధిపత్యపోరు
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయంట. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తూర్పుగోదావరి జిల్లాలో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్యపోరుకు మాత్రం తెర దించలేకపోయింది.. గడిచిన ఐదేళ్లుగా వైసీపీలో ఉన్న ఇద్దరు నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువుతో పాటు వాళ్ళ ప్రతిష్టను కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు.. ఆ ఇద్దరు నాయకులు టార్గెట్ ఒకటే.. రాజమండ్రి నగరంపై తమ ఆధిపత్యం మాత్రమే ఉండాలని.. ఈ ఆలోచనే రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి రామ్మోహన్‌రావు చిన్న కొడుకు జక్కంపూడి గణేష్ మధ్య రాజకీయ వైరానికి కారణమైంది..
వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న జక్కంపూడి ఫ్యామిలీ
జక్కంపూడి ఫ్యామిలీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి తూర్పుగోదావరి జిల్లాలో తెలియని రాజకీయ నాయకుడు ఉండడు.. వైఎస్ సన్నిహితుడుగా జక్కంపూడి రామ్మోహన్ రావు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.. జక్కంపూడి రాజకీయ వారసులుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జక్కంపూడి రాజా, ఆయన తమ్ముడు జక్కంపూడి గణేష్ లు వైఎస్, జక్కంపూడి రమ్మోహన్‌రావు మరణాల తర్వాత వైసీపీలో జగన్‌కు అత్యంత సన్నిహితులుగా, లాయల్టీ ఉన్న నాయకులుగా కొనసాగుతున్నారు..
జగన్ కోటరీలో కీలక నేతగా ఎదిగిన మార్గాని భరత్
మరోపక్క 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మార్గాని భరత్ జగన్ కోటరీలో కీలకమైన నాయకుడిగా మారిపోయారు.. జగన్ ఆదేశిస్తే ఏం చేయడానికైనా రెడీ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. జక్కంపూడి ఫ్యామిలీకి వైఎస్‌కు అనుబంధం ఉంటే, మార్గాని భరత్‌కు వైసిపి అధినేత జగన్‌కు ప్రత్యేక అనుబంధం కనిపిస్తుంది.. ఒకరేమో తండ్రి వైపు నుంచి వచ్చిన వాళ్ళు.. మరొకరు తన ప్రమేయంతో వచ్చిన నేత కావడంతో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కాక జగన్ సైలెంట్‌గా ఉండిపోతున్నారంట.. వైసిపి అధిష్టానం సైలెంట్‌గా ఉండడమే రాజమండ్రి రాజకీయాల్లో జక్కంపూడి, మార్గాని కుటుంబాల మధ్య రాజకీయ వైరానికి కారణం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి
రాజమండ్రి రాజకీయాల్లో పట్టున్న జక్కంపూడి కుటుంబం
జక్కంపూడి రామ్మోహన్‌రావు రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి రాజమండ్రిపై పట్టుంది.. రాజమండ్రి రాజకీయాల్లో కీలకమైన నాయకులుగా జక్కంపూడి ఫ్యామిలీ వ్యవహరిస్తూ వస్తుంది.. జక్కంపూడి రామ్మోహన్రావు మరణం తర్వాత వైసీపీ నుండి బరిలోకి దిగి రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచిన జక్కంపూడి తనయుడు రాజా పక్క నియోజకవర్గానికి వెళ్లిన రాజమండ్రి పై ఫోకస్ మాత్రం తగ్గించలేదు.. జక్కంపూడి రాజా రాజానగరంపై దృష్టి పెడితే ఆయన తమ్ముడు, ప్రస్తుత ఉభయగోదావరి జిల్లాల యువజన విభాగం కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మాత్రం పూర్తి ఫోకస్ రాజమండ్రి నగరం పైనే పెడుతూ వస్తున్నారు..
Also Read: నాగబాబుకు వర్మ దెబ్బ!.. వర్మ ఫ్యూచర్ ఏంటి?
వైసీపీలో ఆధిపత్యం చెలాయించడానికి భరత్, గణేష్
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే గెలవడం, వైసీపీ నుండి పార్లమెంటరీ కమిటీలో మార్గాని భరత్‌కు కీలకమైన పదవి రావడంతో జక్కంపూడి గణేష్, మార్గాని భరత్ లు ఎవరి ఆధిపత్యాన్ని వాళ్లు చలాయించే ప్రయత్నం మొదలుపెట్టారు.. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరుతీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ ప్రతిపక్షాలకు పలుచనయ్యారంటారు.. ఒకే పార్టీలో ఉన్న మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌లు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ఆ పార్టీ నేతలకే మింగుడుపడటం లేదంట..
