Maha Kumbh Mela 2025: ప్రధానీ మోదీ నేడు మహా కుంభమేళాకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత గంగాదేవికి ప్రార్ధనలు చేయనున్నారు మోదీ. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రధాని పర్యటనతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మంగళవారం రాత్రి ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నట్లు సమాచారం.
కాగా మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 11 నుంచి 11:30 సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయనాకి వెళ్లి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఇక మోదీ రాకతో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభం అయింది. ఇండియాతో పాటు.. ఇతర దేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 38 కోట్ల మందికి పైగా కుంభమేళాకు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
అనంతమైన ఆధ్యాత్మిక శక్తి.. అంతులేని భక్తి.. అచంచలమైన విశ్వాసం! అంచనాలను మించి వస్తున్న భక్తజనం! మొత్తంగా.. మహా కుంభమేళా ఘడియల్లో.. ప్రయాగ వెలిగిపోతోంది. పుణ్యస్నానాలతో భక్తులు పులకరించిపోతున్నారు. లెక్కకు మించి వచ్చే కోట్లాది మంది భక్త జనానికి యూపీ సర్కార్ ఆహారం, నీరుతో పాటు అవసరమైన వసతులన్నీ ఉచితంగా కల్పిస్తోంది. ఎప్పటికీ మరపురాని ఘట్టంగా మలుస్తోంది. ఈ కొద్దిరోజుల్లోనే మహా కుంభమేళాకు ఏడున్నర కోట్ల మందికి పైగా ప్రయాగకు తరలివచ్చారు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళా.. అద్వితీయంగా కొనసాగుతోంది. ఈ మహోన్నత ఆధ్యాత్మిక మేళా.. ఈ దేశం గుర్తు పెట్టుకోబోయే సరికొత్త చరిత్ర.
కిక్కిరిపోయిన కోట్లాది మంది భక్తజనం, పుణ్య స్నానాల కోలాహలం తప్ప.. పవిత్ర క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మరొకటి కనిపించడం లేదు. అక్కడ కనిపిస్తున్న ఆధ్యాత్మిక మహోత్సవం సందడిని.. ప్రత్యక్షంగా ఆస్వాదిస్తున్నారు భక్తజనం. ఈ భూమికి ఉన్న అన్ని వైపుల నుంచి.. ధనవంతులు, పేదవాళ్లు అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల భక్తులు తరలివస్తున్నారు. హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. మన సంప్రదాయాల్ని ఆచరిస్తున్నారు. ఈ భూమి మీద జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవాన్ని.. మనసారా ఆస్వాదిస్తున్నారు. అత్యంత అరుదుగా వచ్చే ఈ మహా కుంభమేళాలో భాగస్వాములై.. ఆనందిస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమాన పుణ్యస్నానాలతో పులకరిస్తున్నారు.
మహా కుంభమేళాలో దైవనామస్మరణతో ప్రయాగ్‌రాజ్ మార్మోగిపోతోంది. పవిత్ర స్నానం, గంగా హారతి, కల్పవాస్, దైవ పూజలు, దీప దానాలు, పంచక్రోశ్ పరిక్రమ్, సంకీర్తనలు, భజనలు, యోగా, ధ్యానం, అఖాడాల ప్రదర్శనలతో.. ప్రయాగ వెలిగిపోతోంది. ఇప్పటికే.. పుణ్య తిథుల్లో కోట్లాది మంది భక్తజనం అమృత స్నానం ఆచరించారు. ఇంకా లక్షలాదిగా జనం వస్తూనే ఉన్నారు. ప్రయాగ సంగమంలో నదీ స్నానం ఆచరిస్తూనే ఉన్నారు. దైవంతో పాటు పితృదేవతలకు కూడా పూజలు చేస్తున్నారు. అరుదుగా వచ్చే ఈ ఆధ్యాత్మిక వేడుక.. మహోన్నతంగా సాగుతోంది.
మహా కుంభమేళాలో భక్తులు ఆచరించే పుణ్యస్నాలతో పాటు ముఖ్య తిథుల్లో ఆచరించే రాచ స్నానాలకూ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కుంభమేళాలో రాచస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి. ఇప్పటికే.. జనవరి 13న పుష్య పౌర్ణమి, 14న మకర సంక్రాంతి రోజున రెండు రాచ స్నానాలు ముగిశాయి. ఈ రెండు రోజుల్లోనే దాదాపు ఐదున్నర కోట్ల మందికి పైగా.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక.. జనవరి 29న మౌని అమావాస్య రోజున మూడో రాచ స్నానం ఆచరించారు. ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున నాలుగో రాచస్నానం పూర్తయింది. ఈ వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఆరాధించడం, పూజించడం విశేషంగా జరిగింది.
కుంభమేళాలో రాచస్నానం ఆచరిస్తే.. సరస్వతీ దేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఇక ఫిబ్రవరి 12న వచ్చే మాఘ పూర్ణిమన నాడు ఐదో రాచస్నానం చేస్తారు. ఈ మహా కుంభమేళాలో చివరిదైన ఆరో రాచస్నానం.. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజున చేయనున్నారు. పుణ్య తిథుల్లో ఆచరించే రాచస్నానాలకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఆ రోజుల్లో పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే.. సమస్త పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
Also Read: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు.. కీలక స్థానాలు ఇవే..
మహా కుంభమేళాలో పవిత్ర నదీ స్నానాలే కాదు.. సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఆకర్షణగా నిలుస్తున్నాయి. నది ఒడ్డున వివిధ ప్రార్థనలు, భజనలు, ఆచారాలు, భక్తి గీతాల ఆలాపన, అగ్ని వేడుకలు నిర్వహిస్తున్నారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతి నిర్వహిస్తున్నారు. మతపరమైన ఆచారాలతో పాటు, సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా సాంస్కృతిక ప్రదర్శనలన్నీ ఉన్నాయి. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామాగ్రిని విక్రయించే స్టాళ్లను ఏర్పాటు చేశారు.
భక్తి గీతాల శబ్దాలతో, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో.. త్రివేణి సంగమ ఘాట్‌లన్నీ ఉత్సాహభరితంగా కనిపిస్తున్నాయి. మహా కుంభమేళా కేవలం ఓ ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకంగానూ నిలుస్తోంది. 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళా.. అతీంద్రియమైనది. ఎవరి ఊహకు అందనిది. ఎప్పటికీ మరపురానిది. పాత రికార్డుల్ని చెరిపేసి.. ఈ దేశం గుర్తు పెట్టుకోబోయే సరికొత్త చరిత్ర.. ఈ మహోన్నతమైన మహా కుంభమేళా వేడుక.