పహల్గాం దారుణ మారణకాండ తర్వాత పాకిస్తాన్ దేశీయుల్ని వెంటనే వెళ్లిపోవాల్సిందిగా భారత్ ఆదేశించింది. దీంతో చాలాంది ఇప్పటికే తట్టాబుట్టా సర్దేసుకున్నారు. భారత పౌరసత్వం తీసుకున్న వారు, లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారు మినహా.. మిగతా వారంతా పాకిస్తాన్ కి తిరిగి వెళ్లిపోవాల్సిందే. అయితే ఇక్కడ చిన్న చిన్న సమస్యలున్నాయి. వైద్యంకోసం వచ్చినవారు తమకి మరికొన్ని రోజులు అవకాశమివ్వాలని ప్రాధేయపడుతున్నారు. పెళ్లి తర్వాత భారత్ లో స్థిరపడినవారు, తమకింకా పౌరసత్వం రాలేదని తమని వెళ్లిపోవాలని చెప్పొద్దని అడుగుతున్నారు. ఇలాంటి సంఘటనల్లో దబయ రామ్ ది ఒక ప్రత్యేకమైన కథ.
ఎవరీ దబయ రామ్..?
దబయ రామ్ అనే వ్యక్తి పాకిస్తాన్ మాజీ ఎంపీ. ఆయన కుటుంబం ఇప్పుడు హర్యానాలోని ఫతేబాద్ జిల్లాలో రతన్ ఘర్ గ్రామంలో నివశిస్తోంది. మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య 34. దబయ రామ్ సహా మొత్తం ఆరుగురికి భారత పౌరసత్వం లభించింది. మిగతా 28మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ వారికి పౌరసత్వం లభించలేదు. అందుకే వారంతా వీసా పర్మిట్ పై భారత్ లో ఉంటున్నారు. పహల్గాం ఉదంతం తర్వాత వారిని హర్యానా పోలీసులు పిలిపించారు. లాంగ్ టర్మ్ వీసా ఉండటంతో వారిని తిరిగి రతన్ ఘర్ కి పంపించారు.
దీనగాథ..
దబయరామ్ ది ఒక దీనగాథ. పాకిస్తాన్ పార్లమెంట్ మాజీ సభ్యుడైనా అతడు ప్రస్తుతం ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ ఉదయాన్నే ఐస్ క్రీమ్ బండి తీసుకుని రోడ్లపైకి వస్తాడు. రతన్ ఘర్ సహా చుట్టుపక్కల పల్లెల్లో ఐస్ క్రీమ్ అమ్మి జీవనోపాధి కొనసాగిస్తున్నాడు దబయ్ రామ్.
అప్పట్లోనే వివక్ష..
దబయ్ రామ్ హిందువు. దేశ విభజనకు ముందు పంజాబ్ లో జన్మించిన ఆయన.. విభజన తర్వాత పాకిస్తాన్ లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన్ను మతం మారాల్సిందిగా తీవ్ర ఒత్తిడి చేసేవారు స్థానికులు. కానీ దబయ్ రామ్ మాత్రం ఒప్పుకోలేదు. అతడి పేరు దేశ్ రాజ్ గా ఉండేది. పాకిస్తాన్ లో ఓటర్ కార్డుల జారీ సమయంలో ఆ పేరుని బలవంతంగా దబయ రామ్ గా అధికారులు మార్చారు. కాలక్రమంలో 1988లో రామ్ లోహియా, బఖర్ జిల్లాల నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు దబయ్ రామ్. ఎంపీల జాబితాలో అతడి పేరు అల్లా దబయాగా ఉంటుంది. అంటే అక్కడ కూడా మతం పేరుతో దబయ రామ్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఇక ఆయన కుటుంబానికి కూడా అక్కడ వేధింపులు తప్పలేదట. తన కుటుంబంలోని మహిళను బలవంతంగా తీసుకెళ్లి అక్కడివారు పెళ్లి చేసుకున్నారని, ఆ సమయంలో తనకు సుప్రీంకోర్టులో కూడా న్యాయం దక్కలేదని అంటాడు దబయ రామ్. 2000 సంవత్సరంలో అక్కడ ఉండలేక భారత్ కి వచ్చేశాడు దబయ రామ్. మొదట్లో నెలరోజుల తాత్కాలిక వీసాపై తాను వచ్చి, తర్వాత కుటుంబ సభ్యుల్ని కూడా హర్యానాకు తీసుకొచ్చాడు.
పాకిస్తాన్ లో పార్లమెంట్ కి సభ్యుడైనా.. భారత్ కి తిరిగొచ్చాక తిండికోసం పోరాడాల్సి వచ్చింది. ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు దబయ రామ్. ప్రస్తుతం అతనితోపాటు ఆరుగురు కుటుంబ సభ్యులకు భారత పౌరసత్వం ఉంది. మిగతావారికి కూడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలాంటి టైమ్ లో పహల్గాం ఘటన ఆ కుటుంబాన్ని మరోసారి వార్తల్లోకెక్కేలా చేసింది. పాకిస్తాన్ కి చెందిన 34మంది కుటుంబ సభ్యులు హర్యానాలో ఉంటున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అధికారుల జాబితాలో కూడా వారు పాకిస్తాన్ జాతీయులే కావడంతో పోలీసులు పిలిపించి మాట్లాడారు. చివరకు వారిని రతన్ ఘడ్ కి పంపించివేశారు.
భారత్ లో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుల ఉదాహరణలు చాలానే ఉంటున్నా.. దబయ్ రామ్ కథ మాత్రం చాలా ప్రత్యేకం. పాకిస్తాన్ పార్లమెంట్ కి సభ్యుడిగా పనిచేసినా కూడా ఇప్పుడు తిండికోసం ఐస్ క్రీమ్ బండి నడుపుకుంటున్నాడాయన.