Big Stories

Indigo : విమానం ఎమర్జెన్సీ డోర్ తెరచేందుకు ప్రయత్నం.. ప్రయాణికుడు అరెస్ట్..

Indigo : ఈ మధ్యకాలంలో విమానాల్లో కొందరు ప్రయాణికుల ఆగడాలు శృతి మించుతున్నాయి. మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు ఓ వృద్ధురాలుపై మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. మందుబాబులు విమానాల్లో సిబ్బందితో గొడవలు పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇలా కొందరు ప్రయాణికులు నిబంధనలు ఉల్లంఘిస్తూ హద్దుమీరడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరచేందుకు యత్నించడం కలకలం రేపింది. నాగ్‌పూర్‌- ముంబై ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది. వెంటనే విమాన సిబ్బంది అప్రమత్తంకావడంతో ప్రమాదం తప్పింది.

- Advertisement -

నాగ్‌పూర్‌ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉండగా ప్రణవ్ రౌత్ అనే ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. అత్యవసర ద్వారం తెరచేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది.. వెంటనే కెప్టెన్‌ను అప్రమత్తం చేశారు. ఆ ప్రయాణికుడిని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇండిగో సంస్థ వెల్లడించింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత.. ప్రణవ్‌ రౌత్‌ను సీఐఎస్‌ఎఫ్‌ బలగాలకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రణవ్‌ రౌత్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఇండిగో సంస్థకు చెందిన చెన్నై – తిరుచిరాపల్లి విమానంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అత్యవసర ద్వారం తెరిచిన ఘటన ఇటీవల చర్చనీయాంశమైంది. అయితే పొరబాటుగానే సూర్య ఆ తలుపులను తెరిచినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. తాజాగా ఓ ప్రయాణికుడు ఇలాంటి చర్యకు పాల్పడటం కలకలం రేపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News