Sambhal Talaq| ఒక యువతి యూట్యూబ్‌లో వీడియో చూస్తూ ఉండగా.. అప్పుడే అక్కడికి ఆమె భర్త వచ్చాడు. ఆ వీడియోల్లో తప్పుడు సమాచారం చూపిస్తున్నారని.. చూడొద్దని ఆగ్రహంగా చెప్పాడు. కానీ ఆమె తన ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నాడిని వాదించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. చివరికి ఆమె భర్త ఆమెకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటనతో షాక్ కు గురైన యువతి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లాలో జరిగింది.
సంభల్ జల్లాల్లో కొన్ని రోజుల క్రితం మొఘల్ సామ్రాజ్య కాలం నాటి షాషి జామా మసీదులో పురావస్తు శాఖ సర్వే జరిపింది. మసీదు కింద శివాలయం ఉందని కోర్టులో పిటీషన్ వేయగా.. కోర్టు పిటీషన్ వేసిన కొన్ని గంటల్లోనే విచారణ చేపట్టింది. కేసు విచారణలో మసీదు తరపున ముస్లింలు ఎవరూ లేకుండానే పురావస్తు శాఖకు సర్వే చేపట్టాలని ఆదేశాలు జరీ చేసింది. ఆ వెంటనే పురావస్తు శాఖ అధికారులు కొన్ని గంటల వ్యవధిలోనే మసీదు వద్దకు ఏ మాత్రం భద్రత లేకుండా వెళ్లి సర్వే చేపట్టారు. సంభల్ ప్రాంతంలో మొత్తం 72 శాతానికి పైగా ముస్లింలు ఉన్నారు. ఆ ప్రాంతంలోని అతిపెద్ద మసీదుగా షాహి జామా మసీదు ప్రసిద్ధి పొందింది. పైగా ఇది తొలి మొఘల్ చక్రవర్తి బాబార్ నిర్మించారని ప్రచారంలో ఉంది.
ఈ నేపథ్యంలో మసీదును కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆ ప్రాంతంలో ప్రచారం జరిగింది. దీంతో అక్కడ భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. అక్కడ మసీదుని కూల్చేస్తే సహించేది లేదని జనం నినాదాలు చేశారు. ఈ ఉద్రిక్త వాతావరణంలో పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన కాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడిన వారున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చివరికి సుప్రీం కోర్టు కలుగు జేసుకొని సంభల్ కోర్టుకు ఈ కేసులో విచారణ కొనసాగించకుండా అడ్డుపడింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం హైకోర్టు చేపట్టాలని నిర్దేశించింది.
Also Read: మోడీ వ్యతిరేకి ఐపిఎస్ ఆఫీసర్‌కు కోర్టులో ఊరట.. లాకప్ డెత్ కేసులో నిర్దోషిగా తీర్పు
అయితే ఈ వ్యవహారం మొత్తంలో సంభల్ జిల్లా అధికారులు, పరిపాలన విభాగం, పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా జిల్లా కలెక్టర్ సంభల్‌లోని వివాదిత ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు రావడంపై నిషేధం విధించారు.
ఈ నేపథ్యంలో సంభల్ జిల్లాకు చెందిన నిదా అనే యువతి రెండు రోజుల క్రితం తన ఇంట్లో కూర్చొని మసీదు వివాదంపై వీడియో చూస్తూ ఉంది. ఆ యూట్యూబ్ వీడియోలో నిరసనకారులను తప్పబడుతూ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియో నిదా చూస్తూ ఉండగా.. ఆమె భర్త అక్కడికి వచ్చాడు. అలాంటి వివాదిత వీడియోలు చూడవద్దు.. అంతా రాజకీయాలని చెప్పాడు. కానీ నిదా మాత్రం తన బంధువుల పెళ్లి ఆ ప్రాంతంలో జరుగుతోందని.. అందుకోసం అక్కడ పరిస్థితులు గురించి తెలుసుకోవడానికి చూస్తున్నానని వాదించింది. అయితే ఆమె కోర్టు ఆదేశాలు, పోలీసుల చర్యలు తప్పు కాదని కూడా చెప్పింది.
దీంతో ఆమె భర్త కోపంగా ఆమె ఒక నిజమైన ముస్లిం కాదని.. తీర్మానిస్తూ.. అలాంటి మహిళతో తాను కాపురం చేయనని చెప్పి.. ఆమెకు విడాకులిచ్చేందుకు తలాక్ తలాక్ తలాక్ అని మూడు సార్లు పలికి ఇస్లాం సంప్రదాయాల ప్రకారం విడాకులిచ్చాడు.
అయితే 2017 సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ఒకేసారి మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం నేరం. ఇలా చేస్తే విడాకులకు అమోదం ఉండదని తీర్పుచెప్పింది. 2019 సంవత్సరంలో కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణ తలాక్ కు వ్యతిరకంగా చట్టం తీసుకువచ్చింది.
ఈ కారణంగా నిదా తన భర్త చట్టవ్యతిరేకంగా తనకు తక్షణ తలాక్ ఇచ్చాడని కేసు నమోదు చేసింది.