Sonipat Marriage: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలతో యువతిని మోసం చేసిన ఘటన హర్యానాలోని సోనిపట్‌లో వెలుగుచూసింది. నిందితుడు తన అసలు పేరు, మతాన్ని దాచి హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడని.. తర్వాత తనపై తీవ్ర వేధింపులకు పాల్పడుతూ మతం మారాలని ఒత్తిడి తీసుకొచ్చాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి కథనం ప్రకారం.. సోనిపట్‌కు చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమెకు పరిచయమయ్యాడు. ఆ సమయంలో తన పేరు ‘జానీ’ అని.. తాను హిందూ మతస్థుడినని ఆమెను నమ్మించాడు. కొన్నాళ్ల పాటు సాగిన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దంపతులుగా ఒకే ఇంట్లో కాపురం పెట్టారు.
పెళ్లయిన దాదాపు ఆరు నెలల వరకు అంతా సజావుగానే సాగింది. అయితే ఒకరోజు భర్త బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో ‘జావేద్ ఖాన్’ పేరుతో ఉన్న ఒక ఆధార్ కార్డు ఆమెకు దొరికింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె.. భర్తను నిలిసింది. దీంతో అతడు ముస్లిం మతానికి చెందినవాడని తేలింది. అంతేకాకుండా అతడికి 12 సంవత్సరాల క్రితమే వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారనే దారుణ నిజం వెలుగులోకి వచ్చింది.
నిజం తెలిసిన కొద్దిరోజులకే జావేద్ మొదటి భార్య వచ్చి బాధితురాలితో గొడవపడింది. అనంతరం జావేద్ ను తనతో తీసుకెళ్లిపోయింది. అయితే కొన్నిరోజుల తర్వాత తిరిగి వచ్చిన జావేద్.. తన కుటుంబం ఆమెతో ఉండనివ్వడం లేదని చెప్పాడు. ఈ క్రమంలో బాధితురాలికి నచ్చజెప్పి యూపీలోని బుధానా ప్రాంతానికి ఆమెతో మకాం మార్చారు. అక్కడ వారికి ఒకపాప జన్మించిన అనంతరం తిరిగి సోనిపట్‌కు తిరిగి వచ్చి నివాసముంటున్నారు.
కొద్దికాలం బాగానే ఉన్న నిందితుడు జావేద్ అతడి కుటుంబం.. బాధితురాలి మతం మార్చేందుకు యత్నించారు. ఆమెతో పాటు కూతురు సైతం మతం మారాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో స్థానిక హిందూ రక్ష సేన ప్రతినిధులు బాధితురాలికి అండగా నిలబడ్డారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇరు కుటుంబాలను స్టేషన్ కు పిలిపించారు. పూర్తి విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!