Supreme Court : దేశంలో ఆన్ లైన్ లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న పోర్నోగ్రఫిని నిషేధించాలని సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బాలికలు, మహిళలపై దురాగతాలకు పాల్పడే వారికి తగిన బుద్ది చెప్పేలా చర్యలు చేపట్టాలని కోరిన పిటినర్లు.. వారి భద్రతకు నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను పరిగణలోకి తీసుకోవాలని కోరిన పిటిషనర్.. అత్యాచారాలు, లైంగింక వేధింపులకు పాల్పడే వ్యక్తులకు శాశ్వత నపుంసకత్వం వచ్చేలా చేయాలని కోరారు. ప్రజా రవాణాలో సామాజిక ప్రవర్తనను నియంత్రించడం, ఉచిత ఆన్ లైన్ పోర్నోగ్రఫిని నిషేధించాలని అభ్యర్థించారు.
పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టీస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన ధర్మాసం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు తెలపాలంటూ నోటిసులు జారీ చేసింది. అయితే.. లైగింక నేరాలకు పాల్పడే వారికి శాశ్వత నపుంసకత్వం వచ్చేలా చేయాలనే అభ్యర్థన అనాగరికమైనదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి అభ్యర్థనలు కోర్టు అంగీకారాన్ని పొందకపోవచ్చని తెలపగా.. న్యాయస్థానానికి సమంజసం కాదనిపిస్తే తమ అభ్యర్థనలను పరిమితం చేయవచ్చని అంగీకరించారు. ఈ కేసును వచ్చే ఏడాది లిస్ట్ చేస్తూ రిజిస్ట్రార్ కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో అప్పటికే అనేక చట్టాలు ఉన్నాయని చెబుతున్నా.. అవ్వన్నీ చెప్పినవి చెప్పినట్లుగా అమలు కావడం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది పావని అన్నారు. ఈమె సుప్రీం కోర్టు మహిళా న్యాయవాదుల సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్నారు. దేశంలో న్యాయానికి దూరంగా ఉన్న వారి కోసమే పిటిషనర్ ప్రయత్నమన్న లాయర్ పావణి.. అత్యంత దుర్భలమైన పరిస్థితుల్లో ఉండే వారికి న్యాయం చేకూర్చాలని సుప్రీంను అభ్యర్థించారు. వీధుల్లో ఉండే మహిళలు, ఎలాంటి ఆసరా, తోడ్పాటు లేని మహిళల కోసం దేశవ్యాప్తంగా ఒకే విధమైన భద్రతా మార్గదర్శకాలు, సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.
పిటిషనర్ వాదనల్లో కొన్నింటిని అభినందించిన సుప్రీం ధర్మాసం.. వాటి అమలు ఆవశ్యకత ఉందని అంగీకరించారు. ముఖ్యంగా ప్రజా రవాణాలో సామాజిక ప్రవర్తన అంశాన్ని అభినందించిన జస్టిస్ సూర్య కాంత్.. వీధుల్లో ఉండే సామాన్య మహిళల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఇది చాలా వినూత్నమైన ఆలోచన అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో శాశ్వత లైగింక చర్యలకు పనికి రాకుండా చేసే నపుంసకత్వం విధానం అనాగరికమైందని అభిప్రాయపడ్డారు.
దేశంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనల్ని సుప్రీం దృష్టికి తీసుకువచ్చిన పిటిషన్ ర్ తరఫు న్యాయవాది పావణి.. కొల్ కత్తా లోని ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన తర్వాత దేశంలో 94 అత్యాచార ఘటనలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే.. జరుగుతున్న వాటిలో చాలా కొన్నే మీడియాలో హైలెట్ అవుతున్నాయని.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో జరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం లేదని అన్నారు.
ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ, OTT ప్లాట్‌ఫారమ్‌లలోని సెన్సార్ అవ్వని అశ్లీలతపై పూర్తి నిషేధం విధించాలని పిటిషనర్ కోరారు. మొబైల్ ఫోన్లలో సులభంగా పోర్నోగ్రఫి అందుబాటులో ఉండడమూ లైంగిక నేరాల పెరుగుదలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉందని పేర్కొంది.
వీటితో పాటు మహిళలు, బాలికల రక్షణకు అనేక విషయాల్ని అమలు చేసేలా ప్రభుత్వాలకు సూచించాలంటూ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. వాటిలో.. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నిరోధించేందుకు తప్పనిసరిగా సీసీ టీవీలను అమర్చాలని కోరారు. మహిళలపై అత్యాచారం,లైంగిక వేధింపులకు సంబంధించిన అన్ని కేసులను త్వరితగతిన విచారించాలని. వేగంగా శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : శివసేన మంత్రిపదవులు 5 సంవత్సరాలు కాదు.. కాంట్రాక్ట్ సైన్ చేయాలి?!
ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల్లో ఎవరైనా మహిళలపై నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఉంటే.. ఎంపీ, ఎమ్మెల్యేలను పోటీని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. వారు నిర్దోషులుగా విడుదల చేసే వరకు నిషేధం అమలు కావాలని అభ్యర్థించారు.