BigTV English

Paramahansa Yogananda : ఆధ్యాత్మిక దివ్యజ్యోతి.. పరమహంస యోగానంద..

Paramahansa Yogananda : ఆధ్యాత్మిక దివ్యజ్యోతి.. పరమహంస యోగానంద..

Paramahansa Yogananda : స్వామి వివేకానందులకంటే ముందు పశ్చిమ దేశాలకి సనాతన ధర్మపు విశిష్టతను, భారతీయ సంస్కృతిని పరిచయం చేసి, గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించిన యోగి పుంగవుల్లో పరమహంస యోగానంద అగ్రగణ్యులు. క్రియాయోగం అనే సనాతన ధ్యాన పక్రియను విశ్వవ్యాపితం చేసి.. ఎందరికో ముక్తి మార్గాన్ని సూచించిన పరమహంస యోగానందుల వారి 131వ జయంతి నేడు. ఈ సందర్భంగా వారి జీవన విశేషాలను తెలుసుకుందాం.


పరమహంస యోగానంద నేటి ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ పట్టణంలో 1893 జనవరి 5వ తేదీన జన్మించారు. ఆయన చిన్ననాటి పేరు.. ముకుందలాల్ ఘోష్. తండ్రి భగవతీ చరణ్ ఘోష్ బెంగాల్ – నాగపూర్ రైల్వేలో ఉద్యోగి. తల్లి గృహిణి. భగవతీ చరణ్ దంపతులకు మొత్తం ఎనిమిది మంది సంతానం కాగా.. వీరిలో నాలుగోవాడు ముకుందుడు. కొడుకుల్లో రెండో వాడు. బాల్యం నుంచే భక్తిభావాలు కలిగిన ఆయనకు సాధు సంతుల పట్ల అపారమైన భక్తి గౌరవాలుండేవి. చిన్ననాటి నుంచే లౌకిక ప్రపంచం పట్ల నిరాసక్తత, జ్ఞానాన్వేషణ పట్ల అలవిమాలిన ఆరాటం ఉండేది.

ఈ క్రమంలోనే యోగవిద్య మీద ఆసక్తితో 1910లో తన పదిహేడవ ఏట కోల్‌కతాలో ఓ గురువును కలిశారు. వారే యుక్తేశ్వరగిరి. శ్రీయుక్తేశ్వర్ గిరి గారి శ్రీరాంపూర్ ఆశ్రమంలోనూ, పూరీ ఆశ్రమంలోనూ ఒక దశాబ్దం పాటు యోగ శిక్షణ పొందారు. గురుశిష్యుల మధ్య ఉండే కోమలమైన, ప్రేమమయమైన బంధాన్ని, జ్ఞానం, క్షమ, దివ్యమైన ప్రేమలను అనుభూతి చెందిన యోగానందులు.. క్రియా యోగాన్ని సాధన చేసి, దానిని శిష్యులకు నేర్పటం ఆరంభించారు. గురువు చేతుల మీదగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, స్వామి యోగానందగా పేరొందారు. యోగవిద్యకు ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో 1917, మార్చి 22న రాంచీలోనూ మరో పాఠశాల మొదలయింది. అదే.. కాలక్రమంలో ‘యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా’గా రూపొందింది.


అనంతరం గురువాజ్ఞ మేరకు అమెరికాకు వెళ్లి.. అనతి కాలంలోనే పాశ్చాత్య ప్రపంచపు యోగ పితామహుడుగా పేరుపొందారు. 1920లో బోస్టన్‌ చేరుకున్న యోగానందులు.. తన ఉపన్యాసాలతో ఖండాంతర పర్యాటన చేశాడు. చివరికి 1925లో లాస్ ఏంజిలస్ లో స్థిరపడ్డాడు. తర్వాత పాతికేళ్ల పాటు అక్కడినుంచే తన బోధనలతో పాశ్చాత్య ప్రపంచంలో కొత్త ఆధ్యాత్మిక వెలుగును నింపారు. 1952 నాటికి భారత్‌, అమెరికాల్లో 100కి పైగా క్రియా యోగ కేంద్రాలు నెలకొల్పారు. సరళ జీవనం, ఉన్నతమైన ఆలోచనతో కూడిన యోగానందుల బోధనా విధానం పాశ్చాత్య జిజ్ఞాసువులను విశేషంగా ఆకట్టుకుంది.

భారతదేశంలో అనాదిగా ఉన్న గురుశిష్య సంబంధపు గొప్పదనాన్ని వీరు పాశ్చాత్య ప్రపంచానికి తనదైన శైలిలో వివరించారు. ఈ ప్రపంచంలోని మిగిలిన అన్ని అనుబంధాలన్నీ.. కుటుంబ, స్నేహ, అవసరాల ప్రాతిపదికన ఏర్పడినవేనని, కానీ.. వీటికి విభిన్నంగా, శిష్యుని ఆధ్యాత్మిక ఉన్నతికై నిస్వార్థంగా గురువు పడే తపన, ఆర్తి, శిష్యుని కోసం సర్వం త్యాగం చేసే గురుతత్వం ఎంతో ప్రత్యేకమైనవి ఆయన ప్రపంచానికి తెలిపారు.

1927లో నాటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ వీరిని వైట్‌హౌస్‌కి ఆహ్వానించి వీరి గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు. లాస్ ఏంజిలస్ టైమ్స్ పత్రిక ఆయన్ను 20వ శతాబ్దపు తొలి అత్యుత్తమ గురువుగా అభివర్ణించింది. యోగానంద మహానుభావుని జీవిత చరిత్రను ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో గ్రంథరూపంలో ప్రకటించారు.

1952 మార్చి 7 న యోగానంద అమెరికాలో భారత రాయబారి వినయ్ రంజన్ సేన్ గౌరవార్థం లాస్ ఏంజిలస్ లోని బిల్ట్‌మోర్ హోటల్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నాడు. పాశ్చాత్య ప్రపంచపు భౌతిక పురోగతీ, భారతదేశపు ఆధ్యాత్మిక ఉన్నతి కలిస్తే.. శాంతి, సమృద్ధిగల నూతన ప్రపంచం నిర్మితమవుతుందన్నారు. ప్రసంగం అనంతరం.. తాను రాసిన ‘మై ఇండియా’ అనే పద్యంలోనుంచి కొన్ని వాక్యాలను చదువుతూ.. తన దృష్టిని ఆజ్ఞాచక్రంపై నిలిపి తన భౌతిక జీవన యాత్రను ముగించారు.

1946, డిసెంబరులో విడుదలైన వీరి ఆత్మకథ ‘ఒక యోగి ఆత్మకథ’ గ్రంథం 26 భాషల్లో 40 లక్షల కాపీలకు పైగా అమ్ముడై.. 20వ శతాబ్దపు 100 అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ గ్రంథం ద్వారా నేటికీ పరమహంస యోగానందుల వారు.. భారతదేశపు ప్రాచీన విజ్ఞానసారాన్ని ప్రపంచానికి అందించటంతో బాటు లక్షలాది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను తీర్చుతూనే ఉన్నారు.

Tags

Related News

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Ladakh: లడఖ్ నిరసనల వెనుక కుట్ర దాగి ఉందన్న లెఫ్టినెంట్ గవర్నర్

Big Stories

×