Online Gaming Govt Funds| ఆన్‌లైన్ గేమింగ్ మోసాలు (Online Gaming Scams) రోజురోజుకీ పెరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు మోసగాళ్లు కాజేస్తున్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసు బయటపడింది. క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ కోసం రూ. 3 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం అయిన కేసులో.. ఒక పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (పీఈఓ)ని ఇటీవలే కార్యాలయం నుంచి సస్పెండ్ చేశారు.
ఇప్పుడు అతన్ని రాష్ట్ర విజిలెన్స్ విభాగం (State Vigilance Department) అరెస్టు చేసింది. ఈ సంఘటన గురించి ఒక అధికారి మీడియాకు వివరాలు అందించారు. పంచాయతీ కార్యనిర్వాహక అధికారి దేబానంద సాగర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, భారీ మొత్తంలో ప్రభుత్వ డబ్బును వాడుకున్నారని దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఇందుకోసం ఆయన వివిధ పంచాయతీల సర్పంచ్‌ల సంతకాలను నకిలీ చేశాడని కూడా తేలిందని తెలిపారు.
కలహండి జిల్లాలోని తుమల్-రాంపూర్ బ్లాక్ పరిధిలోని తలనేగి గ్రామ పంచాయతీ మరియు పొడపాదర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రూ. 3.26 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు దేబానంద సాగర్‌పై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సాగర్ ఈ మొత్తాన్ని తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడని ఆయన వివరించారు. దేబానంద సాగర్ తలనేగి గ్రామ పంచాయతీ నుండి రూ. 1.71 కోట్లు, పొడపదర్ గ్రామ పంచాయతీ నుండి రూ. 1.55 కోట్లు దుర్వినియోగం చేశాడు. సర్పంచ్‌ల సంతకాలను నకిలీ చేయడం ద్వారా అతను పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS)ను దుర్వినియోగం చేశాడు.
Also Read: జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. ఆయనకు కొత్తేం కాదు ఇంతకుముందు కూడా
ఇంతేకాకుండా, దేబానంద సాగర్ 15వ కేంద్ర ఆర్థిక సంఘం (CFC) మరియు 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం ఖాతాల నుండి ప్రభుత్వ డబ్బును తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేశాడు. నిందితుడు దేబానంద్ సాగర్ 2016, జూలై 4న తలనేగి గ్రామ పంచాయతీలో పీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. నిందితుడు 2018 సంవత్సరంలో మే 5 నుంచి 2022 సంవత్సరం మార్చి 17 వరకు పొడపదర్ గ్రామ పంచాయతీ అధికారిగా పనిచేశారు. ఈ సమయంలోనే అతను ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకుంది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు 357 అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసి, 2,400 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాలలో రూ. 126 కోట్లను ఉన్నట్లు సమాచారం. ఈ సైట్లు జీఎస్టీ ఎగవేతలు చేస్తున్నాయని, చట్టవిరుద్ధంగా ఆదాయాన్ని దాచిపెడుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా, 700 కంటే ఎక్కువ బెట్టింగ్ మరియు గేమ్బ్లింగ్ సంస్థలపై నిఘా ఉంది.
దేశం వెలుపల నడుపుతున్న అక్రమ గేమింగ్ సంస్థలకు సంబంధించిన 166 ఖాతాలను బ్లాక్ చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ ప్లాట్‌ఫామ్స్‌లకు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్లాట్‌ఫామ్స్‌లు ప్రజల ఆర్థిక భద్రతకు ముప్పు తిప్పుతూ, దేశ భద్రతకు హాని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు జీఎస్టీ కింద రిజిస్టర్ అవ్వాలని, 28% జీఎస్టీ చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. రాబోయే ఐపీఎల్ సీజన్‌తో పాటు చట్టవిరుద్ధ గేమింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ప్రజలు ఈ ప్లాట్‌ఫామ్స్‌ల నుండి దూరంగా ఉండాలని సూచించారు.