Most Wanted Terrorists In Pakistan| ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మొదలైనట్లుగా అనిపిస్తోంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చాలా కచ్చతత్వంతో దాడి చేసింది. ఈ భారీ దాడిలో ఇప్పటివరకు 70 మంది ఉగ్రవాదులు చనిపోగా.. 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అయితే మరోవైపు పాకిస్తాన్ సైన్యం దీనికి సమాధానంగా భారత సైన్యంపై ఎదురుదాడి చేయలేక సామాన్యులు నివసించే బార్డర్ గ్రామాలపై కాల్పులు జరిపింది. ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం చేసిన దాడిలో 15 మంది అమాయక పౌరులు చనిపోయినట్లు సమాచారం. ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే సామాన్యులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు. అయితే ఈ సమస్యకు అంతా కారణం ఉగ్రవాదులు. అమాయకులను చంపే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం శరణు ఇవ్వడమే ఈ దాడులు, యుద్ధ వాతావరణానికి కారణం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాన్నీ గళం విప్పుతున్నా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆ కరుడుగట్టిన క్రిమినల్స్ కు అన్ని రకాల సౌకర్యాలతో తమ దేశంలో ఉండడానికి అనుమతి ఇస్తోంది. వీరి కారణంగా పాకిస్తాన్ పై దౌత్యపరంగా చాలా దేశాలు ఆంక్షలు విధించినా పాకిస్తాన్ మాత్రం బెదరడం లేదు. దీనికి ప్రధాన కారణం.. వీరికి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐ అండదండలు కూడా ఉన్నాయి.
పాకిస్తాన్ దేశంలో నివసించే 7 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వీరే..
1. హఫీజ్ ముహమ్మద్ సయీద్: ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన భారీ ఉగ్రవాద దాడికి ఇతనే మాస్టర్ మైండ్. దీంతో పాటు ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరె తయిబా వ్యవస్థాపకుడు కూడా. ఇతను పాకిస్తాన్ బహిరంగంగా లాహోర్ నగరంలో జీవిస్తున్నాడు. కొన్ని సార్లు వివాదాస్పద ప్రసంగాలు చేసినందుకు పాక్ ప్రభుత్వం ఇతడని హౌస్ అరెస్ట్ చేసింది. కానీ అదంతా తాత్కాలికమే ఇతను పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయగల సమర్థుడు. పాక్ మిలిటరీ అండదండలు ఇతనికి ఉన్నాయి.
2. మసూద్ అజ్హర్: జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఇతనే. పాకిస్తాన్ లోని బహవాల్ పూర్ లో మసూజ్ అజ్హర్ నివసిస్తున్నాడని సమాచారం. భారతదేశం భూభాగం పలు ఉగ్రవాద దాడులకు ఇతను కీలక పాత్ర పోషించాడు. 2001 సంవత్సరంలో పార్లమెంటు దాడి, 40 సిఆర్‌పిఎఫ్ జవాన్లు చనిపోయిన 2019 పుల్వామా ఆత్మహుతి దాడికి ఇతనే సూత్రధారి. ఐక్యరాజ్య సమితి ఇతడిని ఉగ్రవాది అని ప్రకటించినా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అతడికి రక్షణ కల్పిస్తూనే ఉంది.
3. సయ్యద్ సలాహుద్దీన్: యునైటెడ్ జిహాద్ కౌన్సిల్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలకు చీఫ్ ఇతనే. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నివసిస్తూ.. అక్కడి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు ప్లాన్ చేస్తుంటాడు. భారత భూభాగంలోని జమ్మూ కశ్మీర్ లో జరిగే ఎక్కువ శాతం ఉగ్రవాద దాడులకు ఇతనే చివరి ప్లాన్ అందిస్తాడు. దీంతోపాటు పాకిస్తాన్ టీవీ చానెళ్ల ద్వారా తానే ఈ దాడులు చేయించానని ప్రకటనలు కూడా ఇచ్చాడు.
4. జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వి: లష్కరె తయిబా సీనియర్ కమాండర్ ఇతను. 2008 ముంబై ఉగ్రవాద దాడులను ప్లాన్ చేయడంలో జకీ ఉర్ రెహ్మాన్ కీలక పాత్ర పోషించాడు. ఐక్యరాజ్య సమితి ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించి.. ఇతడు నేరాలు చేసిన దేశాలకు అప్పగించాలని చెప్పినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం ఇతడికి అండగా నిలబడింది. అంతేకాదు పాకిస్తాన్ నుంచి అఫ్ఘనిస్తాన్, ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉగ్రవాద చర్యలకు ఇతను నిధులు సేకరిస్తుంటాడు.
5. సాజిద్ మిర్: లష్కరె తయిబా టాప్ నాయకుల్లో సాజిద్ మిర్ ఒకడు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఇతన కూడా కలిసే కుట్ర పన్నాడు. ఇతడిని ఉగ్రవాదిగా చాలా దేశాలు ప్రకటించిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం సాజిద్ మీర్ అసలు పాకిస్తాన్ లో లేడు అని ప్రకటించింది. ఆ తరువాత ఇతడిని జైల్లో ఖైదు చేశామని చెప్పింది. కానీ ఇంతవరకు ఇతడు చేసిన ఉగ్రవాద దాడుల కోసం బాధ్యుడిగా భారతదేశానికి అప్పగించలేదు.
Also Read: భారత్ ప్రతీకారం.. కన్నీరు పెట్టుకున్న పాక్ టీవి యాంకర్
6. దావూడ్ ఇబ్రహీం కాస్కర్: ఇండియాలో ది మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం. 1993 ముంబై పేలుళ్లు ఇతనే చేయించాడు. అంతే కాకుండా డి కంపెనీ పేరుతో పెద్ద స్మగ్లింగ్, మాఫియా, కాంట్రాక్ట్ కిల్లింగ్ గ్యాంగ్లు నిర్విహిస్తున్నాడు. ఇతడికి పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ రక్షణ కల్పిస్తోంది. ఇతను డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ కూడా. ఉగ్రవాదులకు నిధులందిస్తున్నాడు.
7. రియాజ్ భట్కల్: ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ నెలకొల్పింది రియాజ్ భట్కల్. ఢిల్లీ, బెంగళూరు, పుణె నగరాల్లో బాంబు పేలుళ్ల ఘటనలు ఇతనే ప్లానింగ్ చేశాడు. ప్రస్తుతం ఇతను పాకిస్తాన్ లో ఐఎస్ఐ రక్షణలో నివసిస్తున్నాడు.
భారత ప్రభుత్వం ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలో ఈ ఏడుగురు ప్రస్తుతం భారత్ హిట్ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం.