Mahila Samriddhi Yojana: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఆప్ మూడోసారి పోటీ చేసి ఓడిపోగా, దాదాపు 17 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా ప్రస్తుతం కీలక సవాళ్లను ఎదుర్కొంటోంది. యమునా నది క్లీనింగ్ సహా మహిళలకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2500 నగదు బదిలీ చేస్తామన్న హామీలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తన మ్యానిఫెస్టోలో మహిళలకు ప్రతి నెలా రూ. 2500 ఇస్తామని ప్రకటించిన స్కీం విషయంలో తాజాగా కీలక ప్రకటన వచ్చింది. ఈ స్కీం కోసం మహిళా దినోత్సవం రోజు అంటే, మార్చి 8 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ తెలిపారు. మహిళలు ఈ సౌకర్యాన్ని పొందేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు.
స్పష్టమైన వర్గీకరణ లేకుండా ఆర్థిక సహాయం ఎవరికి పంపిణీ చేయాలో నిర్ణయించడం సవాలుగా ఉంటుందని ఎంపీ అన్నారు. మార్చి 8న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇది పూర్తి కావడానికి దాదాపు ఒక నెల సమయం పడుతుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత నిధుల పంపిణీని సమర్థవంతంగా చేస్తామన్నారు.
Read Also: Uttarakhand Chamoli: తెలంగాణ మాదిరిగా.. ఇక్కడ కూడా 8 మంది మృతి
దీంతోపాటు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ శాసనసభ పనితీరు గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ పనిచేయాలని కోరుకోవడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా ముఖ్యమైన నిర్ణయాల చర్చల విషయంలోనే ప్రతిపక్షం సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశం సజావుగా సాగాలని మేము కోరుకుంటున్నామని, అందుకు ప్రతిపక్షం కూడా సహకరించాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు పార్టీ విభేదాలను పక్కనపెట్టి ఓటర్ల ప్రయోజనం కోసం కలిసి పనిచేయాలని ఆయన కోరారు.
మరోవైపు ఈ నెలలో దేశ రాజధానికి 1,000కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని ఢిల్లీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ ప్రస్తుతం రూ. 235 కోట్ల నష్టంలో ఉందని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికపై పనిచేస్తోందని, ఏడాదిలోపు ఈ రంగాన్ని లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలు ప్రైవేట్ వాహనాలపై తక్కువగా ఆధారపడేలా ప్రజా రవాణాను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. క్రమంలో ఢిల్లీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడం మా మొదటి అడుగని, ఆ తర్వాత రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
వీటిని ప్రవేశపెట్టడం ద్వారా ఢిల్లీలో కాలుష్యం కూడా తగ్గుతుందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఢిల్లీ ప్రజలు ఈ కొత్త అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. అయితే మార్చి 8 నుంచి మహిళల స్కీం కోసం రిజిస్ట్రేషన్ మొదలైతే ఎప్పుడు అమలు చేస్తారని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.