
Rajinikanth: మూలాలు మర్చిపోని హీరో రజనీకాంత్. సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ తాను ఎక్కడినుంచి వచ్చానో బాగా గుర్తుంచుకుంటారు. కండెక్టర్‌గా ఉన్నప్పుడు తనను ఎంకరేజ్ చేసిన ఆ బస్ డ్రైవర్‌తో ఇప్పటికీ స్నేహం చేస్తున్నారు. కుటుంబ సమేతంగా అప్పుడప్పుడూ ఆయన ఇంటికి కూడా వెళ్లొస్తుంటారు. తలైవా లేటెస్ట్ మూవీ జైలర్ బ్లాక్ బ్లస్టర్ అయ్యాక.. హిమాలయాల యాత్ర చేపట్టారు. తాజాగా, బెంగళూరు వెళ్లి తాను సినిమాల్లోకి రాకముందు పని చేసిన బస్ డిపోను సందర్శించారు రజనీకాంత్.
బెంగళూరులోని బీఎంటీసీ బస్ డిపోను ఆకస్మికంగా సందర్శించారు. తలైవాను చూసి అక్కడివాళ్లంతా అవాక్కయ్యారు. సూపర్‌స్టార్ వచ్చారని తెలిసి.. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, అభిమానులు డిపోకు వచ్చారు. అక్కడి డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ కార్మికులతో రజనీకాంత్ మాట్లాడారు. కాసేపు సరదాగా గడిపారు. వచ్చిన వారంతా రజనీకాంత్‌తో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఆయన సింప్లిసిటీ చూసి.. రియల్ హీరో అంటూ కొనియాడారు.