Rupee Recovery: పడిపోతున్న రూపాయికి ఆర్బీఐ బ్రేకులు వేసింది. డాలర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు గట్టి చర్యలు చేపట్టింది. ఇవాళ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 91 పైసలు పెరిగి.. 95 రూపాయల 80 పైసల స్థాయికి చేరింది. ఒక దశలో 95 రూపాయల 61 పైసల దగ్గర కూడా ట్రేడ్ అయింది. గత ఆరు నెలల్లో రూపాయికి ఇదే అతిపెద్ద పెరుగుదల. అంతకుముందు రూపాయి విలువ 97 రూపాయల స్థాయికి చేరువై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం.డాలర్ బలంగా ఉండటం.. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవడం.. ఇవన్నీ రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యంగా మన దేశం చమురు అవసరాల కోసం భారీగా డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతోంది. రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీలకు అవసరమైన డాలర్లను ప్రత్యేక ఏర్పాటుతో అందించనుంది. దీంతో ఈ కంపెనీలు మార్కెట్లో నేరుగా డాలర్లు కొనాల్సిన అవసరం తగ్గుతుంది. ఫలితంగా మార్కెట్లో డాలర్లకు ఒక్కసారిగా పెరిగే డిమాండ్‌ను నియంత్రించవచ్చు.
Also read: తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!
మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పడిపోతుందని అంచనా వేస్తూ చేసే కొన్ని లావాదేవీలపైనా ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. కొన్ని డెరివేటివ్ లావాదేవీలకు 20 శాతం నగదు రిజర్వ్ తప్పనిసరి చేసింది. రద్దు చేసిన కొన్ని కరెన్సీ కాంట్రాక్టులను మళ్లీ బుక్ చేసుకోవడంపైనా ఆంక్షలు విధించింది. సింపుల్‌గా చెప్పాలంటే.. మార్కెట్లో డాలర్ల డిమాండ్‌ను తగ్గించడం.. రూపాయిపై ఒత్తిడి పెంచే ఊహాగానాలకు అడ్డుకట్ట వేయడం.. ఇదే ఆర్బీఐ ప్లాన్. రూపాయి పెరిగిందని పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కాదు. చమురు ధరలు ఎక్కువగా ఉండటం, విదేశీ పెట్టుబడులు తగ్గడం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. పైగా ఈ చర్యలతో నిజంగా విదేశీ కరెన్సీ రిస్క్‌ను తగ్గించుకునే వ్యాపారాల ఖర్చులు కూడా పెరగొచ్చని కొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి.. ఆర్బీఐ చర్యలతో రూపాయికి తాత్కాలికంగా భారీ ఊరట లభించింది. కానీ ఈ పెరుగుదల ఎంతకాలం కొనసాగుతుంది? డాలర్‌తో పోరులో రూపాయి మళ్లీ బలపడుతుందా? లేక చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ఒత్తిడితో తిరిగి పడిపోతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
Also read: నా పెళ్లి నిర్ణయం అతని చేతుల్లోనే… పెళ్లి వార్తలపై మమిత క్రేజీ రియాక్షన్!