Arunachal Pradesh News: అరుణాచల్ ప్రదేశ్‌లోని లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని రోయింగ్ పట్టణంలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. అస్సాంలోని బొంగైగావ్‌కు చెందిన 19 ఏళ్ల వలస యువకుడు రియాజ్-ఉల్ కురిమ్ పాఠశాలలోని పలువురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ సంఘటన తర్వాత స్థానికుల ఆగ్రహానికి లోనై యువకుడిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనతో రోయింగ్‌లో ఉద్రిక్తతలు నెలకొనడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.
ఈ యువకుడు స్థానిక మౌంట్ కార్మెల్ స్కూల్ సమీపంలోని నిర్మాణ స్థలంలో పనిచేసేవాడు. అయితే అక్కడ పాఠశాలలోని 5 నుంచి 9 సంవత్సరాల వయస్సు గల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. బాధిత బాలికలు కడుపు నొప్పి ఫిర్యాదు చేయడంతో వారి తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఈ ఆరోపణల గురించి తెలిసిన స్థానికులు, దాదాపు 500 మంది పోలీసు స్టేషన్‌పై దాడి చేసి, ఆ యువకుడిని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. పోలీసులు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, స్థానిక ప్రజలు మళ్లీ కొట్టడంతో చివరకు అతను మరణించాడు. ఈ ఘటన తర్వాత, రోయింగ్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు సెక్షన్ 144 కింద కర్ఫ్యూ విధించారు. అదనపు భద్రతా దళాలను మోహరించారు.
ALSO READ: FBO Notification: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల, హాస్టల్ నిర్వహణపై నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యాలపై కూడా విచారణ జరుగుతోంది. జిల్లా యంత్రాంగం పాఠశాల హాస్టల్‌ను నిర్దిష్ట కాలంపాటు మూసివేసి, తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాలని సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తోంది.
ALSO READ: Watch Video: కెనడాలో అలా చేస్తూ దొరికిన భారత జంట.. వీడియో వైరల్