ఓటమికి కారణాలు ఇవే..
ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అవ్వడానికి బిజెపి దూకుడు ఒక కారణం అయితే.. ఆప్ పతనానికి ప్రధానంగా పది అంశాలు ప్రభావం చూపించాయి. అందులో, ఆమ్‌ఆద్మీ కొంప ముంచిన లిక్కర్ స్కాం ప్రధానమైనది. అలాగే, గత రెండు పర్యాయాల్లో అధికార పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు రావడం కూడా ఈ ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇక, ఆమ్ ఆద్మీని అని చెప్పుకునే కేజ్రీవాల్ కొన్ని కోట్లు ఖర్చుచేసి విలాసవంతమైన శీష్‌మహల్ నిర్మించుకున్నాడని మోడీ డైరెక్ట్ ఎటాక్ చేయడం.. దానికి ఆప్ నుండి సరైన కౌంటర్లు రాకపోవడం కూడా కేజ్రీవాల్ కొంపముంచిందనే చెప్పాలి.
కేజ్రీవాల్ రెండో పర్యాయం ఢిల్లీ గద్దెనెక్కిన తర్వాత అహంకారం మరింత పెరిగిందనే విమర్శలు ఎదుర్కున్నారు. నిందితుడిగా జైలుకు వెళ్లిన తర్వాత కూడా నిజాయితీగా రాజీనామా చేయకుండా.. జైలు నుంచే కొన్నాళ్లు పాలన కొనసాగించడం ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలను పెంచింది. ఇది రాజకీయ నియంతృత్వం అంటూ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే.. దానిపై సరైన వివరణ ఇవ్వని కేజ్రీవాల్.. అధికారం కోసమే ఆరాటపడ్డారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇక, ఎన్నికలకు కొన్నాళ్ల ముందు తన మంత్రి వర్గంలోని అతిశీని సీఎం చేసినా.. కేజ్రీవాల్ కోసం సెపరేట్ కుర్చీ మెయింటైన్ చేయడం బానిసత్వమనే ఆలోచనను రేకెత్తించింది. సీఎంగా ఆమెపై తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి.
ఇక లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఖంగుతిన్న ఆమ్‌ఆద్మీ- కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కుదరక పోవడం కూడా ఢిల్లీ ఓటర్ల అభిప్రాయాలను మార్చేశాయి. అంతా అనుకున్నట్లే ఓట్ల చీలిపోవడంతో అది బీజేపికి కలిసొచ్చింది. ఇక, ఇప్పటికే పలు పర్యాయాలు కేజ్రీవాల్‌ని నమ్మిన ఢిల్లీ ఓటర్లు.. మూడోసారి, మార్పు కోరుకున్నారు. సహజంగానే ప్రజల్లో వచ్చే వ్యతిరేకత కేజ్రీవాల్‌కు శాపంగా మారింది. దీనితో పాటు, ఢిల్లీ అభివృద్ధిలో అనుకున్నంత మార్కులు రాకపోవడం కూడా కేజ్రివాల్ ర్యాంక్‌ను తగ్గించింది. ముఖ్యంగా, యమునా నది విషయంలో కేజ్రీవాల్ వ్యూహం బెడిసికొట్టడం.. నియంత్రణలేని పొల్యూషన్‌పై అధికార పార్టీ సమాధానం చెప్పకుండా.. బీజేపిపై బురద చల్లాలని చూడటం దెబ్బకొట్టింది.
ఢిల్లీ నగరంలో విద్యావంతులను కూడా కేజ్రీవాల్ మెప్పించలేకపోయారు. ఎలక్షన్ కమీషన్‌ను టార్గెట్ చేస్తూ కేజ్రీవాల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు విద్యావంతుల్లో వ్యతిరేకతను పెంచాయి. ఇక, పాత కాపులకే పెద్దపీట వేస్తూ.. నవతరానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఆప్ పతనానికి కారణం అయ్యింది. ప్రస్తుతం, ఆమ్ ఆద్మీ పార్టీలో లోపించిన కొత్త దనం మెజారిటీని ఆకర్షించలేకపోయింది. ప్రజా పార్టీగా వచ్చిన ఆమ్‌ఆద్మీలో వ్యక్తిస్వామ్యం పెరగడం.. కేజ్రీవాల్ సొంత పార్టీగా ఆప్ మారిందనే విమర్శల మధ్య కేజ్రీవాల్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
Also Read: ఢిల్లీ గడ్డపై కమల వికాసం.. ఆప్ పని ఖతమేనా!
కేజ్రీవాల్ నాయకత్వం ఫెయిల్యూర్‌తో కమలం పార్టీ ‘పాంచ్’జన్య అస్త్రం చారిత్రక ఫలితాలను అందించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ మూలాల్ని దెబ్బకొట్టడంలో బీజేపి సక్సెస్ అయ్యింది. లిక్కర్ స్కామ్‌ని బాగా హైలైట్ చేసిన బీజేపి నేతలు.. అవినీతిపై పోరాటంతో పుట్టిన ఆప్‌లో.. అవినీతిపరులు ఉన్నారని బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి తోడు, ఆప్ మాదిరిగానే ఉచిత హామీలు గుప్పించడం.. బడ్జెట్‌లో ఐటీ వరాలు… మధ్యతరగతి ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపడానికి కారణం అయ్యాయి.
ఆమ్‌ఆద్మీ పార్టీలో నాయకత్వలేమిని హైలైట్ చేయడంలో బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్ జైలుకెళ్లినప్పుడు అతని భార్య పెత్తనం, తర్వాతే అతీషీ సీఎం అవ్వడం ఆప్‌లో నిరంకుశ భావాలను బయటపెట్టాయి. అన్నింటి కంటే ముఖ్యంగా.. ప్రధాని మోడీ నాయకత్వంపై నమ్మకం పెంచుకున్నారు రాజధాని ఓటర్లు. మోడీ కూడా ఢిల్లీపై ముందు నుంచే ఫోకస్ పెట్టడం వల్ల బీజేపీ వైపు ఓటర్లు మొగ్గుచూపారు. ఢిల్లీ బీజేపీ నేతలు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆప్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంట్రవర్సీ కామెంట్లతో ప్రజల్లో బీజేపీపై నిత్యం చర్చ జరిగేలా చూడటంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికి బీజేపీ అనుకున్నట్లే మెజారిటీతో రాజధానిలో 27 ఏళ్ల తర్వాత జెండా పాతారు.