Shiv Sena Minister: మహారాష్ట్రలో పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్ననోట్ల కట్ల వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. మంత్రి బెడ్‌రూమ్‌లో నోట్ల కట్టలు దుమారం రేపుతున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి బెడ్‌రూమ్‌లో సిగరెట్ తాగుతూ.. పక్కనే డబ్బుతో నిండి ఉన్న సూట్‌కేస్ వీడియో వైరల్ అవుతోంది. నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మంత్రి సమయం కోరారు.
సంచలనం కలిగించిన వీడియో
ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మహారాష్ట్ర అధికార పార్టీలో.. కీలక మంత్రిగా ఉన్న సంజయ్ శిర్సాత్ అని ప్రచారం సాగుతోంది. వీడియో వైరల్ కావడంతో, ప్రతిపక్ష పార్టీలు, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనం ఇలా దాచిపెట్టడమా? ప్రభుత్వ బాధ్యతా వహించిన వ్యక్తి బెడ్‌రూమ్‌లో నోట్ల కట్టలతో ఉన్నాడా? అనే ప్రశ్నలు విస్తృతంగా చర్చకు వచ్చాయి.
మంత్రిపై ఆరోపణలు – ఆయన స్పందన
సంజయ్ రౌత్ ఆరోపణలపై మంత్రి సంజయ్ శిర్సాత్ స్పందించారు. ఇదంతా తనను ఇరికించేందుకు జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. ఆ డబ్బు గురించి తనకేమి తెలియదని.. తాను ప్రయాణం నుంచి తిరిగి వచ్చాక.. బట్టలు తీసి పడకగదిలో కూర్చున్నానని మంత్రి చెబుతున్నారు. అప్పుడు తన పెంపుడు కుక్క తన పక్కనే ఉందని..
బహుశా అప్పుడే ఎవరో వీడియో తీసి ఉంటారని వివరణ ఇస్తున్నారు.
నా దగ్గర డబ్బుంటే బీరువాలో దాచేవాణ్ని
తన దగ్గర అంత డబ్బే ఉంటే బీరువాలో దాచే వాడినంటున్నారు. ఎవరో కావాలనే ఈ వీడియో తీసి.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సంజయ్ శిర్సాత్ ఆరోపిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఐటీ శాఖకు వివరణ ఇస్తానన్నారు. కొందరు కావాలనే తనపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారని.. అందుకే తనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు
మంత్రి చెప్పుకొచ్చారు.
రాజకీయ ప్రభావం
ఈ ఘటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వాగ్వాదం మొదలైంది. ప్రతిపక్షాలు మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం దీనిని వ్యూహాత్మకంగా రూపొందించిన దుష్ప్రచారంగా పేర్కొంటోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది.
Also Read: ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల ఆస్తులపై కీలక ఆదేశాలు
వాస్తవంగా ఈ వీడియో ఎప్పుడు తీసింది? అందులో ఉన్న డబ్బు ఎవరిది? ఈ వ్యవహారంలో అసలు నిజాలు బయటపడాలంటే, విచారణ తప్పనిసరి. ఐటీ శాఖ విచారణతో పాటు, రాజకీయ పరమైన తీర్పులు కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఒక ప్రజాప్రతినిధి మీద ఇలాంటి ఆరోపణలు రావడం, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే.. అధికార పక్షం స్పష్టమైన నివేదికతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది.