Rahul Gandhi Joe Biden| మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మతి మరుపు లక్షణాలతో పోలుస్తూ భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎద్దేవా చేశారు. అయితే రాహుల్ గాంధీ బైడెన్ అనారోగ్యం పట్ల అపహాస్యం చేశారని.. ఆయన వ్యాఖ్యలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం నవంబర్ 29, 2024న తెలిపింది.
కేంద్ర ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం రాత్రి మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జైస్వాల్ మాట్లాడుతూ.. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ జ్ఞాపకశక్తి గురించి రాహుల్ గాంధీ హేళన చేస్తూ వ్యాఖ్యానించారు. ఇది చాలా దురదృష్టకరం. అయితే భారత ప్రభత్వానికి రాహుల్ వ్యాఖ్యలతో ఏం సంబంధం లేదు.
Also Read: అమ్మాయి అని చెప్పి హిజ్రాతో వివాహం చేశారు.. పోలీస్ స్టేషన్ చేరిన వరుడు
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు ఈ వ్యాఖ్యలు చేసే ముందు భారత్, అమెరికా మధ్య ఉన్న స్నేహ సంబంధాల గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. అమెరికా, ఇండియా.. ఈ రెండు దేశాలు చాలా సంవత్సరాలుగా చాలా రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయి. ఇరు దేశాలు ఒకరిపట్ల మరొకరు గౌరవం కలిగి ఉన్నాయి. అందుకే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరం. బాధాకరం. ఆయన చేసిన వ్యాఖ్యలతో భారత ప్రభుత్వం విభేదిస్తోంది.” అని ఆయన అన్నారు.
జో బైడెన్, ప్రధాని మోడీ గురించి రాహుల్ ఏమన్నారు?
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తరపున నవంబర్ 16, 2024న రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మతిమరుపు తో బాధపడుతున్నట్లు తనకు అనిపిస్తోందని అన్నారు.
“నా సోదరి (ప్రియాంక గాంధీ) నాతో ఒక విషయం చెప్పింది. ఆమె ఇటీవల ప్రధాని మోడీ ప్రసంగాలను విన్నదంట. ఆ ప్రసంగంలో మేము ఏం మాట్లాడుతామో అదే విషయాలను ప్రధాని మోడీ తిరిగి అదే విషయాలు ప్రజలకు చెబుతన్నారంట. ఆయనకు మతిమరుపు ఉందేమో మరి, నాకు తెలీదు. అమెరికా మాజీ అధ్యక్షుడికి (జో బైడెన్) కూడా ఇలాగే మతిమరుపు ఉంది. ఆయన ప్రసంగం మధ్యలో మరిచిపోతూ ఉంటే ఎవరైనా వెనుక నుంచి గుర్తు చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆయన వద్దకు వస్తే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినట్లు ఆయన (బైడెన్) పొరపాటు పడ్డారు. అచ్చం అలాగే మన ప్రధాన మంత్రి కూడా తన జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు.” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
రాహుల్ గాంధీ జో బైడెన్ అనారోగ్యంపై హేళనగా వ్యాఖ్యలు చేశారని.. అందుకోసం ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జాతీయ వైద్యలు సంఘం (నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ భారత్) డిమాండ్ చేసింది. ఈ మేరకు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ భారత్ అధ్యక్షుడు సిబి త్రిపాఠి సోనియా గాంధీకి ఒక లేఖ కూడా రాశారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి విచక్షణా రహిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన లేఖలో పేర్కొన్నారు.