Big Stories

Suchana Seth | 5 స్టార్ హోటల్‌లో 4 ఏళ్ల బాలుడి హత్య.. థ్రిలర్ సినిమాను తలపించే ట్విస్ట్!

Suchana Seth | గోవాలోని ఒక పెద్ద హోటల్‌లో ఒక మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో వచ్చింది. కానీ తిరిగి వెళ్లే సమయంలో ఆమెతో పాటు ఆ పిల్లాడు లేడు. ఆమె ఖాళీ చేసిన హోటల్ గదిలో కూడా లేడు. అయితే ఆమె వెళ్లిపోయాక హోటల్ గదిలో చూస్తే కొన్ని రక్తపు మరకలున్నాయి. అది చూసిన హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది.

- Advertisement -

అప్పటికే ఆ మహిళ ఒక ట్యాక్సిలో బయలుదేరి వెళ్లిపోయింది. అయితే ఆ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ నెంబర్ తెలుసుకొని.. పోలీసులు ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేశారు. వెంటనే తన ట్యాక్సీ తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అలా ఆ ట్యాక్సీ డ్రైవర్ మహిళను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు ఆమె లగేజ్‌ని చెక్ చేయగా.. ఒక పెద్ద బ్యాగులో ఆ నాలుగేళ్ల పిల్లాడి శవం లభించింది. ఈ కేసు దేశమంతా సంచలనం కలిగింది.

- Advertisement -

పోలీసుల కథనం ప్రకారం.. శనివారం జనవరి 6న సుచనా సేఠ్ అనే 39 ఏళ్ల మహిళ గోవాలో హాలిడే కోసం తన నాలుగేళ్ల కొడుకుతో కలకత్తా నుంచి విమానంలో వెళ్లింది. గోవాలోని కైండోలిమ్ అనే ప్రాంతంలో సోల్ బనియాన్ గ్రాండ్ హోటల్‌‌లో ఒక గది తీసుకుంది. రెండు రోజుల తరువాత సోమవారం జనవరి 8న హోటల్ రిసిప్షన్‌కు ఫోన్ చేసి తనకు గోవా నుంచి బెంగుళూరు వెళ్లేందుకు ఒక ట్యాక్సీ కావాలని అడిగింది. ఇది విని హోటల్ సిబ్బంది ఆశ్చర్య పోయారు.

గోవా నుంచి బెంగుళూరు వెళ్లడానికి విమానంలో ఈజీగా ఉంటుందని.. ట్యాక్సీలో అంతదూరం ప్రయాణం కూడా ఖర్చు ఎక్కువవుతుందని చెప్పారు. కానీ ఆమె తనకు ట్యాక్సీ మాత్రమే కావాలని చెప్పడంతో హోటల్ సిబ్బంది.. ట్యాక్సీని ఏర్పాటు చేశారు. అలా సోమవరాం రాత్రి సుచనా సేఠ్ హోటల్ గది ఖాళీ చేసి బయలుదేరుతున్న సమయంలో ఆమె కొడుకు ఆమెతో లేడు. ఇది చూసి హోటల్ సిబ్బంది ఆ చిన్నపిల్లాడు ఎక్కడ అని అడిగారు. దానికి ఆమె ఏ పిల్లాడు.. తాను ఒంటరిగానే హోటల్‌కు వచ్చినట్టు చెప్పింది. ఆ తరువాత ఆమె ట్యాక్సీలో కూర్చొని బెంగుళూరుకు బయలుదేరి వెళ్లిపోయింది.

ఆమె వెళ్లిన తరువాత హౌస్ కీపింగ్ సిబ్బంది.. హోటల్ గదిని క్లీనింగ్ చేసేందుకు లోపలికి వెళ్లగా వారికి గదిలో రక్తపు మరకలు కనిపించాయి. ఇది వాళ్లు హోటల్ యజమాన్యానికి తెలిపారు. వెంటనే వాళ్లు సిసిటీవి కెమెరాల్లో శనివారం ఆ మహిళ హోటల్‌కు వచ్చినప్పటి వీడియా చూశారు. అందులో ఆమెతోపాటు పిల్లాడు కూడా ఉన్నాడు. అంటే.. సుచనా సేఠ్ అబద్ధం చెప్పింది. హోటల్ మేనేజర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం వివరించారు. పోలీసులు హోటల్ చేరుకొని.. విచారణ చేశారు.

సుచనా సేఠ్‌కు పోలీసులు ఫోన్ చేస్తే.. ఆమె ఫోన్ ఎత్తడం లేదు. దీంతో పోలీసులు ఆ ట్యాక్సీ డ్రైవర్ నెంబర్‌కు కాల్ చేశారు. అతను ఫోన్ సుచనా సేఠ్‌కు ఫోన్ ఇచ్చాడు. ఆమెను పోలీసులు ఆమె పిల్లాడు ఎక్కడున్నాడని అడిగారు. అందుకు ఆమె తన స్నేహితుల ఇంట్లో గోవాలోనే ఉన్నాడని బుకాయించింది. దీంతో పోలీసులకు మరింత అనుమానం కలిగి.. ట్యాక్సీ డ్రైవర్‌తో గోవా భాష కోకనిలో మాట్లాడారు. వెంటనే ట్యాక్సీని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమన్నారు.

అలా ఆ ట్యాక్సీ డ్రైవర్ కర్ణాటకలోని చిత్రదుర్గం పోలీస్ స్టేషన్‌ చేరుకున్నాడు. సుచనా సేఠ్‌ని చిత్ర దుర్గం పోలీసులు అదుపులోకి తీసుకొని.. ఆమె లగేజ్‌ని చెక్ చేశారు. ఒక పెద్ద లగేజ్ బ్యాగ్‌లో ఆమె కొడుకు మృతదేహం లభించింది.

ఆ చిన్నారి బాలుడిని ఎందుకు హత్య చేసింది?
ఏ కేసులో నైనా నేరం చేయడానికి మోటివ్ అంటే కారణం అవసరం. పోలీసులు ముందుగా ఆ కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సుచనా సేఠ్ ఒక సాఫ్టవేర్ ఇంజనీర్. అందులోనూ ఆర్టిఫీషియల్ సైంటిస్ట్. ఒక కొత్త స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు. వృత్తి రీత్యా ఆమె బెంగుళూరులో స్థిరపడింది. అక్కడ ఆమెకు కేరళకు చెందిన వెంకటరామన్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరూ 2010లో వివాహం కూడా చేసుకున్నారు.

వారిద్దరికీ 2019లో ఒక కొడుకు పుట్టాడు. ఆ తరువాత నుంచి ఆలుమగల మధ్య గొడవలు మొదలయ్యాయి. వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. సుచనా సేఠ్ కోర్టులో తన భర్త తనను కొడుతున్నాడని నిందలు వేసింది. విడాకులు కావాలని చెప్పింది. భరణం కింద పెద్ద మొత్తంలో భర్త నుంచి డబ్బులు కావాలని అడిగింది. ఆ విడాకుల కేసు ఇంకా కోర్టులో జరుగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో కోర్టు ఇటీవలే వెంకటరామన్‌ని సుచనా సేఠ్‌కు దూరంగా ఉండాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం కొడుకుతో కలుసుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే సుచనా సేఠ్.. తనకు భరణం డబ్బులు చెల్లించేంతవరకు ఆ ఒక్క ఆదివారం కూడా తండ్రీ కొడుకులు కలుసుకోకూడదని ప్రయత్నించింది. ఇందుకోసం పిల్లాడిని తీసుకొని గోవాకు వెళ్లింది. శనివారం రాత్రి వెంకటరామన్ వీడియో కాల్ చేసి తన కొడుకుతో మాట్లాడినట్లు సమాచారం. ఆ తరువాత సుచనా సేఠ్, వెంకటరామన్ మధ్య ఫోన్‌లోనే గొడవ జరిగింది. భరణం డబ్బులు చెల్లించి.. విడాకులు ఫైనల్ చేసుకోవాలని సుచనా వాదించింది. దీనికి వెంకటరామన్ ఒప్పుకోలేదు. ఆ సమయంలో వెంకటరామన్ పనిమీద ఇండోనేషియాలో ఉన్నాడు. మరుసటి రోజు ఆదివారం కావడంతో మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పాడు.

కానీ సుచనా సేఠ్.. తన భర్తకు బుద్ధిచెప్పాలని కోపంతో తన కొడుకు అని కూడా చూడకుండా నిద్రలో ఉన్న పిల్లాడి ముఖంపై దిండు పెట్టి అతడికి ఊపిరి ఆడకుండా చేసింది. దీంతో ఆ పిల్లాడు చనిపోయాడు. భర్త మీద కోపంతో సుచనా సేఠ్ తనలోని తల్లిని చంపేసింది. ఎంతో మేధస్సు ఉండి.. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా.. మాతృత్వం.. మానవత్వం లేని మృగంగా మాత్రమే.. సుచనా సేఠ్ మిగిలిపోయింది. ఇప్పుడు జీవితమంతా జైలులోనే గడపాల్సిన పరిస్థితి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News