PM Modi Bastar Visit: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నక్సల్స్ తో పోరాడి ఆ ప్రాంతంతో పాటు యావత్ దేశానికే మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించిన భద్రతా బలగాలను ఈ సందర్భంగా ఆయన సత్కరించారు. దేశంలో దశాబ్దాల పాటు భయాందోళనలు సృష్టించిన మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోయిందని, తర్వాత వచ్చిన తొలి దీపావళి ఇదేనంటూ మోదీ వ్యాఖ్యానించారు. దశాబ్దాల పోరాటం తర్వాత దేశంలోని ప్రతీ జిల్లా నక్సలిజం కోరల నుంచి విముక్తి పొందిందని.. ఈ విజయం దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.
భద్రతా బలగాలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ… ‘2026 నాటి ఈ దీపావళి ఎంతో ప్రత్యేకమైనది. దశాబ్దాలుగా మనల్ని వేధించిన నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదంపై విజయం తర్వాత జరుపుకుంటున్న మొదటి పండుగ ఇది. దేశంలోని ప్రతీ ఒక్క జిల్లా మావోయిజం నుంచి విముక్తి పొందడం సంతోషకరం. కోట్ల మంది ప్రజలు భయం నీడ నుంచి బయటకు రావడం మనందరికీ గర్వకారణం’ అని మోదీ వ్యాఖ్యానించారు.
అయితే అడవుల్లో నక్సలైట్లు తుడిచిపెట్టుకుపోయినా.. సమాజంలో కొత్త తరహా ముప్పు దాగి ఉందంటూ ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అంతమొందినా… దిమాగీ నక్సల్స్ ప్రమాదం ఇంకా పొంచే ఉంది. వీరు వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల్లోకి చొరబడ్డారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి ఓడించడం ద్వారానే దేశ భద్రతను పూర్తిగా కాపాడుకోగలం’ అని హెచ్చరించారు.
గత ఏడాది కాలంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన ఒక్క సైనికుడు కూడా వీరమరణం పొందలేదని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. 47 సంవత్సరాల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఈ విజయం భద్రతా దళాల నిరంతర శ్రమ, త్యాగాల వల్లే సాధ్యమైందని కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున సైనికులకు కృతజ్ఞతలు తెలిపేందుకే తాను బస్తర్ వచ్చినట్లు స్పష్టం చేశారు.
Also Read: ఎయిర్‌టెల్ బంపరాఫర్.. ఒక రీఛార్జ్ చేస్తే మరొకటి ఉచితం.. 56 రోజులు తగ్గేదేలే!
ఒకప్పుడు మావోయిజానికి కేంద్ర బిందువుగా ఉన్న బస్తర్ ప్రాంతం.. భద్రతా దళాల చొరవ, మావోయిస్టుల లొంగుబాట్లు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల పూర్తిగా మారిపోయిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ విజయాలు ఇక్కడితో ఆగిపోవని.. దేశ ప్రజల శతాబ్దాల కలలను నెరవేర్చే దిశగా సాగే కొత్త ప్రయాణానికి ఇదొక ప్రారంభ వేదికని నొక్కి చెప్పారు.
Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే డేంజర్!