గణేష్ బ్లేడ్ బ్యాచ్ తయారు చేశారని భరత్ విమర్శలు
మార్గాని భరత్ జిమ్ చేసే రీల్స్‌పైన, అతను చేసే వ్యాఖ్యలపైన జక్కంపూడి గణేష్ విమర్శలు చేస్తే.. మార్గాని భరత్ ఇంకో అడుగు ముందుకేసి జక్కంపూడి గణేష్ బ్లేడ్ బ్యాచ్ని తయారుచేసి రాజమండ్రి నగరంపై వదిలారని, వైసీపీలో ఉంటూ ఎమ్మెల్యే ఆది రెడ్డి వాసుతో పర్సంటేజీలు మాట్లాడుకుని వైసీపీకి ద్రోహం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.. మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వైరం పరిష్కరించలేని స్థాయికి చేరుకోవడంతో జక్కంపూడి గణేష్ వైసీపీలో కొనసాగడం కష్టంగా కనిపిస్తుంది..
భరత్ వైఖరితో వైసీపీ ప్రతిష్ట దిగజారుతుందంటున్న గణేష్
తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి రాజకీయాల్లో మార్గాని భరత్ వల్ల వైసీపీ ప్రతిష్ట దిగజారుతుందని, భరత్ వ్యవహార శైలి ఇదేవిధంగా ఉంటే వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని గణేష్ అంటున్నారు.. అందుకే వైసీపీని వీడటానికి నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి అధిష్టానానికి చెప్పారంట.. అంతేకాకుండా రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీని వదిలి వేయడానికి గల కారణాలు, మార్గని భరత్ వల్ల వైసీపీకి జరుగుతున్న నష్టాలను బయట పెడతానని చెపుతుండటంతో ఆ పార్టీ మరింత డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది
వైసీసీని వీడుతున్న వైఎస్ సన్నిహిత కుటుంబాలు
జక్కంపూడి ఫ్యామిలీ సభ్యుడు వైసీపీని వీడనుండటంతో పార్టీలో కూడా ఇంటర్నల్‌గా చర్చ మొదలైందంట.. ఇప్పటికే వైసీపీలో కీలకంగా ఉన్న అనేకమంది నాయకులు పార్టీని వీడి వెళుతున్నారు.. వైసీపీని వీడుతున్న వాళ్లందరిలో వైఎస్‌కు సన్నిహితంగా మెలిగిన వాళ్లే ఉన్నారు.. ఇప్పుడు జక్కంపూడి ఫ్యామిలీ నుండి మాస్ లీడర్ గా పేరున్న జక్కంపూడి గణేష్ వైసిపికి రాజీనామా చేస్తే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది.. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రిలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా జగన్ స్పందించకపోవడమే జక్కంపూడి గణేష్ అలకకు కారణంగా చెప్తున్నారు..
భరత్‌ను కట్టడి చేస్తారా? జక్కంపూడి ఫ్యామిలీని దూరం చేసుకుంటారా?
ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం గణేష్ ఆరోపణలు చేస్తున్నట్లు మార్గాని భరత్‌ఫై ఏమైనా చర్యలు తీసుకుని కట్టడి చేస్తుందా? లేక జక్కంపూడి ఫ్యామిలీని వదులుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.. ఇన్ని సంవత్సరాలు వైసీపీలో తూర్పుగోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న జక్కంపూడి ఫ్యామిలీ నుండి గణేష్ బయటకు వస్తే ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనే చర్చ జోరుగా సాగుతుంది.. టిడిపి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ,, టిడిపిలో జాయిన్ అయితే సెకండ్ గ్రేడ్ లీడర్‌గానే మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి గణేష్ అటువైపు చూసే పరిస్థితి లేదంటున్నారు..
జక్కంపూడి గణేష్ జనసేనలో చేరతారని ప్రచారం
ఒకే సామాజిక వర్గం కాబట్టి జక్కంపూడి ఫ్యామిలీకి ఉన్న క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీలో జాయిన్ అయితే ఫ్యూచర్‌లో రాజమండ్రి రాజకీయాల్లో క్యాడర్ను నిలబెట్టుకోగలరనే ప్రచారం జరుగుతుంది.. మరి గత కొన్నేళ్లుగా రాజమండ్రిలో జరుగుతున్న ఈ రాజకీయ రచ్చపై జక్కంపూడి గణేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? గణేష్ తీసుకునే నిర్ణయంపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి