Ahmedabad Air India Crash: ప్రపంచమంతా ఒక్కసారిగా నివ్వెర పోయేలాంటి విమాన ప్రమాదం. అహ్మదాబాద్ టూ లండన్ చేరాల్సిన డ్రీమ్ లైనర్.. కుప్పకూలడంతో.. ఒక్కసారిగా అలజడి రేగింది. ఇటు భారత్ తో పాటు అటు బ్రిటన్ లోనూ ప్రమాదం తాలూకూ ప్రకంపనలు సృష్టించాయి. ఈ ప్రమాదంలో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? లేక సాధారమైన యాక్సిడెంట్ గా భావించాలా? ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కి కారణాలు ఏమై ఉంటాయ్? అన్న చర్చకు తెరలేచింది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విమానంలో ప్రయాణించిన వారు మాత్రమే కాకుండా.. ఫ్లైట్ బీజే మెడికల్ హాస్టల్ భవనంపై పడడంతో కొందరు విద్యార్థులు, మరికొందరు స్థానికులు మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 274గా ప్రకటించారు అధికారులు.
తాజాగా విమానం తోక భాగంలో మరో మృతదేహం లభించింది. భవనంపైన ఉన్న విమానం టెయిల్ పొజిషన్‌ను కిందకు దించి.. చర్యలు చేపడుతున్న సమయంలో.. మరో మృత దేహం లభించిందని అధికారులు తెలిపారు. ఆ బాడీని సివిల్ హాస్పిటల్‌కు తరలించామని వెల్లడించారు.
ఇప్పటికే బ్లాక్ బాక్స్ లభించడంతో విమాన ప్రమాదం ఎందుకు జరిగింది..? ఫ్లైట్ క్రాష్ అయ్యే కొన్ని క్షణాల ముందు కాక్‌పిట్‌లో పరిస్థితి ఏంటి..? సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తాయా లాంటి అన్ని అంశాలు తెలియనున్నాయి. దీంతో.. బ్లాక్ బాక్స్‌లో రికార్డైన సమాచారాన్ని అనలైజ్ చేసే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి.
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనలో 11మంది మృతుల DNAలు.. వారి కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ లతో సరిపోయినట్లు తేలింది. ఈ ప్రమాదంలో దుర్మరణానికి గురయిన 274 మందిలో చాలా మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. DNA పరీక్షతో సంబంధం లేకుండా 8 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. మిగతా మృతుల డీఎన్‌ఏ లను గుర్తించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు అధికారులు.
డీఎన్‌ఏ ప్రక్రియ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, తొందరపాటుగా చేయకూడదన్నారు ప్రొఫెసర్ డాక్టర్ రజనీశ్ పటేల్. చట్టపరమైన, వైద్యపరమైన చిక్కులున్నాయన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి అయిన విశ్వాస్‌కుమార్ రమేష్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అలాగే ప్రమాదంలో మరణించిన 11మంది విదేశీయుల కుటుంబాల సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
Also Read: దేవుడి ఆట? ట్రిప్‌కు వెళ్తే టెర్రర్.. కప్పు కొడితే హర్రర్.. విమానమెక్కితే గాల్లోకే ప్రాణాలు!
ఎయిర్ ఇండియా ఏఐ 171 దుర్ఘటన పాలవడంతో..ఆ ఫ్లైట్ నెంబర్‌ను శాశ్వతంగా నిలిపివేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఏఐ 171 స్థానంలో ఏఐ 159 కొత్త ఫ్లైట్ నెంబర్‌తో నడపనున్నారు. ఈ దుర్ఘటనలో మొత్తం 274 మంది మృతిచెందారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహ DNA పోలిక ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు.