Big Stories

Karnataka: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్..

Karnataka: కర్ణాటకలో ఎన్నికలకు ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కాషాయ పార్టీని సీనియర్ నేత ఊహించని దెబ్బకొట్టారు. మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి జగదీశ్ శెట్టర్ రాజీనామా చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

- Advertisement -

బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. జగదీశ్ శెట్టర్ కు కాంగ్రెస్ కండువా కప్పి ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

కర్ణాటకలో జగదీశ్ శెట్టర్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో సీఎంగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత బీజేపీ అధిష్టానంపై జగదీశ్ శెట్టర్ తీవ్ర విమర్శలు చేశారు. తనకు బీజేపీ టిక్కెట్‌ వస్తుందని ఆశించానన్నారు. కానీ టిక్కెట్ రాలేదని తెలియగానే షాక్‌కు గురయ్యానని తెలిపారు. టిక్కెట్ ఇవ్వటంలేదనే విషయాన్ని ఎవరూ కూడా తనకు తెలపలేదన్నారు. కనీసం ఒప్పించే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనకు పెద్ద పదవి ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చేసిన ప్రకటనపైనా స్పందించారు. తనకు బీజేపీ అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వలేదని జగదీశ్ శెట్టర్ స్పష్టం చేశారు.

కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలున్నాయి. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అధికారం కోసం పోటీ పడుతున్నాయి. పూర్తి మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. హంగ్ ఏర్పడితే అధికారం దక్కుతుందన్న ఆశలో జేడీఎస్ ఉంది.

రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది. బీజేపీకి ప్రతి విషయంలో ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. అమూల్ , నందిని పాల వివాదం బీజేపీకి తలనొప్పిగా మారింది. టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం కాషాయ పార్టీలో నిప్పు రాజేస్తోంది. ఇప్పటికే చాలామంది నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. మరి కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News