Passenger Dead In Flight| విమానం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయి గాల్లో ఉండగా.. అందులో ప్రయాణికుడు ఆకస్మకంగా మృతి చెందాడు. దీంతో ఫ్లైట్ ని పైలట్లు తిరిగి ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఆకస్మికంగా మరణించడంతో, విమానాన్ని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మృతుడు అస్సాం రాష్ట్రంలోని నల్బారి ప్రాంతానికి చెందిన సతీష్ బర్మన్‌గా గుర్తించబడినట్లు సమాచారం. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలో చికిత్స పొందేందుకు తన భార్య కంచన్, మేనల్లుడు కేశవ్ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.
Also Read: కస్టమర్ల వద్ద సర్వీస్ ఛార్జీలు వసూలు చేసే రెస్టారంట్లపై చర్యలు
ఈ క్రమంలో సతీష్ బర్మన్ మరణించారు. దీంతో విమాన సిబ్బంది.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయవలసి వచ్చింది. ఈ ఘటనతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఆందోళన చెందారు. అయితే, సతీష్ బర్మన్ ఆరోగ్యం విషమంగా ఉందని గమనించిన సిబ్బంది.. ఆ సమయంలో వెంటనే స్పందించి విమానాన్ని ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ల్యాండింగ్ కు ముందే సతీష్ చనిపోవడం విషాదకరం.
విమానంలో దొంగచాటుగా బీడీ తాగుతూ పట్టుబడి..
సూరత్-కోల్‌కతా విమానంలో ఓ ప్రయాణికుడు బీడీ తాగుతూ సిబ్బందికి పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూరత్ నుంచి కోల్‌కతా వెళ్ళిపోతున్న ఈ విమానంలో గురువారం సాయంత్రం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టేకాఫ్ ఆలస్యం అయ్యింది. ఈ కారణంగా, ప్రయాణికులు విమానంలోనే నిరీక్షిస్తూ ఉన్నారు.
ఈ సమయంలో, విమానంలోని వాష్‌రూమ్ నుంచి పొగ, వాసన రావడం గమనించిన సిబ్బంది వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు తనిఖీలు చేపట్టి, పశ్చిమబెంగాల్‌కు చెందిన అశోక్ బిశ్వాస్ బ్యాగ్‌లో బీడీలు మరియు అగ్గిపెట్టె ఉన్నట్లు గుర్తించారు. అతడు వాష్‌రూమ్‌లో బీడీ తాగినట్లు అధికారులు గుర్తించి, వెంటనే అతడిని విమానంలోని ప్రదేశం నుంచి దింపారు.
ఆతర్వాత, పోలీస్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారుల కళ్లుగప్పి ప్రయాణికుడు నిషేధిత వస్తువులను విమానంలోకి ఎలా తీసుకువచ్చాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అగ్గిపెట్టె వంటి వస్తువులు ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఉన్నాయి. దీంతో, అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
విమానంలో గాల్లో ఉండగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు
విమాన ప్రయాణాల్లో ఇలాంటి విచిత్ర పరిస్థితులు కొంతకాలంగా ఎదురవుతూనే ఉన్నాయి. గత సంవత్సరం మే నెలలో మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఓ విమానంలో ఓ ప్రయాణికుడు కలకలం రేపాడు. ప్రయాణం మధ్యలో ఆ ప్రయాణికుడు విమానం డోర్ తెరవాలని ప్రయత్నించాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
అయితే, వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ నగరంలోని గాజులరామారం ప్రాంతానికి చెందిన ఓ జిమ్ ట్రైనర్‌గా గుర్తించారు. విమానం డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఆ జిమ్ ట్రైనర్ పై విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.