Hyderabad Crime News: కారణం ఏమైనా కావచ్చు.. కాకపోతే కాళ్లు, చేతులు కట్టేసి మరీ భర్తను చంపేసింది భార్య. కాకపోతే కొందరు వివాహేతర సంబంధమే కారణమని అంటున్నారు. మరికొందరు మాత్రం అంతర్గత కలహాలు వల్లే ఇదంతా జరిగిందని అంటున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో?
అసలేం జరిగింది?
హైదరాబాద్‌లో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించి కీలక విషయాలు బయటపెట్టారు చాంద్రాయణగుట్ట ఏసీపీ. బంజారాహిల్స్ కు చెందిన 57 ఏళ్ల మసీయుద్దీన్ కొన్నేళ్ల కిందట షబానాను మూడో పెళ్లి చేసుకున్నాడు. వృత్తి రీత్యా ఆయనొక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అప్పటికే ఆమెకు సమీర్ అనే కొడుకు ఉన్నాడు.
షబానా ఫ్యామిలీ ప్రస్తుతం బండ్లగూడ క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటోంది. వీలు చిక్కినప్పుడల్లా మసీయుద్దీన్ రోజూ వచ్చి వెళ్లేవాడు. అంతర్గతంగా గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలీదు. కాకపోతే సోమవారానికి అవి మరింత ముదిరాయి.
ఈ క్రమంలో మసీయుద్దీన్ తన భార్య షబానాతో గొడవపడ్డాడు. ఇరువైపుల కోపం కట్టలు తెచ్చుకుంది. పాత వ్యవహారాలను బయటకు లాగారు. అక్కడితో సీన్ అయిపోయింది. మంగళవారం ఉదయం మసీయుద్దీన్ మళ్లీ భార్య ఇంటికి వచ్చాడు. అప్పటికే షబానా, ఆమె కొడుకు సమీర్, అతడి ఫ్రెండ్ ఫరీద్ ఇంట్లో ఉన్నారు.
ALSO READ: అడ్డదిడ్డంగా రోడ్డు దాటేందుకు బైకర్ ప్రయత్నం
మరొకరి సహాయంతో మర్డర్ ప్లాన్
ముందుగా వేసుకున్న పక్కా ప్లాన్ ప్రకారం తల్లికొడుకు(షబానా, సమీర్)తో కలిసి చున్నీతో మసీయుద్దీన్ చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కాళ్లు కట్టేశారు. అరుపులు బయటకు వినబడకుండా నోట్లో బట్టలు కుక్కారు. ఫ్రెండ్ ఫరీద్‌తో కలిసి మసీయుద్దీన్ గొంతు కోసి హత మార్చింది.
ఫ్యామిలీ కలహాలే కారణమా?
ఘటన తర్వాత గత రాత్రి బండ్లగూడ పోలీసుస్టేషన్‌లో నిందితులు లొంగిపోయారు. రియల్టర్ మసీయుద్దీన్ హత్య విషయాన్ని పోలీసులకు చెప్పారు. అయితే షబానా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, రంగంలోకి దిగేశారు.
మసీయుద్దీన్ హత్య జరిగిన ప్రాంతానికి చేరారు. బెడ్ రూమ్‌లో మసీయుద్దీన్ మృతి చెంది ఉన్నాడు. ఈ కేసు వ్యవహారం పోలీసులకు మిస్టరీగా మారింది. నిందితులు నోరు తెరిస్తే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశముంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.