Rahul Gandhi Banking Crisis| ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరువల్లే బ్యాంకింగ్ రంగం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. క్రోనిజం, నిధుల దుర్వినియోగం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక దుర్వినియోగం వల్ల సంక్షోభం పరిస్థితులు ఉన్నాయన్నారు. దీంతో ఒత్తిడి, కఠినమైన పని పరిస్థితులను జూనియర్ ఉద్యోగులు భరించాల్సి వస్తోందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
“ బీజేపీ ప్రభుత్వం తన బిలియనీర్ స్నేహితుల కోసం రూ. 16 లక్షల కోట్లను మాఫీ చేసింది. ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం దేశవ్యాప్తంగా వేలాది మంది నిజాయితీపరులైన వృత్తి నిపుణులను ప్రభావితం చేస్తుంది.” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. నిర్వహణ లోపాల వల్ల వీరంతా నష్టపోయారని చెప్పారు. కాంగ్రెస్ ఇలాంటి శ్రామిక శక్తుల నిపుణుల కోసం పోరాడుతుందన్నారు. పనిలో వేధింపులు, దోపిడీని అంతం చేస్తామని చెప్పారు. ‘‘మీరు ఇలాంటి అన్యాయాన్ని ఎదుర్కొన్న వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే https://rahulgandhi.in/awaazbharatki కి మీ ఆవేదనను నాతో పంచుకోండి’’ అని రాహుల్ గాంధీ పోస్టు చేశారు.
ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై
ఐసీఐసీఐ బ్యాంక్ అన్యాయంగా తమను తొలగించిందని ఆరోపిస్తున్న ఉద్యోగులు బృందం శుక్రవారం రాహుల్ గాంధీని కలిసింది. 782 మంది ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఉద్యోగుల తరుపున ఒక ప్రతినిధి బృందం పార్లమెంట్‌లో తనతో సమావేశమైందని రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘వీరి కథలు ఆందోళనకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. కార్యాలయంలో వేధింపులు, బలవంతంపు బదిలీలు, ఎన్‌పీఏ ఉల్లంఘించిన వారికి అనైతిక రుణాలను బహిర్గతం చేసినందుకు ప్రతీకారం, దురుద్దేశంతో తొలగింపులు, విషాదకరమైన సందర్భాల్లో ఇది ఆత్మహత్యకు దారి తీసింది’’ అని అన్నారు.
Also Read: కస్టమర్ల వద్ద సర్వీస్ ఛార్జీలు వసూలు చేసే రెస్టారంట్లపై చర్యలు
ఆఫ్‌షోర్ మైనింగ్‌తో తీర ప్రాంత వాసులకు తీవ్ర నష్టం
ఆఫ్‌షోర్ మైనింగ్ టెండర్ల (Offshore Mining Tenders) విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi)కి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం (Union Government) ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లేఖ ద్వారా తెలియజేశారు. కేరళ (Kerala), అండమాన్ & నికోబార్ (Andaman And Nicobar), గుజరాత్ (Gujarath) తీర ప్రాంతాలలో ఆఫ్‌షోర్ మైనింగ్ టెండర్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల వస్తున్న వ్యతిరేకతను చూపుతూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు.
దీని ద్వారా తీర ప్రాంతాలలో ఆఫ్‌షోర్ మైనింగ్ కు అనుమతించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయకుండా ఆఫ్ షోర్ మైనింగ్ కు టెండర్లు వేసిన తీరుపై తీర ప్రాంత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని తెలియజేశారు. అలాగే లక్షలాది మంది మత్స్యకారులు తమ జీవనోపాధి, జీవన విధానంపై దాని ప్రభావం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అంతేగాక అక్కడి వారితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే, తీర ప్రాంత వర్గాల దీర్ఘకాలిక సామాజిక -ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయకుండానే టెండర్లు జరిగాయని, మీ ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా నిరసనలు వెళ్లువెత్తుతున్నాయని తెలిపారు.
వాస్తవానికి కేరళ విశ్వవిద్యాలయం (Kerala University)లోని ఆక్వాటిక్ బయాలజీ, ఫిషరీష్ (Aquatic Biology Fisharies) విభాగానికి చెందిన బెరైన్ మానిటరింగ్ ల్యాబ్ సర్వే ఈ ఆఫ్ షోర్ మైనింగ్ వల్ల కొల్లాంలో తీవ్ర ప్రభావం చూపుతోందని కనుగొన్నదని, దీని వల్ల కేరళలోని 11 లక్షల మందికి వృత్తి పరంగా, జీవన విధానం పరంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది మత్స్య కారులు జీవనోపాధి కోల్పోతారని.. తీర ప్రాంతాల్లో నివసించే వారి జీవితాలు నాశనమవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే ఆఫ్‌షోర్ మైనింగ్ బ్లాక్‌ల కోసం జారీ చేసిన టెండర్లను రద్దు చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు తీర ప్రాంతాల్లో నివసించే వారిని, మత్స్య కారులతో సంప్రదించాలని కోరారు.