Ramesh Bidhuri Priyanka Gandhi CM Atishi| దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీని గద్దె దించాలని భారతీయ జనతా పార్టీ పూర్తి బలం ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో బిజేపీ నాయకులు.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నాయకులపై మాటల దాడులకు చేస్తున్నారు. తాజాగా ఒక బిజేపీ నాయకుడు కాంగ్రెస్, ఆప్ పార్టీల మహిళా నాయకులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. బిజేపీ సీనియర్ నాయకుడు రమేష్ బిధురి ఆదివారం కాంగ్రెస్ మహిళా ఎంపీ ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి మార్లేనా సింగ్‌లను కించపరుస్తూ ఒక సభలో మాట్లాడారు.
ఆదివారం జనవరి 5, 2025న రమేష్ బిధురీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. “బిజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఢిల్లీ రోడ్లు ప్రియాంక గాంధీ బుగ్గల లాగా అందంగా నిర్మిస్తుంది” అని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్, అటు ఆప్ పార్టీల నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ ష్రినేట్ బిజేపీ నాయకుడు రమేష్ బిధురిపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఆతిషికి వ్యతిరేకంగా కాల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న బిజేపీ నాయకుడు రమేష్ బిధురి మహిళా వ్యతిరేకి అని, మహిళలంటే ఆయనకు ఎంత మాత్రం గౌరవం లేదన.. ఇలాంటి అసభ్యకర భాషా ప్రయోగం చేసిన వ్యక్తిని బిజేపీ ఎన్నికల్లో నిలబెడుతోంది. ఇదే బిజేపీ నిజస్వరూపం.” అని చెప్పారు.
Also Read: ప్రతిపక్ష నాయకుడిని పట్టిస్తే రూ.85 లక్షల కానుక.. వెనెజూలాలో పాలిటిక్స్ పీక్స్
రమేష్ బిధురి వ్యాఖ్యలపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఖండించారు. “బిజేపీ నాయకత్వంలో ఢిల్లీ మహిళలు సురక్షితంగా ఎలా ఉండగలరు? ఎన్నికల్లో బిజేపీ అభ్యర్థి అయిన రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలు. అతను ఉపయోగించే భాషను ఒక సారి వినండి. అతను మహిళల పట్ల ఎంత అగౌరవంగా మాట్లాడుతాడో అర్థమవుతుంది. ఇలాంటి నాయకులకు అధికారం దక్కితే ఢిల్లీ మహిళలకు గౌరవం, భద్రత ఉంటుందా?” అని ప్రశ్నిస్తూ.. ఎంపీ సంజయ్ సింగ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా రమేష్ బిధురిని విమర్శించారు. దీంతో ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. “గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో లాలు ప్రసాద్ యాదవ్ కూడా నటి హేమ మాలిని బుగ్గలలాంటి రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఆయన వ్యాఖ్యలన తప్పు పట్టలేదన్నారు. అయితే తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను.” అని చెప్పారు.
అయితే ఆయన అంతటితో ఆగలేదు. వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి మార్లెనా సింగ్ పేరు పై కామెంట్ చేస్తూ… అత్యంత అసభ్యంగా మాట్లాడారు. “ఈ ఆతిషి.. తన తండ్రిని మార్చేసింది. మార్లెనా పేరు నుంచి సింగ్ అనే పేరుని ఇంటి పేరుగా మార్చుకుంది. ఇలా తండ్రినే మార్చేసే వారి చేతుల్లో ఢిల్లీ అధికారం ఉంది.” అని ఎద్దేవా చేశారు.
ఆదివారం రాత్రి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైరయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక రాజకీయ నాయకుడు చేయడం సిగ్గుచేటన్నారు. బిజేపీ ఎన్నికల్లో గెలవడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు.