Shiv Sena Anna Hazare | ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలవడంపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సంతోషంగా ఉన్నారని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఆదివారం పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఆరోపణలపై మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించారు. ‘‘మోదీ పాలనలో అవినీతి చోటుచేసుకున్నప్పుడు హజారే ఎక్కడున్నారు. కేజ్రీవాల్ ఓటమిపై అన్నా సంతోషంగా ఉన్నారు. ఓ పారిశ్రామికవేత్త చేతిలో సంపద కేంద్రీకృతమవుతూ దేశం లూటీ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగించగలదు. అన్నా హజారే ఈ సమయంలో మౌనంగా ఉండడం వెనుక ఏ రహస్యం ఏమిటి’’ అని సంజయ్ రౌత్ నిలదీశారు.
‘‘మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఓటర్ల జాబితాల గందరగోళం ఒకే తరహాలో ఉంది. అయితే ఈ అంశంపై హజారే మౌనంగా ఉన్నారు. ఇలాంటి ఫిర్యాదులే హరియాణా ఎన్నికల సమయంలోనూ వచ్చాయి. రేపు బిహార్ ఎన్నికల్లోనూ వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. 2014లో బిజేపీ అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగ పరమైన పద్ధతులను పాటించడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై లోక్ పాల్ బిల్లు ఉద్యమ నాయకుడు, గాంధేయవాది అన్నా హజారె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్ మద్యం విక్రయాలతో వచ్చే ధనం కోసం ఆశపడి తన ఓటమి కొనితెచ్చుకున్నారని అన్నా హజారె తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. కేజ్రీవాల్ రాజకీయాలలో పడి తన మూల సిద్ధాంతాలను మరిచారని చురుకుగా విమర్శించారు.
Also Read: ఢిల్లీ తరువాత బెంగాల్ వంతు.. మమతా బెనర్జీకి బిజేపీ నాయకుల హెచ్చరిక
“నేను ముందు నుంచీ చెబుతూ ఉన్నాను. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఉద్దేశం శుద్ధిగా ఉండాలి. ఆలోచనలు శుద్ధిగా ఉండాలి. అభ్యర్థి చరిత్రపై ఎటువంటి మచ్చలు ఉండకూడదు. జీవితం నిష్కలంకంగా ఉండాలి. అభ్యర్థి జీవితంలో త్యాగం ఉండాలి. ఎవరైనా అవమానిస్తే సహించే శక్తి ఉండాలి. ఈ గుణాలు ఒక ఎన్నికల అభ్యర్థిలో ఉంటే ప్రజలు అతని విశ్వసిస్తారు. ఈ వ్యక్తి తమ కోసం ఏదైనా చేస్తాడు అని. నేను ఈ విషయాలు పలుమార్లు చెబుతూనే ఉన్నాను. కానీ ఆయన (కేజ్రీవాల్) నన్ను పట్టించుకోలేదు. చివరకు ఆయన ఒక అంశాన్ని లేవనెత్తారు. అదే మద్యం. మద్యం విక్రయాలు. మద్యం గురించి ఎందుకు లేవనెత్తాడంటే.. దాని ద్వారా ధనం, విపరీతమైన ధనం వస్తుంది కాబట్టి. ఆ ధనం కోసం ఆశపడే ఆయన మొత్తం కోల్పోయారు”. అని అన్నా హజారే కేజ్రీవాల్ తీరును తప్పుపట్టారు.
అంతకుముందు ఫిబ్రవరి 5, 2025న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమయంలో కూడా అన్నా హజారె ఇలాగే స్పందించారు. “కేజ్రీవాల్ చేసుకున్న పాపానికి అనుభవిస్తారని హెచ్చరించారు. కేజ్రీవాల్ సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించిన సమయం నుంచి ఆయనతో తాను మాట్లాడడం మానేశానని చెప్పారు. ఏదో సమాజ సేవ కార్యక్రమం కోసం ఇద్దరం కలిసి పనిచేశాం. అంతవరకే. తాను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదని.. కానీ చేసుకున్న పాపం అనుభవించక తప్పదు” అని చెప్పారు.
87 ఏళ్ల అన్నా హజారె.. 2011లో కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు లోక్ పాల్ చట్టం కోసం ఉద్యమాన్ని నడిపారు. ఆయన ఢిల్లీలోనే నిరాహార దీక్ష చేపట్టి.. ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్.. అన్నా హజారె ఉద్యమంలో భాగంగా ఉన్నారు.
అయితే అన్నా హజారే ఎప్పుడూ బిజేపీ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లలో అవినీతి గురించి, నోట్ల రద్దు గురించి.. ప్రజా సమస్యలపై బహిరంగంగా మాట్లాడకపోవడంతో ఆయన బిజేపీ వ్యక్తిఅని పరోక్షంగా విమర్శలున్నాయి.