
Varalakshmi: సీనియర్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేరళ డ్రగ్స్ కేసులో వరలక్ష్మి మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. అతడి గురించి వివరాలు సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది NIA.
కేరళలోని వియిన్యం సముద్ర తీరంలో ఈనెల 18న భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు, మారణాయుధాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేష్ అనే పేరుతో ఉన్న ఫిషింగ్ బోట్ నుంచి 300 కేజీల హెరాయిన్, ఒక ఏకే 47 రైఫిల్, 17 రౌండ్ల బుల్లెట్లు, ఐదు 9ఎంఎం పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన హెరాయిన్ విలువ రూ.2100 కోట్లు ఉంటుందని అంచనా.
ఈ కేసులో ఆదిలింగంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులపై ఎన్ఐఏ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డ్రగ్స్, ఆయుధాలను ఇరాన్ లేదంటే పాకిస్థాన్ నుంచి శ్రీలంక మీదుగా ఇండియాకు తీసుకొచ్చారని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఆదిలింగం పట్టుబడటంతో.. అతని గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు నటి వరలక్ష్మిని విచారణకు పిలిచింది ఎన్ఐఏ.