Rahul Gandhi Letter: కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, ఎస్‌ఐఆర్ అక్రమాలు, ఈవీఎంల వాడకం, త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. అయితే అందులోని విషయాలని ఓ జాతీయ మీడియా సంస్థ బయటపెట్టింది. ప్రస్తుతం అవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరోవైపు అక్టోబర్ 10న చేపట్టిన నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా సీజేఐకి విడిగా లేఖ రాశారు. ఈ లేఖలను పరిశీలించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.. నిరసనకు సంబంధించిన ప్రధాన కేసులోనే వీటిని అప్లికేషన్లుగా పరిగణించాలని ఆదేశించింది.
రాహుల్ గాంధీ తన లేఖలో కీలక విషయాలను సుప్రీంకోర్టు సీజేఐ వద్ద ప్రస్తావించారు. ముఖ్యంగా 2027 ఆరంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల అంశాన్ని అత్యంత అత్యవసరమైనదిగా పేర్కొన్నారు. పంజాబ్ లో ఈ ఏడాది జూన్ నాటికి 2.14 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య.. ఆగస్టులో ప్రచురించిన ఎన్నికల ముసాయిదా జాబితా నాటికి 1.93 కోట్లకు పడిపోయిందని రాహుల్ ఆరోపించారు. అంటే దాదాపు 20 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫారమ్ 6 వివాదం పరిష్కారం కాకపోతే అర్హులైన అనేకమంది ఓటర్లు తుది జాబితాకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రారంభించడానికి ఈసీఐ తీసుకున్న అధికారిక నిర్ణయాల రికార్డులేవీ అందుబాటులో లేవని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. అసలు అలాంటి ఫైల్ ఉందో లేదో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇచ్చే ఫారమ్ 6లో.. గతంలో ఎస్‌ఐఆర్‌లో దరఖాస్తుదారు లేదా వారి బంధువులు కనిపించారో లేదో తెలపాలనే నిబంధన కొత్త ఓటర్లపై అనవసర భారాన్ని మోపుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 13B ప్రకారం ఓటర్ల జాబితాల సవరణ అధికారం ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్‌ఓ) ఉంటుందని దాన్ని సాంకేతికత నెపంతో తగ్గించలేరని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడమే కాకుండా సామాన్య ఓటరుకు కూడా అలాగే కనిపిస్తేనే వ్యవస్థపై నమ్మకం కుదురుతుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈవీఎంలకు సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, సాంకేతికత, ప్రోటోకాల్‌లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్రంగా సమీక్షించాలని ఆయన కోరారు. అయితే సీఈసీ జ్ఞానేష్ కుమార్ నియామకంపై అప్పట్లో నిరసన తెలిపినప్పటికీ ప్రస్తుతం ఆయన తొలగింపును తాను కోరడం లేదని లేవనెత్తిన తీవ్రమైన ఆరోపణలను చట్టప్రకారం పరిశీలించాలని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నట్లు రాహుల్ స్పష్టం చేశారు.
ఢిల్లీలో శాంతియుతంగా విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ స్వతంత్ర విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ సుప్రీంకోర్టును కోరారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీతో పాటు మరో 10 మంది ప్రతిపక్ష నాయకులు కలసి దాఖలు చేసిన పిటిషన్‌లో కొన్ని సాంకేతిక లోపాలున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గుర్తించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఐడీ కార్డ్ స్పష్టంగా లేకపోవడం సహా మొత్తం 14 లోపాలను రిజిస్ట్రీ వేలెత్తి చూపడంతో ఈ అంశంపై తక్షణ విచారణ వాయిదా పడింది.