PM Modi Speech: దేశ గౌరవం దెబ్బతింటే, భారత సైన్యం ఎలా స్పందిస్తుందో మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసింది మన దేశం. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణ దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” పై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ గర్వం, ఆవేశం కలగలిసిన మాటలతో స్పందించారు.
ప్రధాని మాట్లాడుతూ.. పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల ఎదుటే హత్య చేశారు. ఇది నన్ను వ్యక్తిగతంగా ఎంతో బాధించింది. ఈ దారుణాన్ని దేశం మొత్తం ఖండించిందని మోదీ ఉద్ఘాటించారు. మహిళల భద్రతకు సంబంధించి, దేశ మహిళల సింధూరాన్ని చెరిపేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం ఇప్పుడు తెలుసుకుంది. ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదు, అది ప్రతి భారత తల్లికి, భార్యకి, చెల్లెమ్మకి న్యాయం చేసే ప్రతిజ్ఞ అని చెప్పారు.
మట్టుబెట్టాం..
భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు, మన బలగాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి, కలలో కూడా ఊహించని విధంగా శత్రువులను మట్టుబెట్టాయన్నారు. ఆపరేషన్ సింధూర్ వల్ల భారత్ తీసుకున్న స్థానం గురించి చెబుతూ, ఇది కేవలం ఓ ప్రత్యుత్తరం కాదు. ఇది దేశ భద్రతను కాపాడే భారత సైనికుని పరాక్రమానికి అద్దం. ఇది దేశం గర్వించే ఘట్టమని మోడీ అన్నారు. ఇకపై ఉగ్రదాడులు జరగకుండా, వాటికి కఠినమైన గుణపాఠం చెప్పే దిశగా భారత్ ముందుకు వెళ్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
Also Read: Nagababu – Pawan Kalyan: పవన్ ఫోటోను షేర్ చేస్తూ.. నాగబాబు సంచలన ట్వీట్..
ఉగ్ర మూకల ఖతం
పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల అడ్డాలపై భారత్ మిస్సైల్స్, డ్రోన్స్ దాడి చేశాయని పీఎం అన్నారు. ప్రపంచ ఉగ్రవాదానికి బహవల్‌పూర్, మురీద్ ప్రాంతాలు యూనివర్సిటీలుగా ఉన్నాయని, అన్ని ఉగ్రవాద సంస్థలకు ఇవే మూలాలు అన్నారు. అందుకే భారత్ ఈ ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్‌ను కూల్చివేసిందన్నారు.
చర్చలంటే ఇకపై పీవోకే మీదే అంటూ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు యుద్ధరంగంలో పాకిస్తాన్‌ను ఎన్నోసార్లు వెనక్కి తోసామని, ఇప్పుడు న్యూ ఏజ్ వార్‌ఫేర్ లోనూ భారత్ సత్తా చాటిందన్నారు. ఇది కేవలం బాంబులు, బులెట్లు వర్షించే యుగం కాదు. ఇది సాంకేతికత ఆధారిత యుద్ధాల యుగం. భారత తయారీ ఆయుధాలతో మన బలగాలు చేసిన ధైర్య సాహసాలు ప్రపంచం చూసిందని మోదీ పేర్కొన్నారు.
అణుబాంబులకు బెదిరేది లేదు
ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించదు. ఇకపై ఎలాంటి దాడికైనా ఇండియా నుండి ముఖం పగలే సమాధానం అందుతుందన్నారు. భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, మన మీద మళ్లీ దాడి చేస్తే దెబ్బకు నిలబడలేరని ప్రధాని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
భారత తయారీ క్షిపణులు, డ్రోన్‌లు వినియోగించి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించారు. పాకిస్తాన్ అణుబాంబుల పేరిట బెదిరించినా భారత్ తలవంచే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే ఒకే అంశంపైనే జరుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. చర్చలు ఉంటే, ఉగ్రవాదం, పీవోకేపై మాత్రమే.. పీవోకేను వదలడం పాకిస్తాన్‌కు ఇక తప్పదని ఘాటుగా చెప్పారు.
ఈ రోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ మాట్లాడుతూ, బుద్ధుడు శాంతి మార్గాన్ని చూపించాడు. అదే మార్గం మనకు స్ఫూర్తి. కానీ దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు న్యాయం కోసం పోరాడటమే ధర్మమన్నారు. త్రివిధ దళాలకు తల వంచి నమస్కరిస్తున్నాను. వారు దేశాన్ని కాపాడటంలో చూపిన ధైర్యం, ప్రతిఘటనకు నేను గర్వపడుతున్నాను, భారత్ మాతాకీ జై అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.