Delhi: దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్య్ర సాధన లక్ష్యం కోసం జీవితమంతా త్యాగం చేశారని చెప్పుకొచ్చారు.
80వ స్వాతంత్య్రం వేడుకల సందర్భంగా శనివారం ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. ఎర్రకోటపై ఆయన జెండా ఎగురవేయడం ఇది 13వ సారి. ఎర్రకోటపై వందేమాతరం గీతాన్ని ఆలపించిన అనంతరం జాతీయజెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. 2014లో 65 నిమిషాలపాటు మాట్లాడారు. 2022లో 74 నిమిషాలు, 2026లో 76 నిమిషాలపాటు ప్రధాని ప్రసంగం సాగింది. అంటే ఏడాదికి నిమిషం చొప్పున ఆయన తన స్పీచ్‌ను పెంచుకుంటూ పోతున్నారు.
ఎర్రకోటలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం దాదాపు 76 నిమిషాల పాటు సాగింది. సాయుధ నక్సలైట్లు పోయారు, కానీ బుద్ధిహీన నక్సలైట్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. వారు సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి రకరకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు హింస-అరాచకానికి పాల్పడే మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
జెండా ఎగుర వేయడానికి ముందు ప్రధాని మోదీ, రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయు సేన పూలవర్షం కురిపించింది.
మన బ్రాండ్‌లే మన గుర్తింపుగా ఉండాలన్నారు ప్రధాని నరేంద్రమోదీ. దేశం అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదని అందులో ప్రతి పౌరుడు ఉంటారన్నారు. మనం ఫార్చ్యూన్-500 గురించి ఎంతగానో వింటున్నామని, రాబోయే దశాబ్దంలో ఫార్చ్యూన్-500 కంపెనీల్లో 50 మన దేశానికి చెందినవి ఎందుకు ఉండకూడదని చెప్పుకొచ్చారు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని కోరుతున్నట్లు వివరించారు. మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవం కోసం జరిగే పోరాటంలో మీరు పాలు పంచుకోవడం అవసరమన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
మా దిశానిర్దేశం జరిగిందని, దానిని సాధించాలన్నారు. అలా చేయడానికి మన పని సంస్కృతి, ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. గడిచిన ఐదు నుంచి ఏడు దశాబ్దాలుగా పూర్తి కాని పనిని, రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని గట్టిగా విశ్వసిస్తున్నామని అన్నారు. మనం స్వయం సమృద్ధి సాధించాలని, ప్రపంచం ఎన్నో విషయాలను చౌకగా, వేగంగా అందిస్తుందన్నారు. అది మన సామర్థ్యాలను పెంపొందించవని, మనం కూడా మన సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. భారత్ ఇకపై చిన్న కలలతో ముందుకు వెళ్లలేదన్నారు.
ALSO READ: సావర్కర్ వివాదంలో ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కేసు క్లోజ్.. రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్!
ఆలోచనా పరిధి విస్తృతం చేసుకునేందుకు ఉన్నత లక్ష్యాలు అవసరమన్నారు. దేశం అభివృద్ధి చెందిన దేశంగా అడుగులు వేసినప్పుడు ప్రపంచం మన వైపు చూసి తీరుతుందన్నారు. ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంపై సంతోషం వ్యక్తంచేసిన ప్రధాని, ఈ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.