Youtuber Pak Spy| పహల్గాంలో ఏప్రిల్ లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత విచారణ ఏజెన్సీలు ఉగ్రవాదలు కోసం, వారికి సాయం చేస్తున్న వారి కోసం గాలిస్తున్నారు. గత కొంతకాలంగా పాకిస్తాన్‌కు అనుకూలంగా యూట్యూబ్ కంటెంట్ చేస్తున్న వారిపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే జ్యోతి మల్హోత్ర సహా పలువురు పాకిస్తాన్ అనుకూల యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎన్ఐఏ సంస్థ అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా పంజాబ్ పోలీసులు బుధవారం రూప్‌నగర్ జిల్లాలోని మహ్లాన్ గ్రామానికి చెందిన యూట్యూబర్ జాస్బీర్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.
జాస్బీర్ సింగ్ నడిపే “జాన్ మహల్” అనే యూట్యూబ్ ఛానెల్‌కు 11 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పాకిస్తాన్ గూఢచర్య నెట్‌వర్క్ సభ్యులతో తరుచూ చర్చలు నడిపాడనే ఆరోపణలతో అతడిని మొహాలీలోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (ఎస్‌ఎస్‌ఓసీ) అదుపులోకి తీసుకుంది.
జాస్బీర్ సింగ్ ఇటీవల అరెస్టయిన రెండవ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. ఇంతకు ముందు హర్యాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయింది. ఆమెతో కూడా జాస్బీర్‌కు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. పంజాబ్ పోలీసుల ప్రకారం.. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ షకీర్ (జట్ రంధావా అనే మారుపేరు)తో జాస్బీర్ సింగ్ సన్నిహితంగా ఉన్నాడు. ఇతను పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) కోసం పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
అతను పాకిస్తాన్ జాతీయ దినోత్సవానికి ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఎహ్సాన్-ఉర్-రహీమ్ (డానిష్ అని కూడా పిలుస్తారు) ఆహ్వానంతో హాజరయ్యాడు. ఈ డానిష్ పాకిస్తాన్ హైకమిషన్‌లో మాజీ అధికారి.. గూఢచర్యం ఆరోపణలతో భారత్ నుండి బహిష్కరించబడ్డాడు. జాస్బీర్ అక్కడ పాకిస్తాన్ సైన్యాధికారులు, వ్లాగర్లతో సంభాషించాడు. అతను 2020, 2021, 2024 సంవత్సరాల్లో మూడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లాడు.
అతని ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరిశీలనలో పాకిస్తాన్‌కు చెందిన అనేక కాంటాక్ట్ నంబర్లు కనుగొనబడ్డాయి. ఇవి ఇప్పుడు విచారణలో ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టయిన తర్వాత, జాస్బీర్ ఐఎస్‌ఐతో సంబంధాలున్న వ్యక్తులతో తన సంభాషణల ఆధారాలను తొలగించే ప్రయత్నం చేశాడు.
Also Read: యూట్యూబ్‌లో బెగ్గింగ్.. ఆన్‌లైన్‌లో కొత్త మార్గంలో డబ్బు సంపాదిస్తున్న యాచకులు
పంజాబ్ పోలీసులు ఈ గూఢచర్య-టెర్రర్ నెట్‌వర్క్‌ను పూర్తిగా బయటపెట్టడానికి.. ఇందులో పాల్గొన్న అన్ని వ్యక్తులను గుర్తించడానికి పనిచేస్తున్నారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఒక ఎక్స్ పోస్ట్‌లో.. “జాస్బీర్ సింగ్, ‘జాన్ మహల్’ యూట్యూబ్ ఛానెల్ నడిపే వ్యక్తి, టెర్రర్ మద్దతు గల గూఢచర్య నెట్‌వర్క్‌లో భాగమైన షకీర్ (జట్ రంధావా)తో సంబంధం కలిగి ఉన్నాడు. అతను జ్యోతి మల్హోత్రా, ఎహ్సాన్-ఉర్-రహీమ్ (డానిష్)తో కూడా సన్నిహితంగా ఉన్నాడు,” అని తెలిపారు.
ఇప్పటివరకు, పంజాబ్ పోలీసులు పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో ఏడుగురిని అరెస్ట్ చేశారు. అమృత్ సర్‌లోని అజ్నాలా నుండి ఫలక్‌షేర్ మసీహ్, సురాజ్ మసీహ్‌లను, మలేర్‌కోట్లాకు చెందిన 31 ఏళ్ల మహిళ గుజాలా, యమీన్ మొహమ్మద్‌లను గత నెలలో అరెస్ట్ చేశారు. గురుదాస్‌పూర్ నుండి సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్‌లను సైనిక సమాచారం ఐఎస్‌ఐతో పంచుకున్నందుకు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.