Pregnant Teenager Bury Alive| 15 ఏళ్ల అమ్మాయిని ముగ్గరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమె ఈ విషయం బయటికి చెప్పకుండా భయపెట్టారు. కానీ కొన్ని నెలల తరువాత ఆమె గర్భవతి అని తెలియగానే మోసపూరితంగా ఆమెను ఒక నిర్మానుష ప్రాంతానికి రప్పించి అక్కడి సజీవంగా పాతిపెట్టాలని ప్రయత్నించారు. ఈ దారుణ ఘటన ఒడిశాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా బనశ్చర గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు.. భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్ వారిద్దరి మిత్రుడు తులు.. ఈ ముగ్గురు కలిసి ఒక 15 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేశారు.
అయితే కొన్ని రోజుల క్రితం ఆమె అయిదు నెలల గర్భవతి అని తెలిసినప్పుడు.. ఆమెను డబ్బులు ఇస్తామని.. ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయిస్తామని చెప్పి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక ఆ బాలిక ఒక షాకింగ్ దృశ్యం చూసింది. అక్కడ ఒక పెద్ద గుంత తవ్వి ఉంది.
ఆ బాలికను ఆ ఇద్దరు సోదరులు వెంటనే గర్బస్రావం చేయించుకోవాలని, డబ్బులు ఇచ్చేది లేదని బెదిరించారు. ఆ మాటలు విన్న ఆ బాలిక వారి నుంచి చాకచక్యంగా తప్పించుకొని పారిపోయింది. తన తండ్రి వద్దకు చేరుకొని జరిగిన దంతా వివరించింది. దీంతో ఆ బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కుజంగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలిని జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మూడో నిందితుడు తులు పరారీలో ఉండగా.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
ఈ వారంలో జగత్‌సింగ్‌పూర్‌లో ఇది రెండో లైంగిక దాడి ఘటన. మంగళవారం, మరో బాలిక ఒక బర్త్ డే పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ బాలిక రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆదివారం, మల్కంగిరి జిల్లాలో మరో ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఒక బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆమె తప్పించుకున్నా, ఇంటికి వెళ్తుండగా ఒక ట్రక్ డ్రైవర్ ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు.
గత నెలలో ఒడిశాలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. జూన్‌లో 10 రోజుల వ్యవధిలో ఐదు అత్యాచార, సామూహిక అత్యాచార కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ నెలలో బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఒక టీచర్ తనను లైంగిక వేధించాడని ఒక 20 ఏళ్ల విద్యార్థిని ఫిర్యాదు చేసింది.
Also Read: ఏఐపై విజయం సాధించిన మానవుడు.. కోడింగ్ పోటీల్లో కృత్రిమ మేధస్సుని ఎలా ఓడించాడంటే
కానీ ఆమె ఫిర్యాదును అధికారులు, పోలీసులు తిరస్కరించగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం, పూరీలోని నీమపాడ బ్లాక్‌లో 15 ఏళ్ల బాలికను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా, ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.
ఈ కేసులతో ఒడిశాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.