GST Notices: కర్ణాటకలోని వాణిజ్య పన్నుల శాఖ, యూపీఐ ద్వారా ఏటా రూ.40 లక్షలకు పైగా సంపాదిస్తున్న వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు జారీ చేసింది. దీంతో బెంగళూరులోని చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను నిరాకరిస్తూ నగదు చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నోటీసులు జీఎస్టీ చట్టం ప్రకారం నమోదు లేకుండా లేదా పన్ను చెల్లించకుండా వ్యాపారం చేస్తున్న వారిపై దృష్టి సారించాయి. 2021-22 నుండి 2024-25 వరకు యూపీఐ సేవల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా 14,000 మంది వ్యాపారులను గుర్తించారు. వీరిలో చాలా మంది జీఎస్టీ నమోదు లేదా పన్ను చెల్లింపు నిబంధనలను పాటించలేదు. ఈ చర్యలు వ్యాపారులలో భయాందోళనలకు దారి తీసింది. ఫలితంగా కొందరు యూపీఐ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను తొలగించి, కేవలం నగదు మాత్రమే ఇవ్వాలని సూచించే నోటీసులను ప్రదర్శిస్తున్నారు.
మే నెలలో దేశంలోని మొత్తం యూపీఐ లావాదేవీలలో 7.73% వాటాతో కర్నాటక రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో మహారాష్ట్ర (13.19%) ఉంది. జీఎస్టీ చట్టం ప్రకారం, వస్తువుల వ్యాపారంలో 40 లక్షల రూపాయలు లేదా సేవల వ్యాపారంలో 20 లక్షల రూపాయలు దాటిన టర్నోవర్ ఉన్నవారు జీఎస్టీ నమోదు చేయాలి. యూపీఐ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఈ టర్నోవర్‌లో భాగంగా పరిగణించనున్నారు. అయితే, కొందరు వ్యాపారులు తమ యూపీఐ లావాదేవీలను దాచడం లేదా సరైన రికార్డులను నిర్వహించకపోవడం వల్ల పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని గుర్తించారు.
ఈ నోటీసులు వ్యాపారులను ఆందోళనను కలిగించడమే గాక, వినియోగదారులకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం అలవాటైన వినియోగదారులు ఇప్పుడు నగదు కోసం ఎటీఎంలకు వెళ్లాల్సి వస్తోంది. కొందరు వ్యాపారులు, ముఖ్యంగా ఉత్తర బెంగళూరులోని సుధాకర్ షీనప్ప షెట్టి వంటివారు, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంతో చర్చలు జరపాలని యోచిస్తున్నారు. అయితే, కొందరు ఈ చర్యను సమర్థిస్తూ, జీఎస్టీ నిబంధనలను అందరూ పాటించాలని, చిన్న వ్యాపారుల పేరుతో పన్ను ఎగవేతను అనుమతించకూడదని వాదిస్తున్నారు.
ALSO READ: FBO Notification: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు
కమీషనర్ విపుల్ బన్సాల్ ప్రకారం..ఈ నోటీసులు భయపెట్టడానికి కాదని.. కానీ వ్యాపారులు తమ స్థితిని వివరించే అవకాశం కల్పించడానికి అని అన్నారు. కాంపోజిషన్ స్కీమ్‌లో నమోదైన వారు కేవలం 1% జీఎస్టీ చెల్లిస్తారు. ఇది చిన్న వ్యాపారులకు ఊరటనిస్తుంది. అయినప్పటికీ, ఈ చర్యలు యూపీఐ వినియోగంపై ప్రభావం చూపవచ్చని, డిజిటల్ చెల్లింపుల పెరుగుదలకు అడ్డంకిగా మారవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: IND vs ENG 3rd Test: జడేజా ఒంటరి పోరాటం వృధా… మూడో టెస్టులో టీమిండియా ఓటమి