PM Modi Amrit Bharat| భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ రాష్ట్రంలో గురువారం ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. “ముందు పాకిస్తాన్ ఇంట్లో దూరి దాడి చేశాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ గుండెలపై నేరుగా దాడి చేశాం. ఉగ్రవాద దాడులకు పాల్పడితే గట్టి సమాధానం ఇస్తాం. ఉగ్రవాదులను, ఉగ్రవాదులను ప్రోత్సహించే వారికి ఒక్కతాటిపై లెక్కిస్తాం.. ఇక పాకిస్తాన్ వేరు ఉగ్రవాదులు వేరు అనే నాటకాలు చెల్లవు. పహల్గాంలో అమాయకులను చంపిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యావత్ భారత దేశం ఒక్కటైంది. అన్యాయంగా మా సోదరిమణుల సిందూరాన్ని (నుదుట కుంకుమను) తుడిచిపెట్టారు. అందుకే భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో సిందూరమే అగ్రికీలాలుగా మారింది. భారత్ తో నేరుగా పోరాడలేకే పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదుల చేత దాడులు చేయిస్తోంది. ఇది ఇంతకాలం చెల్లుబాటు అయింది. కానీ ఇప్పుడు చెల్లదు.
ఇక్కడ మోడీ నిలబడి ఉన్నాడు. మోడీ చాలా కూల్ గా ఉంటాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మోడీ రక్తం వేడెక్కిపోతుంది. ఇక మీదట ఒక్క ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సైనిక చర్యలే కాదు.. ఆర్థికంగానూ పాకిస్తాన్ ను దెబ్బకొడతాం.ఇక మాట్లాడితే పాకి్ ఆక్రమిత కశ్మీర్ పైనా చర్చలు ఉంటాయి. భారతీయుల రక్తం పారిస్తే వినాశనం చూడాల్సి వస్తుంది. ఇక వారికి నీరు అందకుండా చేస్తాం.పాకిస్తాన్ అభివృద్ధి సాధించాలంటే భారత్ తో స్నేహంగా ఉండాలి. భారత దేశం సురక్షితంగా ఉండాలి. పాకిస్తాన్ పై ఎప్పుడు దాడి చేయాలో? ఎక్కడ దాడి చేయాలో? భారత సైన్యమే నేరుగా నిర్ణయాలు తీసుకుంటుంది.” అని ప్రధాని పాకిస్తాన్ పై నిప్పుడు చెరిగారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 22, 2025న రాజస్థాన్ రాష్ట్రంలోని బికానేర్ జిల్లాలోని దేశ్నోక్ పట్టణాన్ని సందర్శించారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై మే 7న భారత సైన్యం చేసిన దాడుల తర్వాత ఆయనకు ఇది రాజస్థాన్‌లో తొలి పర్యటన కావడం విశేషం.
కర్ణి మాత ఆలయంలో ప్రార్థనలు
ప్రధాని మోడీ ముందుగా బికానేర్‌లోని ప్రసిద్ధ కర్ణి మాత ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం చొక్కీ ముషికాల ఆలయం అనే పేరుతో కూడా ప్రసిద్ధి పొందింది. వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
దేశ్నోక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, ప్రారంభం
ఆయన పూజల అనంతరం, పునర్నిర్మిత దేశ్నోక్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. ఈ స్టేషన్‌ను ఆలయ శైలిలో నిర్మించారు. ఇది భక్తుల సౌకర్యం కోసం నూతన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ప్రధాని మోడీ బికానేర్-ముంబయి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
₹26,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన
మోడీ ఈ సందర్భంగా రూ.26,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మరియు కొన్ని ప్రాజెక్టులను దేశానికి అంకితమిచ్చారు. ఇవన్నీ రాజస్థాన్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అన్నారు.
పాలానా లో ప్రజాసభ
ఆయన తర్వాత పాలానా అనే గ్రామంలో జరిగిన ఒక పెద్ద ప్రజాసభలో పాల్గొన్నారు. ఈ సభకు ఒక లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఉద్వేగభరితైన మోడీ ప్రసంగం ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించింది.
Also Read: పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్న 7 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు.. ఇక వీరికి మూడినట్లే..
రైల్వే అభివృద్ధి – దేశవ్యాప్తంగా ‘అమృత్ స్టేషన్లు’
ఇకపోతే, ప్రధాని మోడీ వీడియో ద్వారా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో ఉన్న 103 పునరుద్ధరించిన ‘అమృత్ స్టేషన్లను’ ప్రారంభించారు. వీటిని రూ.1,100 కోట్ల ఖర్చుతో నిర్మించారు.
మోడీ బికానేర్ పర్యటన మొత్తం 3 గంటలు 25 నిమిషాలు పాటు సాగింది. చివరిగా, ఆయన మధ్యాహ్నం 12:30కి హెలికాప్టర్ ద్వారా నాల్ ఎయిర్‌పోర్ట్ చేరుకుని, అక్కడి నుండి 1:15 గంటలకు ఢిల్లీకి బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ.. ఇతర ప్రముఖులు కూడా తోడుగా ఉన్నారు.